
పేదరికం, అసమానతల మధ్య యువకుల జీవితాలు
ఏఎన్‌యూ: పేదరికం, అసమానతల మధ్య యువకుల జీవితాలు కొనసాగుతున్నాయని సెస్ (సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్) సంస్థ నిర్వహించిన ‘మంగ్ లైవ్స్ స్టడీ’ అంశాలు బహిర్గతం చేశాయి. హైదరాబాద్ సెస్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో యంగ్ లైవ్స్ స్టడీ అంశాలను విడుదల చేశారు. కార్యక్రమానికి ఏపీ మహిళ, శిశు సంక్షేమ, విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధుల శాఖ కార్యదర్శి ఎ.సూర్యకుమారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘యంగ్ లైవ్స్ స్టడీ’ ద్వారా 2001–02 నుంచి హైదరాబాద్ సెస్ దీర్ఘకాలిక అంతర్జాతీయ పరిశోధన అధ్యయనాన్ని నిర్వహించడం అభినందనీయమని సూర్యకుమారి పేర్కొన్నారు. సెస్ డైరెక్టర్ ఈ రేవతి మాట్లాడుతూ బాల, బాలికల జీవితాల్లో మార్పులను అధ్యయనం చేసేందుకు ఈ స్టడీ దోహదం చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఏఎన్‌యూ రిజిస్ట్రార్ ఆచార్య జి.సింహాచలం, సోషియాలజీ, సోషల్ వర్క్ విభాగాధిపతి ఆచార్య ఎం.త్రిమూర్తిరావు, యూజీసీ కోఆర్డినేటర్ ఆచార్య వై అశోక్ కుమార్, పలువురు అధికారులు, ప్రతినిధులు పాల్గొన్నారు.
ఏపీ గ్రామీణ బ్యాంకుకు భూమి కేటాయించాలి
కొరిటెపాడు (గుంటూరు ఈస్ట్): రాష్ట్ర రాజధాని అమరావతిలో బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని స్థాపించేందుకు అవసరమైన భూమిని కేటాయించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్‌ను మర్యాదపూర్వకంగా కలిసి విన్నవించినట్లు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు చైర్మన్ కె. ప్రమోద్‌కుమార్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఫైనాన్షియల్ ఇంక్లూషన్, గ్రామీణాభివృద్ధిని విస్తరించాలన్న బ్యాంకు దృష్టిని ప్రధాన కార్యదర్శికి వివరించినట్లు చెప్పారు. రాజధాని ప్రాంతంలో శాశ్వత ప్రధాన కార్యాలయాన్ని స్థాపించటం వల్ల బ్యాంకు పరిపాలనా సామర్ధ్యాలు బలపడతాయని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామీణ ఖాతాదారులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు వీలవుతుందని విన్నవించినట్లు తెలిపారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. వీరితోపాటు హరీష్ బేతా తదితరులు ఉన్నారు.

పేదరికం, అసమానతల మధ్య యువకుల జీవితాలు