అథ్లెటిక్‌ పోటీలకు జట్లు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

అథ్లెటిక్‌ పోటీలకు జట్లు ఎంపిక

Oct 10 2026 1:58 AM | Updated on Oct 10 2026 1:58 AM

అథ్లెటిక్‌ పోటీలకు జట్లు ఎంపిక గుంటూరు – వికారాబాద్‌ మధ్య ప్రత్యేక రైలు ఐఐఏ దక్షిణ ప్రాంతీయ సదస్సు ప్రారంభం తుళ్లూరు పోలీసుస్టేషన్‌ ఎదుట ఉద్రిక్తత

గుంటూరు వెస్ట్‌ (క్రీడలు): జిల్లా స్థాయి అథ్లెటిక్‌ పోటీల్లో చిన్నారులు ఉత్సాహంగా పోటీపడ్డారని అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ గుంటూరు జిల్లా కార్యదర్శి జీవీఎస్‌ ప్రసాద్‌ తెలిపారు. శుక్రవారం స్థానిక బీఆర్‌ స్టేడియంలో నిర్వహించిన జిల్లా అండర్‌–14, 16 అథ్లెటిక్స్‌ మీట్‌ కమ్‌ ఎంపికలకు విశేష స్పందన లభించిందన్నారు. ఎంపిక చేసిన జిల్లా జట్లు నవంబర్‌ 14 నుంచి 16వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్రంలోని సదాశివపేటలో జరిగే 20వ నేషనల్‌ పోటీల్లో పాల్గొంటాయని తెలిపారు. పోటీలను శాప్‌ కోచ్‌ పి. వెంకటేశ్వరరావు ప్రారంభించారు. శిక్షకులు శివాజీ, కె.రవికుమార్‌, శాప్‌ కోచ్‌ ఎస్‌.శివారెడ్డి, అరుణ్‌కుమార్‌, రాజు, మన్సూర్‌ వలి, శరత్‌బాబు పాల్గొన్నారు.

లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్‌): ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ తీర రైల్వే గుంటూరు, వికారాబాద్‌ మధ్య శని, ఆదివారాలలో ప్రత్యేక రైలును నడుపుతున్నట్లు సీనియర్‌ డీసీఎం శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గుంటూరు – వికారాబాద్‌ (నంబర్‌ 07227) ప్రత్యేక రైలు శనివారం రాత్రి 8.45 గంటలకు గుంటూరులో బయలుదేరి ఆదివారం ఉదయం 5 గంటలకు వికారాబాద్‌ జంక్షన్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకుంటుందని తెలిపారు. వికారాబాద్‌ – గుంటూరు (నంబర్‌ 07228) ప్రత్యేక రైలు రైలు ఆదివారం రాత్రి 10.10 గంటలకు వికారాబాద్‌ జంక్షన్‌ నుంచి బయలుదేరి సోమవారం ఉదయం 6.10 గంటలకు గుంటూరు చేరుకుంటుందని తెలిపారు. గుంటూరు, వికారాబాద్‌ జంక్షన్‌లతోపాటు మార్గంమధ్యలోని సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి జంక్షన్‌, మిర్యాలగూడ, నల్గొండ, చర్లపల్లి, సికింద్రాబాద్‌, బేగంపేట, హైటెక్‌ సిటీ స్టేషన్ల మీదుగా రైళ్లు వెళతాయని తెలిపారు.

తాడేపల్లి రూరల్‌: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆర్కిటెక్ట్స్‌ (ఐఐఏ) ఆంధ్రప్రదేశ్‌ చాప్టర్‌ ఆధ్వర్యంలో ‘పరికల్పన–2026’ పేరుతో దక్షిణ ప్రాంతీయ సదస్సు , ఆర్కిటెక్చర్‌ బిల్డ్‌ ఎక్స్‌పో శుక్రవారం తాడేపల్లిలోని సీకే కన్వెన్షన్‌ లో ప్రారంభించారు. ఇది 11వ తేదీ వరకు జరుగనుంది. ఎక్స్‌పోను ఏపీ సీఆర్‌డీఏ కమిషనర్‌ వి.విజయరామరాజు ప్రారంభించారు. ఐఐఏ ఏపీ చాప్టర్‌ చైర్మన్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ పరిశ్రమలు, వ్యాపార సంస్థల సహకారంతో స్థిరమైన నిర్మాణ విధానాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రాంతీయ సమస్యలకు పరిష్కారాలు కనుగొనేందుకు ఈ సదస్సు దోహదపడుతుందని పేర్కొన్నారు. సదస్సు కన్వీనర్‌ డాక్టర్‌ క్రాంతికుమార్‌ మాట్లాడుతూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సదస్సులో నిపుణుల ఉపన్యాసాలు, ప్యానెల్‌ చర్చలతో పాటు ఆర్కిటెక్ట్‌లు, విద్యార్థుల ప్రాజెక్టులు, నమూనాల ప్రదర్శన ఏర్పాట్లు చేశారు. ఎక్స్‌పోలో ఐఐఏ–ఏపీ ప్రతినిధులు ఆర్కిటెక్ట్‌ ఎ.శివరామ్‌, ఎం.రాజశేఖర్‌, కోశాధికారి ఆర్కిటెక్ట్‌ రాజేష్‌ నాగుల, కార్యవర్గ సభ్యులు, దక్షిణాది రాష్ట్రాలకు చెందిన పలువురు ఆర్కిటెక్ట్‌లు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

తాడికొండ: తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌ వద్ద శుక్రవారం స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన శ్రీనివాసరావు ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టుకు రాగా, బాధితులు ఆయనను అడ్డుకునేందుకు యత్నించారు. ఈయనపై రూ.63 కోట్లు చిట్‌ఫండ్‌ స్కామ్‌ ఆరోపణలతో కేసు నమోదు చేయగా బెయిల్‌ కోసం ఆయన హైకోర్టుకు వచ్చాడని తెలుసుకున్న బాధితులు అక్కడ అడ్డుకున్నారు. పోలీసులు వారిలో కొందరిని అదుపులోకి తీసుకుని తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బాధితులు అందరూ పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని ఆందోళన వ్యక్తం చేశారు. బాధితుల ఆందోళన నేపథ్యంలో నిందితుడు ముందస్తు బెయిల్‌ రద్దు చేసినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement