ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రులు ప్రారంభం
● బాలా త్రిపురసుందరిగా
దుర్గమ్మ దర్శనం
● సామాన్య భక్తులకు ఇక్కట్లు
ఇంద్రకీలాద్రి, వన్‌టౌన్ (విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో తొలి రోజు ఆదివారం అమ్మవారు శ్రీబాలాత్రిపురసుందరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆదివారం ఒక్క రోజే సుమారు లక్ష మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. తెల్లవారుజామున 2 గంటలకు అమ్మవారికి సుప్రభాత సేవ అనంతరం స్నపనాభిషేకం, విశేష అలంకరణ, పూజా కార్యక్రమాల అనంతరం ఉదయం 8.30 గంటలకు దర్శనాలు ప్రారంభమయ్యాయి. అమ్మవారి తొలి దర్శనం మంత్రి సుభాష్, కలెక్టర్ లక్ష్మీశ, సీపీ రాజశేఖరబాబు, ఆలయ ఈవో శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణ చేసుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. ప్రధాన ఆలయం నుంచి అమ్మవారి ఉత్సవమూర్తిని నూతన పూజామండపానికి ఊరేగింపుగా తీసుకువచ్చి ప్రతిష్టించారు. పూజా మండపంలో గణపతి పూజ చేశారు. బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంలో దుర్గమ్మను శాసనసభ డెప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, పశ్చిమ ఎమ్మెల్యే సుజనాచౌదరి, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, కాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక కుంకుమార్చన, ప్రత్యేక శత చండీహోమం, ప్రత్యేక శ్రీచక్రనవార్చనలను నిర్వహించగా, పెద్ద ఎత్తున ఉభయదాతలు పాల్గొన్నారు. ఉభయదాతలను ప్రత్యేక క్యూలో అమ్మవారి దర్శనానికి అనుమతించారు. క్యూలో విచ్చేసే వారికే తొలి ప్రాధాన్యమిస్తామని చెప్పిన ఆలయ అధికారులు ఆచరణలో మాత్రం అమలు కాలేదు. ఉత్సవాల్లో తొలి రోజే లిఫ్టుల ద్వారా తమకు కావాల్సిన వారిని పోలీసు, దేవస్థాన కమిటీ సభ్యులు యథేచ్ఛగా కొండపైకి తీసుకువెళ్లి దర్శనాలు చేయించారు. మరోవైపున ప్రజాప్రతినిధుల తరఫున సేవా దళం ఆలయ పరిసరాల్లో తిరుగుతూ తమ వారికి దర్శనాలు చేయిస్తున్నారు. వన్‌టౌన్‌లోని ఓ సత్రంకు చెందిన సభ్యుడు సైతం ప్రొటోకాల్ డ్యూటీ చేయడం గమనార్హం. మెడలో కండువా, ఐడీ కార్డును ధరించి దర్జాగా దర్శనాలు చేయిస్తున్నా అడ్డుకునే వారే లేకపోయారు. వీకెండ్, వరస సెలువులు, దసరా ఉత్సవాలు ఆదివారం ప్రారంభం కావడంతో ఆదివారం రికార్డు స్థాయిలో భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు.
పట్టువస్త్రాలు సమర్పణ
ఉత్సవాల్లో భాగంగా బాలాత్రిపుర సుందరీదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారికి కాళహస్తి, కాణిపాకం దేవస్థానాల నుంచి పట్టువస్త్రాలను సమర్పించారు.
అమ్మవారి లడ్డూ ప్రసాదాలు విక్రయించే ఆన్‌లైన్ కౌంటర్లు పని చేయకపోవడంతో భక్తులు ఇబ్బందులకు గురయ్యారు. నాలుగు ఆన్‌లైన్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. సర్వర్ పని చేయకపోవడంతో భక్తులు వెనుదిరగడం కనిపించింది. ఈవో శీనానాయక్ టెక్నికల్ సిబ్బందితో సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


