
మామూళ్లు ఇచ్చి మరీ జేబులు నింపుకొంటున్న టీడీపీ నేతలు
కాయ్ రాజా కాయ్... అంటూ జిల్లాలో మళ్లీ పేకాట శిబిరాలు తెరుచుకున్నాయి. గుంటూరు నగరం నడిబొడ్డున ఉన్న ఎల్‌వీఆర్ క్లబ్, గుంటూరు క్లబ్‌లు కేంద్రాలుగా మారిపోయాయి. వీటితోపాటు పలు లాడ్జీలలో పేకాట యథేచ్ఛగా సాగుతోంది. తమ్ముళ్లు తమ జేబులు నింపుకొంటూనే ఆయా అధికారులకు మామూళ్లు ఇస్తున్నారు. ఆ మత్తులో అధికారులు కనీసం తనిఖీల ఊసు కూడా ఎత్తడం లేదు.
– సాక్షి ప్రతినిధి, గుంటూరు
నగరం మధ్యలో ఉన్న ఎల్‌వీఆర్ క్లబ్‌లో రూ.2 వేల నుంచి రూ.లక్ష వరకు పందేలతో పేకాట నడుస్తోంది. రూ.లక్షకు 500 పాయింట్లు ఇస్తారు. ఒక్కో పాయింట్ విలువ రూ.200 ఉంటుంది. డ్రాప్‌నకు రూ.5 వేలు, కౌంట్‌కు రూ.40 వేల వరకు ఆడుతున్నారు. నెల క్రితం వరకు సభ్యులకు మాత్రమే అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఎవరొచ్చినా తాత్కాలిక సభ్యత్వాలు ఇస్తూ వారితోనూ ఆడిస్తున్నారు. 100 నుంచి 200 మంది వరకు తాత్కాలిక సభ్యత్వాలు తీసుకున్నట్లు సమాచారం. రూ.లక్ష, రూ.50 వేలు, రూ.20 వేల టేబుళ్లు ఐదు చొప్పున ఇక్కడ ఉన్నట్టు తెలిసింది. రూ.10 వేలవి 10 వరకు క్లబ్‌లో నడుస్తున్నాయి.
● పలకలూరు రోడ్‌లో ఉన్న గుంటూరు క్లబ్‌లో ఏకంగా రూ.2 లక్షల ఆటలు కూడా నడుస్తున్నాయి. ఇక్కడ కూడా ఎవరు వచ్చినా తాత్కాలిక సభ్యత్వం ఇచ్చి ఆడిస్తున్నారు.
● మంత్రి లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి పరిధిలో ఉన్న విజయవాడ క్లబ్‌లో రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు ఆటలు నడుస్తున్నాయి. అనుబంధ సభ్యుల పేరుతో ఇతరులను కూడా ఆడిస్తున్నారు.
● చిలకలూరిపేట క్లబ్‌లో కూడా రూ.50 వేలు, రూ.20 వేలు, రూ.10 వేల ఆటలు ఆడిస్తున్నారు. ఇతర జూదాలు కూడా నడుస్తున్నాయి.
● ఇవన్నీ అధికార టీడీపీ నాయకులు తమ కనుసన్నల్లో నడిపిస్తున్నారు. దీనికి అగ్ర నాయకత్వం ఆమోదం ఉందని బయటకు చెబుతుండటంతో పోలీసులు కూడా అటువైపు కన్నెత్తి చూడటం లేదు.
లాడ్జీలలోనూ యథేచ్ఛగా...
నగరంలో సుమారుగా 80 నుంచి 100 వరకు లాడ్జీలు ఉన్నాయి. వీటిలో కూటమి నేతల అండదండలతో పేకాట మాత్రమే కాదు... వ్యభిచారం కూడా జోరుగా జరుగుతోంది. రెండు గదులున్న చోట ఒక గదికి బయట వైపు తాళం వేసి రెండో గదిలో పేకాట ఆడిస్తున్నారు. రోజుకు రూ.15 వేల నుంచి రూ. 25 వేల వరకు బంకిని తీస్తున్నారని తెలుస్తోంది. రాజా గారి తోట, గుంటూరు వారి తోట, ఆర్టీసీ బస్టాండ్ పరిసర ప్రాంతాలతోపాటు అరండల్ పేట ఒకటో లైను, పట్టాభిపురంలోని పలు గెస్ట్ హౌస్‌లలో కూడా పేకాట విచ్చలవిడిగా సాగుతోంది.
నెలవారీగా రూ.లక్షలు
లాడ్జీల నుంచి స్టేషన్లకు కేవలం తూర్పు నియోజకవర్గ పరిధిలోనే నెలకు రూ. ఐదు లక్షలపైగా అందుతోందని సమాచారం. పశ్చిమ పరిధిలో కూడా సుమారు రూ. నాలుగు లక్షల వరకు ఇస్తున్నారు. ఈ వసూళ్లలో ఐడీ పార్టీ (మఫ్టీ పార్టీ) కానిస్టేబుళ్లు కీలకంగా వ్యవహరిస్తున్నారు. తెలుగుదేశం నేతలు చెప్పిన విధంగా అక్కడక్కడ దాడులు నిర్వహించి లాడ్జి యజమానులను బెదిరింపులు గురి చేస్తున్నట్లు తెలుస్తోంది.
టీడీపీ నేతల వసూళ్ల పర్వం
ఎల్‌వీఆర్ క్లబ్, గుంటూరు క్లబ్‌లలో మళ్లీ షురూ తాత్కాలిక సభ్యత్వాలు.. రూ. లక్షల్లో పందేలు
పేకాట స్థావరాలుగా మారిన నగరంలోని లాడ్జీలు
తూతూ మంత్రంగా పోలీసుల దాడులు క్లబ్బుల వైపు కన్నెత్తి చూడని అధికారులు
లాడ్జీల అసోసియేషన్‌కి సంబంధించి పలు వివాదాలు కూడా నడుస్తున్నాయి. కూటమికి సంబంధించిన ఒక నేత అసోసియేషన్‌ను తానే నడిపిస్తానని, నెలకి రూ.15, 000 చొప్పున ప్రతి లాడ్జి వారు ఇవ్వాలని నిర్వాహకులను ఇబ్బందులు గురి చేస్తున్నట్లు తెలుస్తోంది. పోలీస్ స్టేషన్‌లకు రూ.9 వేల చొప్పున కేటాయించినట్లు సమాచారం. మిగతా రూ.6 వేలను కూటమి నేతలు తీసుకునేందుకు ప్రణాళిక ప్రకారం ప్రజా ప్రతినిధులతో బెదిరింపులకు పాల్పడుతున్నట్లు చెబుతున్నారు.

మామూళ్లు ఇచ్చి మరీ జేబులు నింపుకొంటున్న టీడీపీ నేతలు