
రేషన్ బియ్యం పట్టివేత
చేబ్రోలు: మండల పరిధిలో పేదల బియ్యం పక్కదారి పడుతోంది. గత కొంతకాలంగా రేషన్ అక్రమ దందా కొనసాగుతున్నప్పటికీ అడ్డుకట్ట వేయటంలో అధికారులు విఫలమయ్యారు. ఆదివారం తెల్లవారుజామున చేబ్రోలు మండలం మంచాల గ్రామ శివారులోని బ్రాహ్మణ కోడూరు అడ్డరోడ్డు ప్రాంతంలో లారీలో రేషన్ బియ్యంను అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పొన్నూరు రూరల్ సీఐ వై.కోటేశ్వరరావు, చేబ్రోలు ఎస్‌ఐ డి.వెంకటకృష్ణ ఆధ్వర్యంలో సిబ్బంది నిఘా వేసి రేషన్ బియ్యం తరలిస్తున్న వాహనాన్ని తనిఖీ చేశారు. ఏపీ 39 వీఈ 0256 నెంబరు గల మినీ లారీలో సుమారు వంద బస్తాల రేషన్ బియ్యంను తరలిస్తున్నట్లు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకొని చేబ్రోలు పోలీసు స్టేషన్‌కు తరలించారు. బాపట్లకు అక్రమ రవాణా చేస్తున్నట్లు మాత్రమే ప్రకటించారు. రేషన్ బియ్యం ఎక్కడ నుంచి ఎక్కడకు వెళ్తుంది.. దీనికి సూత్రధారి వివరాలను మాత్రం అధికారులు వెల్లడించలేదు.