
మద్యం మత్తులో వర్షపు నీటిలో పడి వ్యక్తి మృతి
లక్ష్మీపురం: మద్యం మత్తులో వర్షపు నీటిలో పడి వంట మాస్టర్ మృతి చెందిన ఘటనపై అరండల్‌పేట పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. గుంటూరులోని ముత్యాలరెడ్డి నగర్ 1వ లైన్ ప్రాంతానికి చెందిన చింతాబత్తిన కుమార్ బాబు (35) అరండల్‌పేట 10వ లైన్‌లోని మెస్‌లో వంట మాస్టర్‌గా పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. భార్య దుర్గాదేవి బొంగరాల బీడు యూపీహెచ్‌సీలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తోంది. కుమార్ బాబు శనివారం అర్ధరాత్రి పూటుగా మద్యం తాగి డొంక రోడ్డు మూడు వంతెనల సెంటర్ వద్ద వర్షపు నీటిలో పడి మృతి చెందాడు. స్థానికులు భార్య దుర్గాదేవికి సమాచారం తెలియజేయడంతో హుటాహుటిన చేరుకుని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. దుర్గాదేవి ఫిర్యాదు మేరకు అరండల్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని ప్రభుత్వ సమగ్రాసుపత్రికి పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు.