
లారీ ఢీకొని బాలుడి మృతి
తాడికొండ: లారీ ఢీకొని 12 సంవత్సరాల బాబు మృతి చెందిన ఘటన తుళ్ళూరు మండలం రాయపూడి గ్రామ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం తుళ్లూరు గ్రామానికి చెందిన అంకం అభి (12) అనే యువకుడు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా రాయపూడి పెట్రోల్ బంక్ వద్ద వేగంగా వస్తున్న లారీని ఢీకొట్టి బాలుడిని ఈడ్చుకు వెళ్లడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మైనర్ బాలుడు ద్విచక్ర వాహనం నడుపుకొని వెళుతుండటంతో ఈ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు రోడ్డుపై బైటాయించి న్యాయం చేయాలంటూ నిరసనకు దిగారు. రాత్రి 10 గంటల వరకు కూడా నిరసన ముగించక పోవడంతో పోలీసులు సర్థి చెప్పేందుకు యత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తుళ్లూరు పోలీసులు తెలిపారు. లారీ డ్రైవర్ వాహనం వదిలి పరారీలో ఉండటంతో పోలీసులు గాలిస్తున్నారు. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు, రాజధానిలో కూలీ పనులు లేకపోవడంతో గేదెలు మేపుకొని జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి కుమారుడు, కుమార్తె కాగా కుమారుడి అకాల మరణంతో కన్నీరు మున్నీరుగా విలపించారు. జరిగిన ఘటనపై తల్లిదండ్రులతో పాటు స్థానికులు అందరూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేస్తుండటంతో ట్రాఫిక్ స్తంభించింది.