తమ్ముళ్ల ‘అధికార’ దోపిడీ
తమ్ముళ్ల ‘అధికార’ దోపిడీ సాక్షి ప్రతినిధి, గుంటూరు: తెలుగు తమ్ముళ్లు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఈ ప్రొక్యూర్‌మెంట్ టెండర్‌లో పాల్గొనకుండానే పాల్గొన్నట్లు దొంగ డాక్యుమెంట్లు సృష్టించారు. అడ్డదారిలో టెండర్లు దక్కించుకుని రూ.కోట్లు కొల్లగొట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందులో కొంతమంది కాంట్రాక్టర్లు వర్కులు కూడా పూర్తి చేసి బిల్స్ కూడా ప్రాసెస్ అవుతున్న సమయంలో ‘సాక్షి’లో కథనాలు రావడంతో బిల్లుల ప్రాసెస్ ఆగిపోయింది. వీటిని ఎలాగైనా దక్కించుకునేందుకు తెలుగు తమ్ముళ్లు చేసిన వర్కుకే మళ్లీ టెండర్లు పిలిపించుకుంటున్నారు. ఇందుకు అధికారులు కూడా తమవంతు సహకారం అందిస్తున్నారు. కాంట్రాక్టర్ల వాట్సాప్ గ్రూప్‌లో ‘మేము చేసిన వర్కుకు అధికారులు తిరిగి టెండర్లు పెడుతున్నారు. ఈ వర్కులో ఎవరూ పాల్గొన వద్దంటూ’ పరోక్షంగా బెదిరింపులకు దిగుతున్నారు. ఒకవేళ ఎవరైనా పాల్గొంటే సదరు కాంట్రాక్టర్ల బిల్లులు ప్రాసెస్ కాకుండా చేస్తారనే భయం ఉండటంతో వేరేవారు వీటి వైపు కన్నెత్తి చూడటం లేదు.
అడ్డదారిలో 70కిపైగా టెండర్లు దక్కించుకుని రూ.10 కోట్లకు పైగా కార్పొరేషన్‌కు నష్టం కలిగించే జాబితాలో ఏడుగురు కాంట్రాక్టర్లు ఉన్నట్లు సమాచారం. ‘మేమే కాదు. మా తరహాలో చాలా మంది దొంగ టెండర్లు వేశారు. కొందరు కాంట్రాక్టర్లు చేసిన వర్కులకు సంబంధించిన జాబితా ఇవ్వాలని’ సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తులు పెడుతున్నారు. దీంతో ఇంజినీరింగ్ అధికారులు వాటికి సమాధానాలు ఇచ్చుకోలేక తలలు పట్టుకుంటున్నారు. మరో పక్క ఎలాగైనా బిల్లులు చేయించుకుని తమ జేబులు నింపుకొనేందుకు ప్రజాప్రతినిధుల చుట్టూ కాంట్రాక్టర్లు ప్రదక్షిణలు చేసి నగరపాలక సంస్థ అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.
నిద్రావస్థలో విజిలెన్స్
ప్రభుత్వ శాఖల్లో ఏదైనా అవినీతి జరిగితే వెంటనే స్పందించి ఆయా శాఖలపై దాడులు జరిపి విచారణ చేపట్టాల్సిన విజిలెన్స్ అధికారులు మొద్దు నిద్రలో ఉన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో రూ.కోట్ల అక్రమాలు వెలుగుచూస్తున్నా, ప్రజల సొమ్ము తమ్ముళ్ల జేబుల్లోకి అడ్డదారిలో వెళుతున్నా పట్టించుకోవడం లేదు. ప్రతి నెల విజిలెన్స్ అధికారులకు నెలవారీ మామూళ్లు కార్పొరేషన్ నుంచి వెళుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే కార్పొరేషన్ వైపు చూడటం లేదని సమాచారం.
చాలా మంది దొంగలు..
అధికార పార్టీకి చెందిన తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. నగరపాలక సంస్థలో దొడ్డిదారిలో టెండర్లు దక్కించుకోవడంతోపాటు టెండర్లలోని లొసుగులు తెలుసుకుని తమ జేబులు నింపుకొంటున్న విషయాలపై ‘సాక్షి’ పలుమార్లు వరుస కథనాలు ప్రచురించింది. దీనిపై కమిషనర్ పులి శ్రీనివాసులు సదరు కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటున్నట్లు హడావుడి చేసినప్పటికీ చివరికి చతికిలపడ్డారు. దీంతో వారు ఆ పనులకు బిల్లులు చేయించుకుంటున్నారు. పైగా జీఎంసీ నుంచి అవే పనులకు తిరిగి టెండర్లు పిలుస్తుండటం గమనార్హం.
అడ్డదారిలో టెండర్లు
దక్కించుకున్న టీడీపీ
దుమారం రేగడంతో
అక్రమంగా బిల్లులకు యత్నం
పనులు పూర్తయిన వాటికి
తిరిగి జీఎంసీ టెండర్లు
ఎవరూ పాల్గొనవద్దంటూ
కాంట్రాక్టర్లకు బెదిరింపులు
అక్రమాలపై మొద్దు నిద్రలో
విజిలెన్స్ అధికారులు