నాదెండ్ల: విద్యుత్ షాక్‌కు గురై రైతు దుర్మరణం పాలైన సంఘటన మండల కేంద్రమైన నాదెండ్ల గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. చేకూరి హనుమంతరావు (70) తూబాడు రోడ్డులో తనకున్న వ్యవసాయ భూమిలో నర్సరీ నిర్వహిస్తున్నాడు. మధ్యాహ్నం 3.30 సమయంలో పొలానికి వెళ్లి ఇనుప గేటు తీసే క్రమంలో విద్యుత్‌షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. పొలం చుట్టూ రక్షణగా వేసిన ఇనుప కంచెకు విద్యుత్ వైరు తగిలి విద్యుత్ ప్రవహించినట్లు తెలుస్తోంది. దీంతో గేటు తీసే క్రమంలో షాక్‌కు గురైనట్లు భావిస్తున్నారు. ఈ పొలాన్ని కౌలుకు తీసుకున్న చంటి అనే వ్యక్తి సాయంత్రం 4 గంటల సమయంలో వెళ్లగా, విగతజీవిగా పడిఉన్న హనుమంతరావును చూసి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
నగలు చోరీకి పాల్పడిన ఇద్దరు అరెస్టు
చిలకలూరిపేట: బంగారు ఆభరణాలు చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులను చిలకలూరిపేట రూరల్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. రూరల్ సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నరసరావుపేట డీఎస్పీ కె.నాగేశ్వరరావు వివరాలు వెల్లడించారు. చిలకలూరిపేట పట్టణంలోని డైక్‌మెన్ కాలనీకి చెందిన పేదాల రాముడు, మదర్ థెరిస్సా కాలనీలో నివాసం ఉంటున్న బీరా సిద్దు వ్యసనాలకు బానిసలై దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో మండలంలోని పసుమర్రు గ్రామానికి చెందిన యలగాల హనుమాయమ్మ ఈ నెల ఆరోతేదీన ఇంటికి తాళం వేసి సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లింది.
తిరిగి 11వ తేదీ ఇంటికి వచ్చి చూడగా ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నాయి. పరిశీలించగా 42 సవర్ల బంగారు నగలు, 59.40 గ్రాముల వెండి వస్తువులు, రాగి బిందెలు, చెంబులు, ఇత్తడి సామగ్రి దొంగతనానికి గురైనట్లు గుర్తించి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వీటి విలువ సుమారు రూ. 34లక్షలు ఉంటుంది. రూరల్ సీఐ బి.సుబ్బనాయుడు, ఎస్‌ఐ జి.అనిల్‌కుమార్ ఆధ్వర్యంలో విచారణ నిర్వహించి నిందితులను చిన పసుమర్రు గొర్రెల మండి వద్ద అరెస్టు చేసి వారి నుంచి చోరీకి గురైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఫిర్యాదు అందిన వారంలోపు నిందితులను పట్టుకొని వారి వద్ద నుంచి నగలు స్వాధీనం చేసుకోవడంపై పోలీసు సిబ్బందికి డీఎస్పీ అభినందనలు తెలిపారు. సమావేశంలో ఏఎస్‌ఐలు డి.రోసిరాబు, జి.సుబ్బారావు, హెచ్‌సీలు కె.దేవరాజు, జె.శ్రీధర్, పీసీలు ఎం.ఇర్మియా, బి.అశోక్, ఎం.రత్నకిశోర్ పాల్గొన్నారు.
ట్రాక్టర్ తిరగబడి డ్రైవర్ మృతి
సంతమాగులూరు (అద్దంకి రూరల్): క్వారీలో పనికి వెళ్తూ ట్రాక్టర్ తిరగబడి డ్రైవర్ మృతి చెందగా నలుగురికి గాయాలయ్యాయి. ఈఘటన ఆదివారం రాత్రి సంతమాగులూరు మండలం సజ్జాపురం గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై పట్టాభిరామయ్య తెలిపిన వివరాల మేరకు.. తమిళనాడుకు చెందిన ఇలుమలై నాగరాజ్ (44) సజ్జాపురం గ్రామంలో ఉన్న తిరుమల సాయిచంద్ర గ్రానైట్ క్వారీలో పనిచేస్తుంటాడు. ఆదివారం రాత్రి ట్రాక్టర్ కొండ ఎక్కుతుండగా తిరగబడింది. ట్రాక్టర్ నడుపుతున్న నాగరాజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాక్టర్‌పై ఉన్న నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. మృతుడి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చిలకలూరిపేట రూరల్ పోలీసులు


