దత్తపీఠంలో మహాసుదర్శన హోమం
ఫిరంగిపురం: ఫిరంగిపురం మండలం అమీనాబాద్ గ్రామంలోని శ్రీ దత్తపీఠంలో మంగళవారం విశేష పూజలు నిర్వహించారు. అనఘాదేవి, శ్రీ దత్తాత్రేయ స్వామిని విశేషంగా అలంకరించి అష్టోత్తర, సహస్ర నామ పూజలు చేశారు. యాగశాలలో రుత్వికులచే మహా సుదర్శన హోమం నిర్వహించి, తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలను శ్రీదత్త పీఠం నిర్వాహకులు జయశంకర్ పర్యవేక్షించారు.
తెనాలి టౌన్: శ్రీపంచముఖ ఆంజనేయస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారికి పుష్పాలతో విశేష అర్చనలను వైభవంగా జరిపించారు. స్థానిక షరాఫ్ బజారులోని సువర్చల సమేత పంచముఖ ఆంజనేయస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం పుష్ప ఉత్సవం కనులపండువగా నిర్వహించారు. స్వామి వారిని, అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించిన మండపంపై కొలువుదీర్చి వివిధ రకాల పుష్పాలతో అర్చన చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి హరి ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి సంకీర్తన సభ్యులు పాల్గొని శ్రీ విష్ణు సహస్ర నామ పారాయణ, అన్నమాచార్య కీర్తనలను ఆలపించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని పుష్పాలంకరణతో ఉన్న స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ వంశ పారంపర్య అర్చకులు రొంపిచర్ల శ్రీనివాసమూర్తి, ఆర్.వి.కిరణ్‌కుమార్‌లు పర్యవేక్షించారు.
నగరంపాలెం: తెలుగు నాటక రంగ గౌరవాన్ని, భారతీయ నాటక సంప్రదాయాల గొప్పతనాన్ని అంతర్జాతీయ స్థాయిలో చాటిచెప్పే లక్ష్యంతో భారత్ రంగ మహోత్సవ్ –అంతర్జాతీయ నాటక ఉత్సవాన్ని నిర్వహించనున్నట్లు వేదిక (తెలుగు నాటక పరిషత్తుల సమ్మేళన సంఘం) అధ్యక్షుడు ముత్తవరపు సురేష్‌బాబు తెలిపారు. మంగళవారం అరండల్‌పేటలోని ఓ హోటల్‌లో జరిగిన మీడియా సమావేశంలో బ్రోచర్ విడుదల చేశారు. తెలుగు నాటక కళా పరిషత్‌ల సమ్మేళనం ఆధ్వర్యంలో భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (ఢిల్లీ) సహకారంతో ఈ ఉత్సవాన్ని చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు. ఈ నెల 6, 7, 8, 9, 10 తేదీల్లో మార్కెట్ కూడలిలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నాటక ఉత్సవాలు కొనసాగుతాయని అన్నారు. ప్రతి రోజూ మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, నాటక ప్రదర్శనలు ఉంటాయని చెప్పారు. సమావేశంలో భూషణ్, పోపూరి నాగేశ్వరరావు, ముత్తవరపు పద్మారావు, పొగర్తి నాగేశ్వరరావు పాల్గొన్నారు.
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటి మట్టం మంగళవారం 542.30 అడుగులకు చేరింది. ఇది 193.1535 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి కుడి కాలువకు 8,023, ఎడమ కాలువకు 7,852, ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి 27,866, ఎస్ ఎల్‌బీసీకి 2,200, వరద కాలువకు 300 క్యూసెక్కులు విడుదలవుతోంది. సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్‌ఫ్లోగా 46,241 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 46,241 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.
దత్తపీఠంలో మహాసుదర్శన హోమం
దత్తపీఠంలో మహాసుదర్శన హోమం
దత్తపీఠంలో మహాసుదర్శన హోమం


