ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవ లింగారావు
గుంటూరు ఎడ్యుకేషన్: 12వ పీఆర్సీ కమిషన్ చైర్మన్‌ను నియమించి, 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని, లేనిపక్షంలో కలసి వచ్చే సంఘాలను కలుపుకుని దశలవారీ పోరాటం చేపడతామని ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.బసవలింగారావు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా కోర్టు వద్ద ఉన్న ఏపీటీఎఫ్ జిల్లా కార్యాలయంలో మంగళవారం సంఘం జిల్లా అధ్యక్షుడు గుడిపాటి దాస్ అధ్యక్షతన సబ్ కమిటీ, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. బసవలింగారావు మాట్లాడుతూ ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చని ఫలితంగా ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారని, ఆందోళనలు అసంతృప్తిగా మారి, పోరాటాలుగా మారతాయని అన్నారు. 2023 జులై నుంచి12వ పీఆర్సీ అమలు చేయాల్సి ఉండగా, మూడేళ్లు గడుస్తున్నప్పటికీ కమిషన్ అతీగతి లేదన్నారు. పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను తక్షణమే ప్రకటించాలని డిమాండ్ చేశారు. సీపీఎస్‌పై సముచిత నిర్ణయం తీసుకుంటామన్న నేతలు ఇచ్చిన మాట తప్పారని అన్నారు. 11వ పీఆర్సీతో పాటు, డీఏ, సరెండర్ లీవ్, తదితర అన్ని రకాల బకాయిలు రూ.30 వేల కోట్లు పేరుకపోయాయని అన్నారు. ఏపీటీఎఫ్ గుంటూరు జిల్లా శాఖ ప్రధానకార్యదర్శి మొహ్మద్ ఖాలీద్ మాట్లాడుతూ ఉద్యోగ విరమణ చెందిన ఉపాధ్యాయుల, ఉద్యోగుల గ్రాట్యుటీ 20 నెలల నుంచి చెల్లించడం లేదని, కేవలం పెన్షన్ తప్ప ఇతర ఆర్థిక ప్రయోజనాలు ఏ ఒక్కటీ రావడం లేదన్నారు. వచ్చే వేసవిలో బదిలీలు, ఉద్యోగోన్నతులను పారదర్శకంగా నిర్వహించాలన్నారు. ప్రభుత్వం స్పందించి నాయమైన ఆర్థిక సమస్యలు పరిష్కరించకుంటే, టెన్త్ స్పాట్ వాల్యూయేషన్ కేంద్రాల్లో నిరసనలతో పాటు ఈనెల 16, 17 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో పెద్ద సంఖ్యలో ధర్నాలు నిర్వహిస్తామన్నారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించని పక్షంలో రాష్ట్ర స్థాయిలో నిరసనలు, మహాధర్నా నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో ఏపీటీఎఫ్ గుంటూరు జిల్లా శాఖ ఉపాధ్యక్షులు పి.నాగశివన్నారాయణ, పి.పార్వతి, జిల్లా కార్యదర్శలు కె.శ్రీనివాసరావు, పి.శివరామకృష్ణ, జిల్లా కౌన్సిలర్ వి.కిషోర్ షా పాల్గొన్నారు.


