సాక్షి, టాస్క్‌ఫోర్స్: ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులే చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. కూటమి నేతల వద్ద మెప్పు కోసం పోలీసులమన్న భావనను పక్కన పెట్టి విపక్ష నేతలను టార్గెట్ చేస్తున్నారు. వరుస వెంబడి జరుగుతున్న అక్రమ అరెస్ట్‌లతో రాష్ట్రం అట్టుడుకిపోతుంది. కూటమి ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలు, అరాచకాలను ప్రశ్నిస్తే గొంతులను నులిమేస్తున్నారు. రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ కొందరు వ్యవస్థపై ప్రజలకు గౌరవం లేకుండా చేస్తోంది. దాచేపల్లి పోలీసుల తీరు రోజురోజుకు వివాదస్పదమౌతున్నది. ప్రధానంగా దాచేపల్లి సీఐగా విధులు నిర్వర్తిస్తున్న పి.భాస్కర్ రెడ్‌బుక్ కోసమే ఉద్యోగం చేస్తున్నట్లుగా వ్యవహరిస్తున్నారు. సీఐగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి భాస్కర్ వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులపై తప్పుడు కేసులు పెట్టి జైలు పాలు చేసిన ఘనుడు. అక్రమ అరెస్ట్‌లపై ప్రశ్నించే వారిని పోలీస్‌స్టేషన్‌లోకి రాకుండా అడ్డుకున్న ఈ బేడీల భాస్కర్ ఆగడాలపై ఉన్నతాధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారో అనే ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి.
బీసీ యువకుడిపై ప్రతాపం
టీడీపీ అధికారంలోకి రావడంతో తంగెడ గ్రామానికి చెందిన ఉప్పుతోళ్ల యల్లయ్య, కుమారుడు హరికృష్ణలపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తుండటంతో తెలంగాణ వెళ్లి డ్రైవర్ వృత్తి చేస్తూ జీవనం సాగిస్తున్నారు. గ్రామంలో జరిగే పండుగకు వచ్చిన బీసీ యువకుడు హరికృష్ణపై టీడీపీ నేత షేక్ జానీబాషా తన అనునయుడితో చెప్పించిన కట్టుకథతో పోలీసులు గురువారం కేసు కట్టారని హరికృష్ణ కుటుంబసభ్యులు వాపోతున్నారు. పోలీసు వాహనంలో కాకుండా టీడీపీ నేత కారులో వచ్చి తీసుకెళ్లడం ఏంటని ప్రశ్నించారు. దాని ఆధారంగానే హరికృష్ణను చిత్రహింసలకు గురిచేశారని వాపోతున్నారు. ఎన్నికల రోజున జరిగిన గొడవలో హరికృష్ణపై కేసు నమోదు చేసి పోలీసులు రౌడీషీట్ ఓపెన్ చేశారు. ఆ గొడవకు సంబంధించి టీడీపీ వారికి రూ.40లక్షలు చెల్లించాలని సీఐ భాస్కర్ నేరుగా పంచాయితీ చేశాడు. టీడీపీ నేత జానీబాషా రూ.40లక్షలు ఇస్తేనే కేసులు రాజీకి వస్తామని ఒత్తిడి చేశారు. ఈ కేసులో ఉన్న వైఎస్సార్ సీపీ నేతలను ప్రతి రోజూ స్టేషన్‌కి పిలిపించి ఇబ్బంది పెట్టారు. సీఐ తీరుతో వైఎస్సార్ సీపీ నేతలు విసుగు చెంది కోర్టుని ఆశ్రయించారు. కోర్టు సైతం సీఐ భాస్కర్ తీరుని తప్పుపట్టింది. తంగెడకి చెందిన వైఎస్సార్ సీపీ నేతలు దేవళ్ల వీరాస్వామి, గొగిరెడ్డి వెంకటరెడ్డి, వట్టె రామచంద్రారెడ్డితో పాటుగా మరికొందరిపై రకరకాలుగా కేసులతో సీఐ వేధించాడని వారు వాపోతున్నారు.
నేను, నా కుమారుడు హరికృష్ణ టిప్పర్లకు డ్రైవర్లుగా పనిచేసుకుంటూ తెలంగాణలో ఉంటున్నాం. పండక్కి ఇంటికి వస్తే పోలీసులు మా ఇంటికి వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. ఏ కారణం లేకుండా నా బిడ్డని పోలీసులు దౌర్జన్యంగా అదుపులోకి తీసుకుని తప్పుడు కేసు పెట్టి చిత్రహింసలు పెట్టారు. పోలీసులు రాజ్యాంగం అమలు చేయకుండా టీడీపీ నాయకులు చెప్పిందే చేస్తున్నారు. ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని అంతమొందించాలని చూస్తున్నారు.
–ఉప్పుతోళ్ల యల్లయ్య, హరికృష్ణ తండ్రి
పోలీసులు చిత్రహింసలకు గురిచేశారు
దౌర్జన్యంగా ఎత్తుకెళ్లారు
వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలే
టార్గెట్‌గా అక్రమ కేసులు, వేధింపులు
ఇప్పటికే సీఐ తీరుపై కోర్టును
ఆశ్రయించిన బాధితులు
టీడీపీ నేతల ఆదేశాలతో బీసీ
యువకుడు హరికృష్ణపై అక్రమ కేసు
థర్డ్ డిగ్రీ ప్రయోగించడంతో నడవలేని
స్థితిలో ఉన్న కుమారుడిని
చూసి చలించిన తల్లిదండ్రులు
సీఐ భాస్కర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం
చేసిన మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి
– ఉప్పుతోళ్ల హరికృష్ణ
గురజాల: దాచేపల్లి పోలీసులు తనను చిత్రహింసలకు గురిచేసినట్లు జడ్జి ముందు ఉప్పుతోళ్ల హరికృష్ణ వాగ్మూలం ఇచ్చినట్లు ఆయన తరుపు న్యాయవాది కిరణ్ దాసు తెలిపారు. దాచేపల్లి మండలం తంగెడ గ్రామానికి చెందిన ఉప్పుతోళ్ల హరికృష్ణను దాచేపల్లి పోలీసులు గురువారం అదుపులోకి తీసుకుని, రాత్రి 6 గంటలకు జడ్జి ముందు హాజరుపరిచారు. ఉప్పుతోళ్ల హరికృష్ణ మాట్లాడుతూ దాచేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించి కాళ్లపై, చేతులపై కర్రలతో కొట్టారని, సీఐ భాస్కరరావు చిత్రహింసలకు గురిచేశారని న్యాయమూర్తి ముందు వాపోయాడు. హరికృష్ణ ఇచ్చిన వాగ్మూలం రికార్డు చేసిన న్యాయమూర్తి వైద్య పరీక్షల నిమిత్తం గుంటూరు జీజీహెచ్‌కు రిఫర్ చేస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు న్యాయవాది తెలిపారు. 14 రోజులపాటు రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చారు.
భాస్కరా...తీరు మారదా!
భాస్కరా...తీరు మారదా!