
రైతుల పక్షాన మాట్లాడడం తప్పా?
● వరికూటి అశోక్‌బాబుపై దాడి హేయం ● మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు
రేపల్లె: అమ్మ అన్నం పెట్టదు... అడుక్కు తిననివ్వదన్న చందంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనితీరు ఉందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు పేర్కొన్నారు. రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబును ఆదివారం అంబటి రాంబాబు పరామర్శించారు. అనంతరం వైద్యశాల ఆవరణలో విలేకరులతో మాట్లాడారు. కాల్వలలో పూడికలు తీయటానికి ప్రభుత్వానికి మనసు రావటం లేదని, తాము తీసుకుంటామని ఆ ప్రాంత ప్రజలు, రైతులు కోరుతున్నా అనుమతులు ఇవ్వటం లేదన్నారు. రైతుల సమస్యలపై పోరాడుతున్న వరికూటి అశోక్‌బాబు గత మూడు రోజులుగా రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో దీక్ష చేస్తుంటే అటు పాలకులకు గానీ, ఇటు అధికారులకుగానీ చీమకుట్టినట్లయినా లేదన్నారు. రైతుల పక్షాన మాట్లాడడమే ఆయన చేసిన తప్పా అని ప్రశ్నించారు.
చంద్రబాబు, లోకేష్‌లు బాధ్యత వహించాలి
భట్టిప్రోలు నుంచి కనగాల వరకు మురుగు కాలువల్లో పేరుకుపోయిన గుర్రపు డెక్క, తూటికాడ తొలగించాలని అశోక్‌బాబు ధర్నా చేస్తే అతనిపై పోలీసులు జులం ప్రదర్శించటం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా అనేక పోరాటాలు, ఆందోళనలు చేపడుతున్న అశోక్‌బాబుకు ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలుస్తున్నారన్నారు. రేపల్లె పట్టణ సీఐ మల్లికార్జునరావు అధికారిగా కాకుండా కూటమి కార్యకర్తగా వ్యవహరిస్తున్నాడని, భవిష్యత్‌లో ఇబ్బందులు పడక తప్పదని హెచ్చరించారు. అశోక్‌బాబుపై వ్యక్తిగత దాడి చేయటం సీఐ అవివేకానికి నిదర్శనం అన్నారు. అశోక్‌బాబుకు ఏమైనా జరిగితే చంద్రబాబు, లోకేష్‌లు బాధ్యత వహించాలన్నారు. ఆయన వెంట పార్టీ పట్టణ, మండల కన్వీనర్లు కరేటి శేషగిరిరావు, మేడికొండ అనిల్, జిల్లా అధికారి ప్రతినిధి కేవీ కృష్ణారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు చదలవాడ శ్రీనివాసరావు, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ చిత్రాల ఓబేదు, నాయకులు చిమటా బాలాజీ, బొర్రా శ్రీనివాసరావు, యార్లగడ్డ మదన్‌మోహన్,వీసం నాగలక్ష్మి, సజ్జా పద్మావతి, లియాకత్ బాషా తదితరులు ఉన్నారు.