
సందేశాత్మకం.. ఉత్సాహభరితం
తెనాలి: రూరల్ మండల గ్రామం కొలకలూరులో కొలంకపురి నాటక కళాపరిషత్, శ్రీసాయి ఆర్ట్స్, కొలకలూరు సంయుక్త నిర్వహణలో జరుగుతున్న ఉభయ రాష్ట్రస్థాయి 11వ ఆహ్వాన నాటికల పోటీలు శనివారం కొనసాగాయి. తాళ్లూరు శ్రీనివాసరావు కళాప్రాంగణంలో తొలుత తాళ్లూరు సురేష్ జ్యోతి ప్రజ్వలనతో రెండోరోజు ప్రదర్శలనలను ప్రారంభించారు. తొలుత విశ్వశాంతి కల్చరల్ అసోసియేషన్, హైదరాబాద్ వారి ‘స్వేచ్ఛ’ నాటికను ప్రదర్శించారు. స్వేచ్ఛ అనేది విశృంఖలానికి దారితీయకూడదు. స్వేచ్ఛ హద్దు ఉంటేనే ముద్దుగా వుంటుంది... లేకుంటే పర్యవసానాలు దారుణంగా ఉంటాయని హెచ్చరించిందీ నాటిక. పీఎస్ నారాయణ మూలకథకు పరమాత్ముని శివరాం నాటకీకరణ చేయగా, బీఎం రెడ్డి దర్శకత్వం వహించారు. ప్రధాన పాత్రల్లో సురభి లలిత, సింధు, ఏపూరి శ్రీనివాస్, వెంకట్ గోవాడ నటించారు.
ధైర్యం చెప్పే ‘బ్రహ్మ స్వరూపం’
రెండో ప్రదర్శనగా మైత్రీ కళానిలయం, విజయవాడ వారి ‘బ్రహ్మస్వరూపం’ నాటికను ఆడారు. కఠినమైన సందర్భాల్లో విధి విరోధిగా మారినపుడు మనం నిస్సహాయులుగా మిగిలిపోతున్నపుడు సాక్షాత్తూ ఆ బ్రహ్మస్వరూపం ఆవహించి ధర్మాన్ని చెబుతుందని ధైర్యం చెప్పిందీ నాటిక. స్నిగ్ధ రచించిన నాటికకు టీవీ పురుషోత్తం దర్శకత్వం వహించారు. ప్రధాన పాత్రల్లో టీవీ పురుషోత్తం, శ్యామ్, వీసీహెచ్‌కే ప్రసాద్, ఎం.రత్నకుమారి, ఆర్.రాజేశ్వరి నటించారు. చివరగా యంగ్ థియేటర్ ఆర్గనైజేషన్, విజయవాడ వారి ‘27వ మైలురాయి’ నాటికను ప్రదర్శించారు. పీటీ మాధవ్ రచించిన నాటికకు ఆర్.వాసు దర్శకత్వం వహించారు.
రత్నకుమారికి జీవిత సాఫల్య పురస్కారం
రచయిత పిన్నమనేని మృత్యుంజయరావు అధ్యక్షతన జరిగిన సభలో ఒంగోలుకు చెందిన ప్రముఖ రంగస్థల నటీమణి ఎం.రత్నకుమారికి గోపరాజు హేమలత జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. గోపరాజు శివరామకృష్ణ, హనుమత్ శేఖర్, కుటుంబసభ్యుల చేతులమీదుగా ఈ గౌరవాన్ని అందజేశారు. విశాఖపట్నంకు చెందిన నటుడు, దర్శకుడు చలపాని శివప్రసాద్, కొల్లిపరలోని శ్రీకళానిలయం వ్యవస్థాపకుడు బొమ్మారెడ్డి ప్రభాకరరెడ్డి ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఇదే వేదికపై రాష్ట్రస్థాయి రచనల పోటీల విజేతలకు నగదు బహుమతులను అందజేశారు. రంగస్థల ప్రముఖులు దేవిరెడ్డి రామకోటేశ్వరరావు, డీవీ చంద్రశేఖర్ (న్యూఢిల్లీ), పీవీత్యనారాయణ (గుడివాడ), గంటా ముత్యాలనాయుడు (కొంతేరు), పి.శివప్రసాద్ (గుంటూరు), వల్లూరు వరప్రసాద్, నల్లిబోయిన నాగేశ్వరరావు మాట్లాడారు. గోపరాజు రమణ, గోపరాజు విజయ్, సుద్దపల్లి మురళీధర్ పర్యవేక్షించారు.
కొనసాగుతున్న ఆహ్వాన నాటిక పోటీలు

సందేశాత్మకం.. ఉత్సాహభరితం