
తాడేపల్లి: చంద్రబాబు నాయకత్వంలో మహానాడు పేరుతో దగానాడు జరగుతోందని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. కేవలం ఏపీ లోని ప్రజలకే కాదు.. జెండా మోసిన కార్యకర్తలకు కూడా దగానాడే అంటూ ఆయన వ్యాఖ్యానించారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 40 ఏళ్ల ఇండస్ట్రీ, 15 ఏళ్ల ఆవేశం స్టార్, రెడ్ బుక్ స్టార్.. అందరికీ బాస్ అని చెప్పుకునే మోదీ కూడా ఏపీకి చేసిన మేలు ఏమైనా ఉందా?’’ అంటూ పేర్ని నాని నిలదీశారు.
‘‘ఎమ్మెల్యేలు ఏ ముఖం పెట్టుకుని జనాల్లోకి వెళ్లాలా అని సిగ్గు పడుతున్నారు. కడపలో జరిగేది మహానాడా.. దగానాడా.. వాళ్ళే చెప్పాలి. ఎన్టీఆర్ ఉన్నప్పుడు టీడీపీ వేరు.. ఇప్పుడు టీడీపీ వేరని కార్యకర్తలు ఏడుస్తున్నారు. తండ్రీకొడుకులు ఇద్దరూ మూటలు కట్టుకుంటున్నారు. ఒక చిన్న మూట ఇంకొకరికి ఇస్తున్నారు. పోలీసు వేధింపులకు దేశంలోనే నిలువుటద్దంలా ఏపీ నిలుస్తుంది. కస్టోడియల్ టార్చర్‌కి ఏపీ పోలీస్ స్టేషన్‌లు వేదికలుగా మారిపోతున్నాయి’’ అంటూ పేర్ని నాని మండిపడ్డారు.
‘‘లిక్కర్ కేసులో బెయిలుపై బయట తిరుగుతున్న చంద్రబాబు.. ఇప్పుడు లేని లిక్కర్ కేసును సృష్టించారు. లిక్కర్ కేసులో మొదట విజయసాయిరెడ్డిని లైన్‌లోకి తెచ్చారు. ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్లటంతో కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని తెచ్చారు. ఆ తర్వాత జగన్ పేరు తెస్తారు. ఇసుమంత కూడా బిడియపడకుండా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. రోజుకో కథ వండి వారుస్తున్నారు. లక్షల కోట్ల పేజీల మెమరీ డిలీట్ చేశారని ఎల్లో మీడియా రాయిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ అయినందున జగన్‌ని కూడా అరెస్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. పీఎస్ఆర్ ఆంజనేయులుపై కక్షసాధిస్తున్నారు. జైలులో కూడా ఆయన నిత్య పూజలు చేసుకునే వ్యక్తి అని జైలు అధికారులే చెప్పుకుంటున్నారు. అరెస్ట్ అప్పుడే అన్నీ వెతికారు కదా.. మళ్ళీ ఇప్పుడు సోదాలు ఎందుకు?’’ అంటూ పేర్ని నాని ప్రశ్నించారు.

..రాజ్యమే ప్రజలను హింసిస్తే ఆ ప్రజల ఆగ్రహంలో పాలకులు కొట్టుకుపోతారు. చంద్రబాబు ఇంటికి కాయగూరలు కావాలంటే విమానంలో వెళ్లి తెచ్చుకుంటున్నారు. జగన్ లాగా నేను అప్పులు చేసి పథకాలు ఇవ్వను.. నేను సంపద సృష్టించి ఇస్తానని చెప్పారు. సంవత్సరం తిరిగే లోపు లక్షన్నర కోట్ల అప్పులు చేసి ఆ సొమ్మంతా ఏం చేశారు?. కరెంట్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి ఇంట్ కరెంట్ కోసం యూనిట్ 9 రూపాయలు వసూలు చేస్తున్నారు. జగన్ తన ప్రభుత్వంలో తక్కువ రేటుకే ప్రజలు సినిమాలు చూడాలి అని ఆకాంక్షించారు. కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ సినిమా ఫీల్డ్‌ను ఉద్ధరిస్తారనుకుంటే థియేటర్ యాజమాన్యాలపై విచారణకు ఆదేశించారు.

..అప్పుడు ఏం మాట్లాడారు..? ఇప్పుడు ఏం చేస్తున్నారు..?. సినిమా వాళ్లను జైల్లో వేస్తామని బెదిరిస్తున్నారు. ఇవి దివాలకోరు రాజకీయాలు కావా..?. నీ చెప్పు చేతల్లో ఉన్న మంత్రితో బెదిరిస్తారా?. రాబోయే ఫ్లాప్ సినిమా కోసం ఇంతలా చేయాలా..?. గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు అందరికీ గుర్తున్నాయి.. సినిమా వాళ్ళను బెదిరించటానికి మీరు ఎవరు..?. అసలు వాళ్ల సమస్య ఏంటో తెలుసా మీకు’’ అంటూ పేర్ని నాని ప్రశ్నించారు.