రైతులకు మద్దతు దక్కేనా?
రైతులకు మద్దతు దక్కేనా? శనివారం శ్రీ 22 శ్రీ నవంబర్ శ్రీ 2025 తెనాలి/కొల్లిపర: కృష్ణా పశ్చిమ డెల్టా పరిధిలో 2025–26 ఖరీఫ్ సీజనుకు ఆసాంతం రైతులకు కష్టాలు తప్పడం లేదు. తెనాలి, కొల్లిపర, దుగ్గిరాల మండలాల పరిధిలోని సబ్ డివిజనులో వ్యవసాయ పంటల విస్తీర్ణం 52,721 ఎకరాలు. ఇందులో వరి 50,586 ఎకరాల్లో సాగు చేశారు. సీజను ఆరంభంలో వర్షాలు ఆలస్యమయ్యాయి. తీరా వెద పెట్టాక ప్రతాపం చూపించాయి. దీంతో పల్లపు ప్రాంతాల్లోని రైతులు నష్టపోయారు. ఒక్కోచోట రెండు, మూడుసార్లు వెదజల్లాల్సి వచ్చింది. కొందరైతే దూర ప్రాంతాల నుంచి అధిక ధరకు వరినారు కొనుగోలు చేసి నాటించారు. ఫలితంగా ఈ పర్యాయం సీజను మొదట్లోనే పెట్టుబడులు అధికమయ్యాయి. అక్టోబరు ఆఖరులో వచ్చిన మోంథా తుఫాన్ దెబ్బకు ఏపుగా పెరిగిన వరి పలుచోట్ల నేలవాలింది. అయిదు శాతానికి మించి నష్టం లేదన్న సాకుతో చంద్రబాబు సర్కారు కనీసం నష్టం లెక్క కూడా చూడలేదని రైతులు వాపోతున్నారు.
దిగుబడిపై ప్రభావం ప్రస్తుతం నూర్పిళ్లు మొదలయ్యాయి. రెండు మూడురోజులుగా జరుగుతున్నాయి. కూలీలతో కోతలకు రేట్లు అధికంగా ఉండటంతో ఏటా తరహాలోనే రైతులు హార్వెస్టింగ్ యంత్రాల వైపు చూస్తున్నారు. ఎక్కువ విస్తీర్ణం ఒకేసారి కోతకు రావటంతో తగినన్ని యంత్రాలు అందుబాటులో లేవు. దీంతో ఒత్తిడి అధికంగా ఉంది. నూర్పిడి చేసిన పొలాల్లో దిగుబడి ఎకరాకు సగటున 25–35 బస్తాలు వస్తున్నాయి. కొల్లిపర ప్రాంతంలో 30–35 బస్తాలు, తెనాలి మండలంలో 25–20 బస్తాలే వస్తోందని రైతులు చెబుతున్నారు. వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ సారి 5–10 క్వింటాళ్ల దిగుబడి తగ్గిపోయిందని తెలుస్తోంది.
అదనపు ఖర్చు
ఒకేసారి పంట ఎక్కువ విస్తీర్ణంలో నూర్పిళ్లకు సిద్ధం కావటంతో హార్వెస్టర్లకు డిమాండ్ పెరిగింది. నూర్పిడికి గంటకు రూ.3 వేలు, తీసుకొచ్చిన మనిషికి రూ.200 చొప్పున తీసుకుంటున్నారు. వరి పొలం బాగున్నచోట ఎకరాకు గంట వ్యవధి పడుతోంది. పైరు నేలవాలిన చోట గంటన్నర నుంచి రెండు గంటలు పడుతోంది. ఆ ప్రకారం మరో రూ.1,500 నుంచి రూ.3 వేలు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు. గత ప్రభుత్వంలో ఇచ్చినట్టుగా ప్రభుత్వమే నూర్పిళ్లు చేసేందుకు సబ్సిడీ అద్దైపె హార్వెస్టర్లను సమకూర్చాల్సిందిగా దావులూరులో రైతులు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాకు విజ్ఞప్తి చేశారు. తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీనిచ్చారు. త్వరగా సమకూర్చాలని రైతులు కోరుతున్నారు.
ధరలతో నిరాశ
మరోవైపు మార్కెట్‌లో మద్దతు ధర లభించడం లేదు. ధాన్యం 75 కిలోల బస్తాకు ప్రభుత్వ మద్దతు ధర సాధారణ రకం రూ.1,777 కాగా, గ్రేడ్–ఏ రకం రూ.1,792గా ఉంది. అయితే మార్కెట్‌లో వ్యాపారులు రూ.1,450 – 1,480 వరకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. గతేడాది ఖరీఫ్ సీజనులో కోతలు ఆరంభించేనాటికి వ్యాపారులు బస్తా ధాన్యం రూ.1,300లకే కొనుగోలు చేశారు. నూర్పిళ్లు పూర్తయ్యే దశలో రూ.1,500 వరకు ధర లభించింది. ప్రస్తుతం కూడా మద్దతుకు చేరువలో మార్కెట్ ధర లేకపోవటం అన్నదాతలకు ఆవేదన కలిగిస్తోంది. నూర్పిళ్లు మొదలయ్యే సరికి తొలి కొనుగోలు కేంద్రాన్ని తెనాలి నియోజకవర్గంలోని దావులూరులో ప్రారంభించారు. నాణ్యతా ప్రమాణాల పేరుతో గతేడాది మద్దతు ధరకు కూడా సర్కారు ధాన్యం కొనలేదు. నాణ్యంగా ఉన్నా పూర్తిస్థాయిలో కొనకపోవడంతో రైతులు మిల్లర్లు, వ్యాపారులకు అయినకాడికి విక్రయించాల్సి వచ్చింది. దీంతో భారీగా నష్టపోయారు. ఈ సారి ఎంతమేరకు కొనుగోలు చేస్తారోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.
న్యూస్‌రీల్
నూర్పిడి చేయగా వచ్చిన ధాన్యం
ఇప్పటికే తగ్గిన ధాన్యం దిగుబడులు
ఎకరాకు 5–10 క్వింటాళ్ల వరకు దెబ్బ
వర్షాలు, తుఫాన్‌తో తప్పని కష్టాలు
మార్కెట్‌లో మచ్చుకై నా దక్కని ‘మద్దతు’
బస్తాకు రూ.300 వరకు వ్యత్యాసం
కొనుగోలు కేంద్రాల్లో గతంలో
నాణ్యతపై కొర్రీలు
ఈ ఏడాది పరిస్థితులపై
అన్నదాతలకు ఆందోళన
రైతులను ఆదుకోని
చంద్రబాబు ప్రభుత్వం
మాగాణి రైతులు సందేహించినట్టే ఈ సారి ధాన్యం దిగుబడులు తగ్గాయి. మార్కెట్‌లో ‘మద్దతు’ ధర కూడా లేదు. నేలవాలిన వరి పొలాల్లో నూర్పిడులకు అదనపు ఖర్చులు తప్పటం లేదు. వెరసి ఖరీఫ్ సీజను అన్నదాతలకు ఆవేదనే మిగిల్చింది. పంట నష్టం నమోదు చేయని చంద్రబాబు ప్రభుత్వం... నూర్పిళ్లు మొదలయ్యేసరికి హడావుడిగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. ధర లేక రైతులు ఆవేదన చెందుతున్నారు.
1/5
రైతులకు మద్దతు దక్కేనా?
2/5
రైతులకు మద్దతు దక్కేనా?
3/5
రైతులకు మద్దతు దక్కేనా?
4/5
రైతులకు మద్దతు దక్కేనా?
5/5
రైతులకు మద్దతు దక్కేనా?