
ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి
తాడేపల్లి రూరల్: ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఏపీ ఎన్‌జీవో సంఘం కృషి చేస్తుందని రాష్ట్ర అధ్యక్షుడు ఎ. విద్యాసాగర్ అన్నారు. ఆదివారం తాడేపల్లి పట్టణ పరిధిలోని ఆర్టీసీ ఎన్‌ఎంయూఏ రాష్ట్ర కార్యాలయంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.రమణారెడ్డి అధ్యక్షతన కేంద్ర కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎ. విద్యాసాగర్ మాట్లాడుతూ.. ఎన్‌ఎంయూఏ చేపట్టే ప్రతి కార్యక్రమంలో ఏపీ ఎన్‌జీవో కలసి నడుస్తుందన్నారు. సంఘం రాష్ట్ర కార్యాలయ నిర్మాణం కోసం సహాయ సహకారాలు అందించేందుకు ఏపీ ఎన్‌జీవో, ఏపీజేఏసీలు సిద్ధంగా ఉన్నాయన్నారు. నాలుగేఽళ్లుగా నిలిచిపోయిన పదోన్నతుల ప్రక్రియను పునఃప్రారంభించాలన్నారు. ఆర్టీసీలో 8 వేలకుపైగా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలన్నారు. ఎన్‌ఎంయూఏ రాష్ట్ర అధ్యక్షులు పీవీ రమణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా డిపో గ్యారేజీలను ఆధునికీకరించాలని కోరారు. ఎన్‌ఎంయూఏ ప్రధాన కార్యదర్శి వై.శ్రీనివాసరావు, సంయుక్త కార్యదర్శి రాజేష్ కుమార్, ఉపాధ్యక్షులు శ్రీనివాసరాజు, సూర్యచంద్రరావు, పీవీ శివారెడ్డి, భాస్కర నాయుడు, వివిధ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.