కొరిటెపాడు(గుంటూరు): విజిలెన్స్ అవగాహన ప్రచారంలో భాగంగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో బుధవారం మినీ వాకథాన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ బ్యాంక్ రీజినల్ మేనేజర్ జీవీ రమణరావు, విజిలెన్స్ ఆఫీసర్ పరసన్ జీత్‌లు మాట్లాడుతూ ప్రజాసేవలో నిజాయతీ, సమగ్రత, పారదర్శకత, నైతిక విలువలు అత్యంత కీలకమన్నారు. అధికారిక కార్యకలాపాల్లో ఉద్యోగులు జవాబుదారీతనం, పారదర్శకతతో విధులు నిర్వహించాల్సిన అవగాహన కల్పించడమే విజిలెన్స్ ప్రచారం ప్రధాన ఉద్ధేమని తెలిపారు. ఈ విజిలెన్స్ అవగాహన ప్రచారం నవంబర్ 16వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. ఉద్యోగులతో పాటు ప్రజల్లోనూ అవినీతి నిరోధక విలువలపై చైతన్యం తీసుకురావాలని వారు పేర్కొన్నారు. రీజినల్ ఆఫీస్ సిబ్బంది ఉత్సాహంగా, బాధ్యతాయుతంగా వాకథాన్‌లో పాల్గొన్నారు.


