
జాతీయ క్రీడకు గ్రహణం
ఒలింపిక్స్‌లో వరుసగా బంగారు పతకాలు సాధించిన క్రీడ. ప్రపంచం మెచ్చిన ధ్యాన్‌చంద్‌లాంటి అద్భుత క్రీడాకారులను అందించిన క్రీడ. ఘన చరిత్రను సొంతం చేసుకోవడంతోపాటు జాతీయ క్రీడ హోదాను దక్కించుకున్న హాకీకి జిల్లాలో చోటులేకుండా పోయింది.
గుంటూరు వెస్ట్ (క్రీడలు): దశాబ్దకాలం నుంచి జిల్లాలో హాకీకి క్రీడా మైదానం లేదు. గుంటూరు నగరంలో సుమారు 18 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బీఆర్ స్టేడియంలో కూడా హాకీకి చోటుక ల్పించకపోవడం దారుణమని సీనియర్ క్రీడాకారులు ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం వేసవి శిక్షణ శిబిరాలు జిల్లా వ్యాప్తంగా నడుస్తున్నాయి. దాదాపు 20 క్రీడల్లో చిన్నారులు ఉత్సాహంగా శిక్షణ తీసుకుంటున్నారు. అయితే ఇందులో హాకీ లేకపోవడం గమనార్హం. హాకీ సీనియర్ క్రీడాకారులు పలుమార్లు స్థానిక ప్రజాప్రతినిధులను, జిల్లా కలెక్టర్లను కలిసినా ఫలితం శూన్యం. ఓ ప్రైవేటు స్కూల్ యాజమాన్యం తమ పిల్లలకు సొంతంగా హాకీ టర్ప్‌ను ఏర్పాటు చేసుకుంది. జిల్లా క్రీడాభివృద్ధి శాఖాధికారులు కనీసం ఆ దిశగా చర్యలు కూడా తీసుకోకపోవడం ఏంటని కొందరు క్రీడా సంఘ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన క్రీడా పాలసీ ఏమయ్యిందో ఎవరికీ తెలీయదు.
3 ఎకరాలు సరిపోతుంది
హాకీ మైదానం కావాలంటే కనీసం మూడు ఎకరాలుంటే సరిపోయేది. పాలకులు మాత్రం కనీస చొరవ చూపడంలేదు. ప్రస్తుతం నగరంలో క్రీడాకారులు బాక్స్ క్రికెట్ గ్రౌండ్‌లో గంటకు రూ.1000 చెల్లించి సాధన చేస్తున్నారు. దీంతోపాటు కొన్ని కళాశాలల్లో ఖాళీ స్థలాలను తీసుకుని వారే బాగుచేసుకుని సాధన చేస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం 50 నుంచి 75 మంది వరకు రాష్ట్ర, జాతీయ స్థాయి హాకీ క్రీడాకారులున్నారు. ప్రస్తుతం కొందరు జాతీయ సీనియర్ నేషనల్స్ ఆడుతున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియా స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. దీనిలో ఒక ఎంపీ, జిల్లా కలెక్టర్ కలిసి కొంచెం పనిచేస్తే హాకీ టర్ఫ్ వికెట్‌కు రూ.8 కోట్లు కేటాయిస్తుంది.
వేసవి శిక్షణలో కూడా లేని హాకీ
కనీస మైదానం లేక అవస్థలు
పట్టించుకోని నాయకులు, అధికారులు
ఇతర ప్రాంతాలకు తరలిపోతున్న క్రీడాకారులు

జాతీయ క్రీడకు గ్రహణం