మాటల్లో ‘భూమ్’.. నమ్మితే ఢాం..!
30 ఏళ్ల క్రితం వేసిన వాటికి ఇప్పటికీ అనుమతులు శూన్యం అనుమతి ఉన్న ప్లాట్లు కొనాలని ఏపీ సీఆర్‌డీఏ ప్రకటన కమీషన్ల కోసం కొనుగోలుదారులను మోసగిస్తున్న దళారులు ఓ పక్క వ్యాపారాలు పడిపోయినా అధిక ధరలకు విక్రయిస్తూ దగా విలువ లేని ప్లాట్లనూ సామాన్యులకు అంటగడుతూ మోసం ప్లాట్లు తీసుకున్నాక తీవ్రంగా నష్టపోతున్న కొనుగోలుదారులు
రాజధాని గ్రామాల్లో అనధికారిక వెంచర్లు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయాయి. ఆదిలోనే తొలగించాల్సిన అధికారులు అందినకాడికి దండుకుని చోద్యం చూస్తున్నారు. ఈ ప్రాంతంలో 30 ఏళ్ల క్రితం వేసిన కొన్ని వెంచర్లకు సైతం నేటికీ అనుమతులు రాలేదు. ఇటీవల కాలంలో రాజధాని ఏర్పాటు ప్రకటనలతో వెంచర్లు ఎక్కువగా వెలిశాయి. దళారుల మాయమాటలకు కొనుగోలుదారులు తీవ్రంగా నష్టపోతున్నారు.
తాడికొండ: నిబంధనలు పాటించకుండా అరకొర వసతులతో వెంచర్లు వేసిన నిర్వాహకులు అమ్ముకొని సొమ్ము చేసుకొని వెళ్లిపోతున్నారు. దళారులు కమీషన్ల రూపంలో అందిన కాడికి లాగేస్తున్నారు. ఇప్పుడు అనుమతి ఉన్న ప్లాట్లను మాత్రమే కొనాలంటూ ఏపీ సీఆర్‌డీఏ ప్రకటన జారీ చేసి వెంచర్లను తొలగించి, ఆయా ప్రాంతాల్లో బోర్డులు పెట్టేస్తోంది. కమీషన్‌ల కోసం కొనుగోలుదారులను మోసం చేస్తున్న బ్రోకర్లు మాత్రం నిజం బయటకు రాకుండా అవే ప్లాట్లను అమాయకులకు అంటగడుతూ వారి జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. ఓ పక్క రియల్ భూమ్ పడిపోయినా గజానికి అధిక ధరలు చెప్పి అంటగడుతూ నిలువునా ముంచేస్తున్నారు. ప్రస్తుతం కొనుగోలుదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కొనుగోలుకు వచ్చిన వారికి అనుమతుల గురించి తెలియజేయకుండా ఆకాశంలో చుక్కలు చూపిస్తూ అదిగో రాజధాని.. ఇదిగో ప్రతిష్టాత్మక వర్సిటీకి కూతవేటు దూరం, ఇటువైపు అంతర్జాతీయ విమానాశ్రయం వస్తుంది.. అటు వైపు ఔటర్ రింగ్ రోడ్డు వేస్తారు, ఇక్కడ హైవే... అక్కడ పెద్ద రైల్వే స్టేషన్ అంటూ అంటగట్టేస్తున్నారు. అయితే ప్లాట్లు కొనుగోలు చేసిన తరువాత అసలు నిజం వెలుగుచూస్తోంది. కొనుగోలుదారులు తాము పూర్తిగా మోసపోయామని తెలుసుకొని ఆవేదన చెందుతున్నారు.
ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో...
రాజధాని సమీప మండలాలైన తాడికొండ, కంతేరు, అమరావతి, పెదకూరపాడు తదితర ప్రాంతాల్లో ఈ తంతు కొనసాగుతోంది. రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న కంతేరు, కొప్పురావూరు, పొన్నెకల్లు, పాములపాడు, రావెల, నిడుముక్కల, లాం, పెదపరిమి పలు గ్రామాల్లో ఇబ్బడి ముబ్బడిగా రియల్ ఎస్టేట్ వెంచర్లు ఉన్నాయి. ఇక్కడ 30 ఏళ్ల కిందట వేసిన వెంచర్లకు సైతం నేటికీ ఎలాంటి అనుమతులు రాలేదు. తాడికొండ అడ్డరోడ్డు సెంటర్‌లో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి కోర్టులో ఉన్న వివాదాస్పదమైన భూమిలో తనకు కనీసం పాసు పుస్తకం కూడా రాకుండానే ఏకంగా పెద్ద కల్యాణ మండపం, షాపింగ్ కాంప్లెక్స్, రెస్ట్ రూమ్‌లు, వేదిక, గార్డెన్ వంటివి నిర్మించేశాడు. అద్దెలకు ఇచ్చుకుంటున్నా అధికారులు అటు చూడటం లేదు. అప్పుడప్పుడూ సదరు వ్యాపారిని కొందరు అధికారులు కలుస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
అధికారుల నిర్లక్ష్యం
మరోవైపు అనుమతులు లేని ప్లాట్లు కొనుగోలు చేస్తే నష్టం తప్పదంటున్న అధికారులు వాటిని కట్టడి చేసేందుకు తీసుకుంటున్న చర్యలు నామమాత్రంగా కనిపిస్తున్నాయి. గుర్తించడంలో పోరబాటో లేక సీఆర్‌డీఏ అధికారులతో కలిసి స్థానికంగా ఉన్న రెవెన్యూ, పంచాయతీ అధికారులు పనిచేయకపోవడమో తెలియడం లేదు. అనుమతులు లేకుండా కొనుగోలు చేసిన ప్లాట్లను చట్టబద్ధం చేసుకోవాలంటే గజానికి ప్రభుత్వ ధర ప్రకారం ఎల్‌ఆర్‌ఎస్ చెల్లిస్తేనే ప్లాట్‌కు కనీస వసతులు కల్పిస్తామని సీఆర్‌డీఏ నిబంధన విధించింది. దీంతో కొనుగోలుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విక్రయదారులపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు.
మాటల్లో ‘భూమ్’.. నమ్మితే ఢాం..!


