శోకసంద్రంలో స్టూవర్టుపురం | Road Accident at Guntur District | Sakshi
Sakshi News home page

శోకసంద్రంలో స్టూవర్టుపురం

May 24 2025 11:38 AM | Updated on May 24 2025 11:38 AM

Road Accident at Guntur District

 రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృత్యువాత 

లారీ కిందకు సగం దూసుకెళ్లిన కారు 

 సీట్లలో ఇరుక్కుపోయిన మృతదేహాలు  

అరగంటపాటు శ్రమించి వెలికితీత 

డ్రైవర్‌ అతివేగమే దుర్ఘటనకు కారణం  

 వైరల్‌ అవుతున్న సీసీ కెమెరా ఫుటేజ్‌ 

మృతుల్లో ముగ్గురిది ఒకే కుటుంబం 

కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న బాధిత కుటుంబాల సభ్యులు 

స్టూవర్టుపురంలో విషాదఛాయలు

బాపట్ల టౌన్‌/కొమరోలు: ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అమరావతి – అనంతపురం జాతీయ రహదారిపై కొమరోలు మండలంలోని తాటిచెర్లమోటు సమీపంలో హెచ్‌పీ పెట్రోలు బంకు వద్ద శుక్ర వారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. డ్రైవర్‌ కర్రెద్దుల దివాకర్‌ కారును అతివేగంగా నడపడంతో ఈ దుర్ఘటన జరిగింది. లారీని ఢీకొట్టిన తర్వాత కారు సగభాగం వరకు లారీ కిందకు దూసుకెళ్లింది. దీంతో కారు ముందు సీట్లలో కూర్చున్న డ్రైవర్‌ దివాకర్, పక్క సీటులో ఉన్న బొచ్చు సన్నీ మృతదేహాలు ఇరుక్కుపోయాయి. 

బయటకు తీసేందుకు జేసీబీ సహాయంతో అరగంటపాటు పోలీసులు శ్రమించాల్సి వచ్చింది.  కారు వేగంగా వచ్చి లారీని ఢీకొట్టడంతో ఒక్కసారిగా పెద్ద శబ్దం వినిపించినట్లు పెట్రోలు బంకులో ఉన్న వ్యక్తులు తెలిపారు. పెట్రోలు బంకులోని సీసీ కెమెరాలో ఈ ప్రమాదం రికార్డయింది. ఆ ఫుటేజీ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కారులో ప్రయాణిస్తున్న బాపట్ల జిల్లా స్టూవర్టుపురం గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు, నలుగురు పురుషులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. 

ఈ ప్రమాదంలో స్టువర్టుపురం గ్రామం, న్యూ గ్యాంగ్‌కు చెందిన గజ్జల నరసింహ (23), గజ్జల అంకాలు (45), పెద్ద గ్యాంగ్‌కు చెందిన గజ్జల జోసఫ్‌ అలియాస్‌ బబ్బులు (25), కర్రెద్దుల దివాకర్‌(24),లారో గ్యాంగ్‌కు చెందిన బొచ్చు సన్నీ (27), 1వ గ్యాంగ్‌కు చెందిన మొగిలి చిన్న భవాని (23) మృతి చెందారు.  భవాని కుమారుడు సిద్ధు, కుమార్తె సిరికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని 108 వాహనంలో గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. బాలుడు పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నంద్యాల తరలించారు. బాలిక ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.  

