
పవర్ లిఫ్టింగ్‌లో క్రీడా రత్నం
తెనాలి: పట్టణాలు, నగరాల్లో జిమ్‌లు, క్రీడా అకాడమీలు క్రీడాభిరుచి కలిగిన యువతకు అందుబాటులో ఉంటున్నాయి. ఎందరో యువతీ యువకులు వాటిని అందిపుచ్చుకుని క్రీడారంగంలో పోటీ పడుతున్నారు. పతకాలను సాధిస్తూ ప్రభుత్వ ఉద్యోగాలను పొందుతున్నారు. గ్రామాల్లోనూ ఆ సౌకర్యాలు ఏర్పాటైతే అక్కడ నుంచి కూడా క్రీడారత్నాలు వెలుగులోకి వస్తాయి. పట్టణ యువతతో పోటీపడి విజయాలు సాధిస్తారు. ఇటీవల ఆసియా క్లాసిక్ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్, యూనివర్శిటీ క్లాసిక్ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్–2025లో మొత్తం 8 పతకాలను సాధించిన పవర్‌లిఫ్టర్ నాగం జ్ఞానదివ్య ఇందుకో నిదర్శనం.
ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్‌లో జరిగిన ఆసియా క్లాసిక్ పవర్‌లిఫ్టింగ్‌లో రెండు రజత పతకాలు, రెండు కాంస్య పతకాలను కై వసం చేసుకున్న జ్ఞానదివ్య, యూనివర్శిటీ క్లాసిక్ పోటీల్లో నాలుగు స్వర్ణ పతకాలను సాధించింది. ఆసియా సెకండ్ బెస్ట్ లిఫ్టర్ అవార్డును స్వీకరించింది. 2021లో పవర్‌లిఫ్టింగ్‌లో సాధన ఆరంభించిన జ్ఞానదివ్య రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో వరుసగా పాల్గొంటూ అవలీలగా పతకాలను సాధిస్తోంది. కామన్‌వెల్త్. వరల్డ్ పవర్ లిప్టింగ్ ఛాంపియన్‌షిప్‌లోనూ పాల్గొని విజయాలను అందుకుంటున్న జ్ఞానదివ్య గ్రామీణ ప్రాంత క్రీడారత్నం. ప్రస్తుతం కేఎల్ యూనివర్శిటీలో బీసీఏ సెకండియర్ పూర్తిచేసింది.
కాకతాళీయంగా సాధన
తెనాలి రూరల్ మండలం గ్రామం కఠెవరం ఆమె సొంతూరు. సుధారాణి, వెంకటేశ్వరావు తల్లిదండ్రులు. పవర్‌లిఫ్టింగ్‌లో సాధన కాకతాళీయంగా జరిగింది. ఇంటర్మీడియెట్ చదువుతుండగా గ్రామంలో మాతృశ్రీ అకాడెమీ ఏర్పాటైంది. వాస్తవానికి కఠెవరం గ్రామం ఒకప్పుడు అథ్లెటిక్స్‌కు కేంద్రం, ఇక్కడ్నుంచి తయారైన క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో తలపడ్డారు. గ్రామం నుంచి వెయిట్‌లిఫ్టర్లను తయారు చేయాలనే సంకల్పంతో ఇక్కడ అకాడమీ ఏర్పాటైంది. క్రీడాభిలాష కలిగిన వెంకటేశ్వరరావు ప్రోత్సాహంతో జ్ఞానదివ్య అకాడమీలో చేరింది. వెంకటేశ్వరరావు, వలి, సుధాకర్, రామిరెడ్డి, వీరారెడ్డి శిక్షణతో వెయిట్‌లిఫ్టింగ్ శిక్షణ ఆరంభించింది. కొద్దిరోజుల తర్వాత పవర్‌లిఫ్టింగ్‌కు మారింది. నందివెలుగు జడ్పీ హైస్కూలు పీఈటీ కొల్లిపర నాగశిరీష శిక్షణలో క్రమం తప్పక సాధన చేస్తూ, 2021 ఆఖర్నుంచి పోటీల్లో పాల్గొంటూ వచ్చింది. సబ్‌జూనియర్స్‌లో 84 పైగా కిలోల కేటగిరీలో తలపడుతున్న జ్ఞానదివ్య, కేవలం తొమ్మిది నెలల వ్యవధిలో రాష్ట్ర, జాతీయస్థాయిలో మూడేసి స్వర్ణాలు, దక్షిణభారత పోటీల్లో రజత పతకాన్ని గెలిచింది.
జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో సత్తా చాటుతున్న నాగం జ్ఞానదివ్య సొంతూరు కఠెవరంలో సాధన ప్రభుత్వ పాఠశాల పీఈటీచే శిక్షణ కామన్‌వెల్త్ పోటీల్లోనూ ఆరు పతకాలు
అంతులేని ఆత్మవిశ్వాసంతో
2022లో కేరళలో జరిగిన జాతీయ పోటీల్లో జ్ఞానదివ్య, మూడు బంగారు పతకాలను సాధించటమే కాకుండా, స్క్వాట్, డెడ్‌లిఫ్ట్‌లో అంతకుముందున్న రికార్డులను చెరిపేసి కొత్త రికార్డులను సృష్టించింది. టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో జరిగిన వరల్డ్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించింది. ఆ పోటీల్లో రెండు కాంస్య పతకాలను దక్కించుకుంది. 2022లో న్యూజిలాండ్‌లో జరిగిన కామన్‌వెల్త్ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో 3 స్వర్ణాలు, ఒక రజతం నెగ్గింది. 2023లో కేరళలో జరిగిన ఆసియా క్లాసిక్ పవర్‌లిఫ్టింగ్ పోటీల్లో నాలుగు రజత పతకాలను అందుకుంది. గతేడాది సౌతాఫ్రికాలోని సన్‌సిటీలో నిర్వహించిన కామన్‌వెల్త్ క్లాసిక్ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లోనూ నాలుగు కాంస్యాలను కై వసం చేసుకుంది. ఏ పోటీలో తలపడినా పతకం మాత్రం ఖాయమంటున్న జ్ఞానదివ్య, లక్ష్యం మాత్రం అంతర్జాతీయంగా మరింత గుర్తింపును తెచ్చుకోవటం, క్రీడల కోటాలో రైల్వేశాఖలో ఉద్యోగం సాధించటమేనంటుంది.

పవర్ లిఫ్టింగ్‌లో క్రీడా రత్నం