
ముగిసిన జర్నలిస్టుల పునశ్చరణ తరగతులు
తెనాలి: ఆంధ్రప్రదేశ్ సీఆర్ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో ఏపీయూడబ్ల్యూజే సహకారంతో జిల్లా గ్రామీణ విలేకరుల శిక్షణ తరగతులు రెండో రోజైన ఆదివారం కొనసాగాయి. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఆదివారం ఉదయం అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ అధ్యక్షతన జరిగిన సభలో దేవగళ్ల రామకృష్ణ, డి.సోమసుందర్, బీహెచ్‌వీ మంగేష్, అజయ్‌లు ‘విలేకరుల నుంచి డెస్క్ ఏం కోరుకుంటుంది’, ‘గ్రామీణ కథనాలు, పత్రికా భాష, మెలకువలు’, ‘స్మార్ట్ రిపోర్టింగ్’ అంశాలపై ప్రసంగించారు. సాయంత్రం జరిగిన ముగింపు సభలో తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సీఆర్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్‌కుమార్ అధ్యక్షత వహించారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు, పూర్వ ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్, అకాడమీ కార్యదర్శి మణిరామ్ మాట్లాడారు. ఆహ్వాన కమిటీ పర్యవేక్షించింది.
ముగిసిన ఏసీఏ నామినేషన్ల ఘట్టం
మంగళగిరి: ఆంధ్ర క్రికెట్ అసోషియేషన్ నామినేషన్ల ఘట్టం ఆదివారంతో ముగిసింది. ఈ నెల 16వ తేదీన ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ తరఫున డాక్టర్ కె గోవిందరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. మండలంలోని నవులూరు అమరావతి టౌన్‌షిప్‌లో జరిగిన నామినేషన్లలో కార్యదర్శి పదవికి రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు తన నామినేషన్‌ను నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు సమర్పించారు. ఏసీఏ అధ్యక్ష పదవికి కేశినేని శివనాథ్, ఉపాధ్యక్ష పదవికి బండారు నరసింహారావు, ట్రెజరరీ పదవికి దండమూడి శ్రీనివాస్, కౌన్సిలర్ పదవికి దండు గౌరువిష్ణు, జాయింట్ సెక్రటరీ పదవికి బి.విజయకుమార్, బి. శ్రీనివాసరాజు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ ఉపసంహరణకు ఈ నెల 11వ తేదీ గడువుగా నిర్ణయించారు.
కృష్ణానదిలో స్నానానికి దిగి యువకుడు మృతి
కొల్లిపర: కృష్ణానదిలో స్నానానికి దిగి యువకుడు మృతి చెందిన సంఘటన కొల్లిపర శివారు కొత్తబొమ్మువానిపాలెంలో జరిగింది. ఎస్‌ఐ కోటేశ్వరరావు తెలిపిన వివరాలు... మండల పరిధిలోని తూములూరు గ్రామానికి చెందిన వేము రవికిరణ్ (19)తన స్నేహితులతో కృష్ణానదికి వచ్చాడు. నదిలో రవికిరణ్ ఆడుకుంటుండగా కృష్ణానది ఉరవడికి కొట్టుకుపోయాడు. ఈ విషయాన్ని పోలీసుస్టేషన్‌లో కుటుంబ సభ్యులు తెలపగా వెంటనే ఎస్‌ఐ కోటేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్ల చేత గాలింపు చేయించారు. ఎట్టకేలకు రవికరిణ్ మృతదేహం లభ్యం కావడంతో కేసునమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు ఎస్‌ఐ కోటేశ్వరరావు తెలిపారు.
ప్రధానోపాధ్యాయుల సంఘం పల్నాడు జిల్లా కార్యవర్గం ఎన్నిక
నరసరావుపేట ఈస్ట్: ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయుల సంఘం పల్నాడు జిల్లా శాఖ అధ్యక్షుడిగా రామిశెట్టి గోవిందరాజులు (జెడ్పీ హైస్కూల్, కాకాని), ప్రధాన కార్యదర్శిగా రెడ్డి శ్రీనివాసరెడ్డి (జెడ్పీ హైస్కూల్, వెన్నాదేవి), కోశాధికారిగా పులిపాటి శ్రీనివాసరావు (జెడ్పీ హైస్కూల్, తూబాడు) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంఘం సర్వసభ్య సమావేశం, సంఘం పల్నాడు జిల్లా నూతన కార్యవర్గ ఎన్నికను ఆదివారం ప్రకాష్‌నగర్‌లోని శ్రీతిలక్ మున్సిపల్ హైస్కూల్‌లో నిర్వహించారు. సంఘం గౌరవాధ్యక్షునిగా కొండా శ్రీనివాసరావు (సంతగుడిపాడు), రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా బి.ఎం.సుభాని (రొంపిచర్ల), ఏ.శ్రీనివాసరెడ్డి (75 తాళ్లూరు), ఎస్.విజయలక్ష్మి (కోటప్పకొండ), జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎం.రామారావు (బొగ్గరం), జిల్లా కేంద్రం సెక్రటరీగా వై.హనుమంతరావు (గోగులపాడు), మీడియా ప్రతినిధిగా వి.వెంకటరావు (సాతులూరు) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా సంఘం గుంటూరుజిల్లా అధ్యక్షుడు జి.శ్రీనివాసరావు, పరిశీలకునిగా రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు జి.శ్రీనివాసరావు వ్యవహరించారు. నూతన అధ్యక్ష, కార్య దర్శులు గోవిందరాజులు, శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర నాయకత్వం, సంఘం సభ్యుల సహకారంతో ప్రధానోపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.

ముగిసిన జర్నలిస్టుల పునశ్చరణ తరగతులు