ఈత వచ్చినా... క్వారీ గుంతలో శవమై తేలడంపై అనుమానాలు కేసును నీరుగార్చేందుకు అధికార పార్టీ నేతల ఒత్తిడి?
చేబ్రోలు: చేబ్రోలు మండలం సుద్దపల్లి గ్రామంలో చోటుచేసుకున్న ఓ యువకుడి మృతి తీవ్ర సంచలనంగా మారింది. తాపీ కార్మికుడిగా జీవనం సాగిస్తున్న రాజవరపు నాగేశ్వరరావు (21) క్వారీ గుంతలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. అధికారులు, కొందరు స్థానికులు చెబుతున్న వివరాలకు, వాస్తవ పరిస్థితులకు పొంతన కుదరకపోవడంతో ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మండల పరిధిలోని సుద్దపల్లి గ్రామానికి చెందిన యువకుడు రాజవరపు నాగేశ్వరరావుతో పాటు మరో ముగ్గురు యువకులు కలిసి స్థానిక చెరువు గుంత వద్దకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో వారి మధ్య వివాదం చెలరేగి, ఘర్షణ జరిగినట్లు సమాచారం. అయితే, కొద్దిసేపటికే నాగేశ్వరరావు అక్కడే అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
వీటికి సమాధానమేదీ?
ఈత వచ్చిన వ్యక్తి చిన్న గుంతలో పడి మృతి చెందడమేమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. నాగేశ్వరరావుకు చిన్నతనం నుంచే పెద్ద చెరువులు, బావుల్లో ధైర్యంగా, ఎంతో నైపుణ్యంతో ఈత కొట్టగల సామర్థ్యం ఉంది. అలాంటి నేర్పరి అయిన యువకుడు కేవలం చిన్న చెరువు గుంతలో పడి మరణించాడన్న వాదనను స్థానికులు నమ్మలేకపోతున్నారు. మృతదేహాన్ని పరిశీలిస్తే పలు చోట్ల గాయాలు కనిపిస్తుండటం, కనీసం దుస్తులు కూడా లేకుండా నగ్నంగా గుంతలో పడి ఉండటం ఈ ఘటన వెనుక పెద్ద కుట్ర ఉందనే తీవ్ర ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. పథకం ప్రకారమే నాగేశ్వరరావును హత్య చేశారని మృతుడి బంధువులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇది ముమ్మాటికీ హత్యేనని, ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కేసు పక్కదారి పట్టించే యత్నం
బీసీ సామాజిక వర్గానికి చెందిన యువకుడి మృతి ఘటనను కప్పిపుచ్చి, కేవలం ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా పేర్కొంటూ కేసును మూసివేయడానికి అధికార పార్టీకి చెందిన కొందరు స్థానిక నాయకులు రంగంలోకి దిగినట్లు తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిందితులకు అధికార పార్టీ నాయకుల అండదండలు ఉండటంతో, పోలీసులపై ఒత్తిడి తెచ్చి విచారణను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు బంధువులు, గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పోలీసుల అదుపులో అనుమానితులు
సమాచారం అందుకున్న చేబ్రోలు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయ ఒత్తిళ్లకు తలవంచకుండా సమగ్ర దర్యాప్తు జరిపి, నాగేశ్వరరావు మృతి వెనుక ఉన్న అసలు నిజాలను నిగ్గు తేల్చాలని, తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు కోరుతున్నారు.