కుటుంబ కలహాలపై చర్చించేందుకు నంద్యాల జిల్లా డోన్‌లోని తమ బంధువుల ఇంటికి కారు ఆరుగురు వెళ్లారు. అక్కడ చర్చల అనంతరం మహానంది పుణ్యక్షేత్రాన్ని సందర్శించుకున్నారు. తిరిగి స్వగ్రామానికి వస్తుండగా ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 

ఎటు చూసినా విషాదమే
బాపట్ల టౌన్‌: వ్యక్తిగత పనులపై డోన్‌కు వెళ్లి తిరుగు ప్రయాణంలో ఉండగా ఆరుగురు తిరిగిరాని లోకాలకు వెళ్లిన ఘటనతో స్టూవర్టుపురం శోకసంద్రంలో మునిగిపోయింది. ఒకే గ్రామానికి చెందిన ఆరుగురు ఒకేసారి మృత్యువు ఒడిలోకి జారుకోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామంలో ఏ ఒక్కరిని పలకరించిన కన్నీరే సమాధానమైంది.   గురువారం మధ్యాహ్నం చీరాల మండలం, తోటవారిపాలెం గ్రామంలోని పోలేరమ్మ దేవాలయంలో గజ్జల నరసింహ కుమారుడికి అన్నప్రాసన కార్యక్రమం జరిగింది. బాపట్ల జిల్లా, బాపట్ల మండలం, çస్టూవర్టుపురం గ్రామానికి చెందిన ఆరుగురు వ్యక్తులు, ఇద్దరు చిన్నారులు కారులో వెళ్లారు. అనంతరం శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో వ్యక్తిగత పనులపై ఉమ్మడి కర్నూలు జిల్లా, ప్రస్తుత నంద్యాల జిల్లాలోని డోన్‌కు వెళ్లారు. కారులో తిరిగొస్తుండగా శుక్రవారం మధ్యాహ్నం ప్రకాశం జిల్లా, కొమరోలు మండలం, తాటిచెర్లమోటు గ్రామ సమీపంలోని అమరావతి–అనంతపురం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే  మృత్యువాత పడ్డారు. విషయం తెలిసిన మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. స్థానికులు సైతం విషాదంలో మునిగిపోయారు.

మృత్యువులోనూ వీడని స్నేహబంధం  
చిన్ననాటి నుంచి కలిసి తిరిగారు. ఎక్కడికైనా ఆ నలుగురు స్నేహితులు కలిసే వెళ్తారు. కుటుంబాలు వేరైనా ఓ తల్లి పిల్లల్లా కలిసిమెలసి తిరుగుతుంటారు. అలాంటి వీరి స్నేహాన్ని విధి వెక్కిరించింది. రోడ్డు ప్రమాదం రూపంలో వచ్చిన మృత్యువు వీరిని కబళించింది. ప్రాణ స్నేహితుల్ని విగతజీవులుగా మార్చింది. నాలుగు కుటుంబాలకు కడుపుకోత మిగిలి్చంది. వీరిలో గజ్జల నరసింహకు మాత్రమే వివాహమైంది. గజ్జల జోసఫ్‌ అలియాస్‌ బబ్బులు ఆటోడ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. దేవర దివాకర్, బొచ్చు సన్నీలకు వివాహం కాలేదు. వీరి కుటుంబాలకు వీరే మగదిక్కు. దీంతో వారి కుటుంబ సభ్యులను ఓదార్చడం ఎవరితరం కావడం లేదు.    

 కుటుంబంలో పెను విషాదం
గజ్జల అంకాలు, ఆమె కుమారుడు గజ్జల నరసింహ, కుమార్తె మొగిలి భవాని ఒకే సారి మృతి చెందడంలో కుటుంబ సభ్యులు విలపిస్తున్న తీరు చూపరులను సైతం కంటతడి పెట్టించింది. అంకాలు భర్త జనార్దన్‌ ఎనిమిదేళ్ల క్రితం మృతి చెందారు. వీరికి ముగ్గురు సంతానం. ప్రస్తుతం అంకాలు సహా వారి కుమారుడు నరసింహ, కుమార్తె భవానీ కూడా మృతి చెందారు. కుటుంబంలో కేవలం అంకాలు పెద్ద కుమారుడు వాసు మాత్రమే మిగిలారు. కుటుంబం మొత్తాన్ని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించిందంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement