కొత్త విద్యాసంవత్సరం నుంచి ఎంబీఏ, బీటెక్‌లలో కొత్త కోర్సులు ప్రారంభం గోల్డెన్ జూబ్లీ వేడుకల నిర్వహణకు నిర్ణయం నివేదిక సమర్పించిన ఇన్‌చార్జి వీసీ
ఏఎన్‌యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం 90వ అకడమిక్ సెనేట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వర్సిటీలోని డైక్‌మెన్ హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశానికి ఇన్‌చార్జి వీసీ ఆచార్య కె.గంగాధరరావు అధ్యక్షత వహించారు. సమావేశంలో సోమవారం సాయంత్రం జరిగిన పాలకమండలి, ఫైనానన్స్ కమిటీ నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. నూతనంగా ఎంబీఏ లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్‌మెంట్ కోర్సుకు, బీటెక్‌లో స్పేస్ టెక్నాలజీ కోర్సులను 2026–27 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించేందుకు సెనేట్ ఆమోదం తెలిపింది. ఏఎన్‌యూ 50 సంవత్సరాల గోల్డెన్ జూబ్లీ విజయోత్సవాలను నిర్వహించాలని పలువురు మాజీ వీసీలు సూచించారు. 50 ఏళ్లకు గుర్తుగా ఒక ప్రత్యేక నిర్మాణం చేపట్టాలని చర్చించారు. లైబ్రేరియన్ ఆచార్య వెంకట్రావ్ మాట్లాడుతూ అధ్యాపకులు తన పరిశోధన పత్రాలను వన్ నేషన్ వన్ సబ్‌స్క్రిప్షన్‌లో నమోదు చేసుకుంటే పబ్లిక్‌కు అయ్యే ఖర్చులను ఆ సంస్థ భరిస్తుందన్నారు. సమావేశానికి హాజరైన మాజీ వీసీ ఆచార్య హరగోపాల్‌రెడ్డి పెన్షనర్లకు బకాయిలు విడుదల చేయాలన్నారు. మాజీ వీసీ ఆచార్య వియన్నరావు మాట్లాడుతూ ఏఎన్‌యూ రీసెర్చ్ యూనివర్సిటీగా రూపాంతరం చెందేందుకు అవకాశాలు ఉన్నాయని ఆ దిశగా పాలకులు చర్యలు తీసుకోవాలని సూచించారు. విశ్రాంత వీసీ బాలమోహన్‌దాస్ మాట్లాడుతూ ఏఎన్‌యూ 50 ఏళ్ల సందర్భంగా ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు కోరాలని సూచించగా మాజీ వీసీ ఆచార్య రాఘవులు ఐకానిక్ భవనం నిర్మాణం చేపట్టాలని కోరారు. మాజీ వీసీ ఆచార్య ఎల్.వేణుగోపాల్‌రెడ్డి మాజీ ప్రొఫెసర్ సేవలను వర్సిటీ వాడుకోవాలన్నారు. మాజీ వీసీ ఆచార్య రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ 50 ఏళ్ల వేడుకకు నోబెల్ విన్నర్లను తీసుకురావాలన్నారు. అనంతరం బడ్జెట్‌కు ఆమోదముద్ర వేశారు. ఇన్‌చార్జి వీసీ ఆచార్య కె గంగాధరరావు వర్సిటీ నివేదికను వివరించారు. సమావేశంలో రెక్టార్ ఆచార్య ఆర్.శివరాంప్రసాద్, రిజిస్ట్రార్ ఆచార్య జి.సింహాచలం, పాలకమండలి సభ్యులు వెంకటేశ్వరరావు, షాహేదా అక్తర్, సుమంత్ కుమార్, జగదీష్ నాయక్, ఉన్నత విద్యామండలి వైస్ చైర్‌పర్సన్ ఆచార్య రత్నషీలామణి, డీన్‌లు, ప్రిన్సిపాల్స్, డైరెక్టర్లు, సెనేట్ సభ్యులు పాల్గొన్నారు.
తనిఖీ బృందం నివేదిక ఆధారంగా
కఠిన చర్యలు..
ఏఎన్‌యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం నిర్వహించిన పరీక్షల్లో వచ్చిన ఆరోపణలపై వర్సిటీ ఉన్నతాధికారులు నియమించిన ప్రత్యేక తనిఖీ బృందం కమిటీ నివేదిక ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటామని దూరవిద్య పరీక్షల విభాగం కో–ఆర్డినేటర్ ఆచార్య డి.రామచంద్రన్ మంగళవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఈ తనిఖీ బృందం (స్క్వాడ్) సమర్పించిన నివేదికలో పొందుపరిచిన అంశాలను సమగ్రంగా పరిశీలిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న కళాశాలలకు చెందిన విద్యార్థుల పరీక్ష ఫలితాలను తాత్కాలికంగా విత్‌హెల్డ్ లో ఉంచుతున్నామన్నారు. ఇంపర్సనేషన్ (ఇతరుల స్థానంలో పరీక్ష రాయడం), మాల్‌ప్రాక్టీస్ వంటి అక్రమాలకు పాల్పడిన విద్యార్థులపై వర్సిటీ నిబంధనలకు అనుగుణంగా క్రమశిక్షణ చర్యలు తప్పవని స్పష్టం చేశారు. తనిఖీ బృందం నివేదికలో సూచించిన తీవ్ర ఆరోపణలు ఉన్న పలు పరీక్ష కేంద్రాలను భవిష్యత్తులో పరీక్షల నిర్వహణకు అనుమతి ఇవ్వబోమని, అవసరమైతే వాటి అనుబంధాన్ని రద్దు చేసే దిశగా చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ఇప్పటికే సమర్పించిన నివేదికలో కొన్ని అంశాలు అసంపూర్తిగా ఉన్నందున, సంబంధిత కమిటీ నుంచి పూర్తి వివరాలను మరోసారి సేకరించడం జరుగుతుందన్నారు. అనంతరం మరిన్ని కీలక నిర్ణయాలు ప్రకటించనున్నట్లు దూరవిద్యాకేంద్రం పరీక్షా విభాగం కో–ఆర్డినేటర్ ఆచార్య రామచంద్రన్ తెలిపారు.


