
సరస్వతీ నిలయం.. శిథిలం
అధ్వానస్థితిలో గుంటూరు ప్రాంతీయ గ్రంథాలయం
గుంటూరు ఎడ్యుకేషన్: నగరం నడిబొడ్డునున్న ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయం శిథిలావస్థకు చేరింది. ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితుల్లో ఉంది. శ్లాబ్ బీటలు వారి, పెచ్చులు ఊడి కింద పడుతున్నాయి.1958లో స్థాపించిన గ్రంథాలయం దశాబ్దాల తరబడి పాఠకులకు విజ్ఞానాన్ని అందిస్తోంది. దశాబ్దాల కిందటి వార్తా పత్రికలను ఇక్కడ భద్రపరుస్తున్నారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగులు ప్రతి రోజూ పెద్ద సంఖ్యలో ఇక్కడి కాంపిటీటివ్ విభాగంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు సమయాన్ని గడుపుతున్నారు.
కొత్త పుస్తకాల జాడే లేదు
పోటీ పరీక్షల విభాగంలో గత పదేళ్లుగా పుస్తకాల కొనుగోలు జాడ లేకుండా పోయింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పాలనలో పోటీ పరీక్షల శిక్షణార్థులకు అవసరమైన మేరకు పుస్తకాలు పంపిణీ చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పుస్తకాలను పంపిణీ చేసిన దాఖలాలు లేవు. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడంతో ప్రతి రోజూ 100 మందికి పైగా అభ్యర్థులు గ్రంథాలయంలోని పుస్తకాల పైనే ఆధారపడుతున్నారు. అవసరమైన సంఖ్యలో పుస్తకాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.
నూతన భవన నిర్మాణానికి ప్రతిపాదనలు
రూ. 8 కోట్లతో నాలుగు అంతస్తుల నూతన గ్రంథాలయాన్ని నిర్మించేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఆర్నెళ్ల కిందట ప్రభుత్వానికి పంపారు. ఇంత వరకు స్పందించక పోవడంతో పాఠకులు శిథిల భవనంలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
మౌలిక వసతులు కరువు
మూలన పడిన ఇంటర్నెట్ విభాగం
పాఠకులకు అవస్థలు
ప్రతిపాదనలు పంపాం
కొత్త భవనానికి ప్రతిపాదనలు పంపాం. దాతల సహకారంతో పుస్తకాల కొరత లేకుండా చూస్తున్నాం. నగరపాలకసంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంప్యూటర్లు పని చేయడం లేదు.
–ఎన్. వెంకటేశ్వరరావు, గ్రంథాలయాధికారి
ఇంటర్నెట్ లేకపోవడంతో ఇబ్బంది
గ్రూప్స్‌తో పాటు వివిధ ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిర్వహించే పరీక్షలకు సన్నద్ధమవుతున్నా. అయితే, ఇంటర్నెట్ విభాగం పనిచేయకపోవడంతో ఆన్‌లైన్‌లో సమాచారం పొందడం ఇబ్బందిగా ఉంది. – జి. లక్ష్మణరావు
టాయిలెట్లు లేక అవస్థలు
స్కూల్ అసిస్టెంట్ విభాగంలో బయాలజీకి ప్రిపేరవుతున్నా. టాయిలెట్ల సదుపాయం లేకపోవడంతో చాలా ఇబ్బందిగా ఉంది. రిఫరెన్స్ విభాగంలో శ్లాబు కింద పడుతుందేమోనని భయంగా ఉంది.
– బి. అశోక్
మౌలిక వసతులు కరువు
మహిళలకు మినహా, పురుషులకు టాయిలెట్ల సదుపాయం లేకపోవడంతో అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాతలు ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ మిషన్ అలంకారంగా మారింది. రన్నింగ్ వాటర్ సదుపాయం లేకపోవడంతో మున్సిపల్ వాటర్‌ను డ్రమ్ములో నిల్వచేసి, వాటర్ మిషన్‌లో పోస్తున్నారు. కాంపిటీటివ్ విభాగంలో ఏర్పాటు చేసిన ఇంటర్నెట్ విభాగం మూతపడింది. ఇంటర్నెట్ బిల్లులు చెల్లించకపోవడంతో మూసేశారు. ఫలితంగా ఇంటర్నెట్ విభాగంలోని 10 కంప్యూటర్లు మూలనపడ్డాయి.

సరస్వతీ నిలయం.. శిథిలం

సరస్వతీ నిలయం.. శిథిలం