చీరాల రూరల్: ఆంధ్రప్రదేశ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చీరాల రామాపురం బీచ్‌లో నిర్వహిస్తున్న ఏపీ ఇంటర్ డిస్ట్రిక్ట్ బీచ్ ఫుట్‌బాల్ చాంపియన్ షిప్ పోటీలు ఆదివారం ఉత్సాహంగా సాగాయి. శనివారం రాత్రి నిర్వహించిన పోటీల్లో నెల్లూరు – కడప జిల్లాలకు జరిగిన మ్యాచ్‌లో 1–0 స్కోర్ తేడాతో నెల్లూరు జట్టు విజయం సాధించింది. గుంటూరు –పల్నాడు జిల్లాలకు జరిగిన మ్యాచ్‌లో 1–0 తేడాతో గుంటూరు జట్టు విజయం సాధించింది. అనంత పురం – తిరుపతి జిల్లాల జట్లకు జరిగిన మ్యాచ్‌లో 2–1 తేడాతో తిరుపతి జట్టు విజయం సాధించింది. అంబేడ్కర్ కోనసీమ– ఏలూరు జిల్లాల జట్లు తలపడగా.. ఇరుజట్లు ఆట ముగిసే సమయానికి ఎటువంటి గోల్స్ సాధించకపోవడంతో మ్యాచ్‌ను డ్రాగా ముగించారు. జరిగిన 11 మ్యాచ్‌లకు గాను విశాఖపట్టణం, గుంటూరు, తిరుపతి, కృష్ణా, నెల్లూరు, ఎన్‌టీఆర్, అనంతపురం, కాకినాడ జట్లు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించాయి.
హోరాహోరీగా క్వార్టర్ ఫైనల్
మొదటి క్వార్టర్ ఫైనల్ పోటీలో విశాఖపట్టణం –గుంటూరు జిల్లాల జట్టు తలపడ్డాయి. ఈ పోటీలో ఇరు జట్లు ఆడిన ఫుల్‌టైములో గోల్స్ సాధించకపోవడంతో టై బ్రేకర్ నిర్వహించారు. ఇరు జట్లు చెరో గోల్ సాధించడంతో నిర్వాహకులు టాస్ వేసి ఫలితాన్ని రాబట్టారు. విజేతగా విశాఖపట్టణాన్ని డిక్లేర్ చేశారు. సెకండ్ క్వార్టర్ ఫైనల్‌లో తిరుపతి– కృష్ణా జిల్లాల జట్లు తలపడగా.. 2–1 తేడాతో కృష్ణా జట్టు విజయం సాధించింది. నెల్లూరు – ఎన్‌టీఆర్ జిల్లాల జట్లు తలపడగా.. ఇరు జట్లు హోరాహోరీగా ఆడాయి. ఈ మ్యాచ్‌లో ఫుల్‌టైమ్‌లో ఇరు జట్లు 1–1 గోల్స్‌తో సమానంగా నిలిచాయి. దీంతో నిర్వాహకులు టై బ్రేకర్ నిర్వహించగా ఇరుజట్లు మరలా 2–2 గోల్స్‌తో సమానంగా నిలవడంతో నిర్వాహకులు టాస్ వేశారు. ఎన్‌టీఆర్ జిల్లా జట్టును విజేతగా ప్రకటించారు. నాలుగో మ్యాచ్‌లో అనంతపురం–కాకినాడ జిల్లా జట్లు తలపడగా.. ఇరు జట్లు ఆట ముగిసే సమయానికి ఎటువంటి గోల్స్ సాధించలేకపోవడంతో గోల్‌లెస్ డ్రా ద్వారా 1–0 తేడాతో కాకినాడ జట్టును విజేతగా నిర్వాహకులు ప్రకటించారు.
సెమీఫైనల్స్..
మొదటి సెమీ ఫైనల్స్‌లో జరిగిన పోటీలో విశాఖ పట్టణం – కృష్ణా జిల్లా జట్లు తలపడ్డాయి. 2–1 గోల్స్ తేడాతో విశాఖపట్టణం జట్టు విజయం సాధించింది. సెకండ్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఎన్‌టీఆర్ – కాకినాడ జిల్లా జట్లు తలపడ్డాయి. ఎన్‌టీఆర్ జట్టు 2–0 గోల్స్ తేడాతో విజయం సాధించింది. పోటీలను ఆర్గనైజర్ నూతలపాటి దేవదాసు, నూతలపాటి విజయ్ కుమార్, నూతలపాటి బాలశౌరి, మూకిరి బాలాజీ, సల్లూరి దీవెనయ్య, పిడతల అగస్టీన్ తదితరులు పర్యవేక్షించారు.


