
ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులను పారదర్శకంగా నిర్వహించాలి
గుంటూరు ఎడ్యుకేషన్: ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులను పారదర్శకంగా నిర్వహించాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం బ్రాడీపేటలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మున్సిపల్, జిల్లా కమిటీ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉన్నత పాఠశాలల్లో సమాంతర మీడియాన్ని కొనసాగిస్తూ, విద్యార్థి, ఉపాధ్యాయుల నిష్పత్తి 1:45గా చూపాలన్నారు. రేషనలైజేషన్‌లో జూనియర్, సీనియర్‌కు ఒకే నిబంధన ఉంచి, మాన్యూవల్ పద్ధతిలో కౌన్సెలింగ్ జరపడంతోపాటు ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు ఎస్జీటీలు కచ్చితంగా ఉండేలా చూడాలని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ రాష్ట్ర ప్రచురణల విభాగం చైర్మన్ ఎం.హనుమంతరావు మాట్లాడుతూ వేసవి సెలవులు ముగిసేలోపే బదిలీల ప్రక్రియ పూర్తి చేసి జూన్ 12 నుంచి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. యూటీఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు.రాజశేఖర్‌రావు, ఎం.కళాధర్ మాట్లాడుతూ సీనియార్టీ జాబితాలన్నీ అప్‌డేట్‌గా ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. పొరపాట్లు ఉంటే తక్షణం సరిచేయాలని, అన్ని ఖాళీలను డిస్‌ప్లే చేసి పారదర్శకంగా బదిలీలు నిర్వహించాలని కోరారు. సమావేశంలో జిల్లా సహాధ్యక్షురాలు వై.నాగమణి, జిల్లా కార్యదర్శులు సీహెచ్ ఆదినారాయణ, జి.వెంకటేశ్వరరావు, బి.ప్రసాదు, ఎం.కోటిరెడ్డి, కేదార్నాథ్, ప్రేమ్ కుమార్, చిన్నయ్య, గఫార్, శివరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు