ముందే గుర్తిస్తే.. మెరుగైన వైద్యం
స్క్రీనింగ్‌తో క్యాన్సర్ బాధితులకు సత్వర వైద్యం
అందుబాటులోకి అత్యాధునిక వైద్య సేవలు
కొన్ని రకాల క్యాన్సర్‌లకు వ్యాక్సిన్‌తో చెక్
నేడు వరల్డ్ క్యాన్సర్ డే
గుంటూరు జీజీహెచ్‌లో నాట్కో క్యాన్సర్ సెంటర్‌లో సేవలిలా...
గుంటూరు మెడికల్ పూర్వం రాచపుండుగా పిలిచే క్యాన్సర్ వ్యాధి సోకితే మరణం తప్పదనే వారు. క్యాన్సర్ సోకగానే వ్యాధికి మందు లేదనే భయాందోళనలతో అనేక మంది చనిపోయేవారు. నేడు ఆధునిక వైద్యం ఎంతో అభివృద్ధి చెందటంతో క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేస్తున్నారు. ప్రాథమిక దశలోనే గుర్తించే అత్యాధునిక నిర్ధారణ పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. క్యాన్సర్ రాకుండా ముందస్తుగా కట్టడి చేసే వ్యాక్సిన్లు సైతం మార్కెట్‌లోకి వచ్చాయి. యువ క్రికెటర్ యువరాజ్‌సింగ్ క్యాన్సర్ నుంచి కోలుకున్న విషయం తెలిసిందే. వ్యాధి పట్ల అవగాహన కోసం ప్రతి ఏడాది ఫిబ్రవరి 4న వరల్డ్ క్యాన్సర్ డేగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త..
మానకుండా ఉండే పుండు, శరీరంలోని ఏ భాగంలోనైనా ఎదిగే గడ్డ, ఎదుగుతున్న కణుతులు, అసహజమైన రక్తస్రావం, పెరుగుతున్న పుట్టుమచ్చలు, పులిపిరి కాయలు, మింగటం కష్టంగా ఉండటం, గొంతు బొంగురుపోయి తగ్గకుండా ఉండటం, చాలా రోజులుగా ఉన్న అజీర్ణవ్యాధి తదితర లక్షణాలు ఉంటే తక్షణమే క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. పొగాకు ఉత్పత్తుల కారణంగా 40 నుండి 45 శాతం, కాలుష్యం వల్ల 8 నుంచి 10 శాతం, మద్యం వల్ల మూడు శాతం క్యాన్సర్‌లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గుంటూరు జిల్లా వ్యాప్తంగా 50 మంది క్యాన్సర్ వైద్య నిపుణులు ఉన్నారు. ఒక్కో వైద్యుడి వద్ద రోజూ దాదాపు 10 నుంచి 20 మంది రోగులు చికిత్స పొందుతున్నారు.
సంవత్సరం ఓపీ రోగులు ఆపరేషన్లు
2021 11,719 168
2022 13,105 417
2023 14,648 753
2024 16,359 823
2025 19,598 1,131


