పింఛను సొమ్ములో చేతివాటం నెహ్రూనగర్: సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీలో కొందరు సచివాలయ సెక్రటరీల తీరు తీవ్ర వివాదాస్పదమవుతోంది. పేదలు, వృద్ధులు, దివ్యాంగులకు అందాల్సిన సొమ్ము పంపిణీ కాకుండా మిగిలిపోతే వెంటనే ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలన్న నిబంధనలను కొందరు తుంగలో తొక్కుతున్నారు. జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకం కింద 566 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోని 2,50,224 మంది లబ్ధిదారుల కోసం ప్రభుత్వం మొత్తం రూ.109.44 కోట్ల నిధులను విడుదల చేసింది. అయితే, లబ్ధిదారులకు పంపిణీ చేయగా మిగిలిన సొమ్ములో రూ.26,41,500 నగదు ఇంకా 8వ తేదీ వచ్చినా ప్రభుత్వానికి తిరిగి జమ కాలేదు. జిల్లాలోని 11 మండలాలు, మున్సిపాలిటీల పరిధిలోని 42 సచివాలయాల వద్ద ఈ భారీ మొత్తం నిలిచిపోయింది.
నిబంధనల ప్రకారం ప్రతినెలా 1 నుంచి 3వ తేదీ వరకు పింఛన్ల పంపిణీ దాదాపు 90 శాతానికి పైగా పూర్తవుతుంది. అనంతరం వివిధ కారణాల వల్ల పింఛన్లు తీసుకోని వారి మిగులు సొమ్మును 4, 5 తేదీల్లోగా ప్రభుత్వ ఖజానాకు (ట్రెజరీకి) ఆన్‌లైన్ ద్వారా జమ చేయాల్సి ఉంటుంది. అయితే, కొందరు సెక్రటరీలు ప్రభుత్వ నిబంధనలను ఏమాత్రం పట్టించుకోకుండా రోజుల తరబడి లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని తమ వద్దే ఉంచుకుంటున్నారు. 5వ తేదీలోపు జమ చేయాల్సిన సొమ్మును నెలాఖరు వరకు చెల్లించకుండా తమ వ్యక్తిగత అవసరాలకు, వ్యాపారాలకు వినియోగిస్తున్నారనే ఆరోపణలు క్షేత్రస్థాయిలో వెల్లువెత్తుతున్నాయి.
ఈ నిధులను జమ చేయని జాబితాలో గుంటూరు నగరపాలక సంస్థ అగ్రస్థానంలో నిలిచింది. నగర పరిధిలోని 25 వార్డు సచివాలయాల్లో ఏకంగా రూ.13,28,000 జమ కాకుండా సెక్రటరీల వద్దే ఉంది. మంగళగిరి మండలంలోని 4 సచివాలయాల్లో రూ.3.73 లక్షలు, తుళ్లూరులోని ఒకే సచివాలయంలో అత్యధికంగా రూ.2.66 లక్షలు, వట్టిచెరుకూరులో రూ.1.68 లక్షలు, తెనాలి రూరల్‌లో రూ.1.58 లక్షల మేర నిధులు నిలిచిపోయాయి.
నోటీసులు ఇచ్చినా తీరు మారదా?
ప్రతినెలా ఇలాంటి సంఘటనలే పునరావృతం కావడంతో గతంలో పలుమార్లు ఉన్నతాధికారులు బాధ్యులైన సిబ్బందికి షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశారు. అయినప్పటికీ సదరు సెక్రటరీల తీరులో ఏమాత్రం మార్పు రాకపోవడం అధికారుల పర్యవేక్షణ లోపానికి అద్దం పడుతోంది. నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకోవడం వల్లే సిబ్బంది ప్రభుత్వ నిధులను ఇష్టారాజ్యంగా వినియోగించుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి, ప్రభుత్వ సొమ్మును రోజుల తరబడి తమ వద్దే ఉంచుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. వెంటనే ఈ రూ.26.41 లక్షలను రికవరీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
నిబంధనలకు పాతర..
గుంటూరు నగరంలోనే అత్యధికం
ఖజానాకు చేరాల్సిన మిగులు
నిధులను కాజేస్తున్న సెక్రటరీలు
నెలాఖరు వరకు జమ చేయకుండా
సొంతానికి వినియోగం?
జిల్లావ్యాప్తంగా ఇంకా
జమ కాని రూ.26.41 లక్షల నగదు
గుంటూరు నగరంలోనే ఏకంగా
రూ.13.28 లక్షలు బకాయి
షోకాజ్ నోటీసులు జారీ చేసినా
బేఖాతరు చేస్తున్న సిబ్బంది