కిల్కారీతో గర్భిణులు, బాలింతలకు బహుళ ప్రయోజనాలు
గుంటూరు మెడికల్ : కేంద్ర ప్రభుత్వం కిల్కారి కార్యక్రమాన్ని గర్భిణులు, బాలింతల కోసం ప్రవేశపెట్టిందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కొర్రా విజయలక్ష్మి అన్నారు. మంగళవారం గుంటూరు డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో ఆశా నోడల్ ఆఫీసర్స్ సమావేశం జరిగింది. సమావేశంలో కిల్కారి ప్రొగ్రామ్ గురించి వైద్య సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ గర్భిణికి నాలుగో నెల మొదలుకొని బిడ్డకు ఒక ఏడాది వచ్చే వరుకు కిల్కారి ఫోన్ కాల్స్ వస్తాయని చెప్పారు. వాయిస్ కాల్స్ ద్వారా తల్లీ, బిడ్డల ఆరోగ్య క్షేమ సమాచారాన్ని అందజేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం కిల్కారి కాల్ నంబర్ 01244451660ను ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు. ఈ నంబరును గర్భిణి తన మొబైల్‌లో సేవ్ చేసుకుంటే వారికి కాల్ వచ్చినపుడు పూర్తిగా సమాచారాన్ని వినవచ్చు అన్నారు. తొలిసారి విన్న సమాచారంలో ఏమైనా సందేహాలు ఉంటే తిరిగి ఆ సమాచారాన్ని వినేందుకు 14423 అనే టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి వినవచ్చు అన్నారు. కిల్కారి సేవలను గర్భిణి, బాలింతలు ఉపయోగించుకోవాలని డాక్టర్ విజయలక్ష్మీ కోరారు. జిల్లాలో కిల్కారి లో బాగా పనిచేసిన ఆశలకు డాక్టర్ విజయలక్ష్మీ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ అమర్తలూరి శ్రావణబాబు, ఎన్‌సీడీ జిల్లా ప్రొగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రోహిణి రత్నశ్రీ, డీపీఎంహెచ్‌ఎన్‌ఓ ప్రియాంక, హెచ్‌ఈఈఓ చంద్రశేఖర్, కిల్కారి రాష్ట్ర ప్రోగ్రాం మేనేజర్ ఎల్.రాజు, సురేష్ , తదితరులు పాల్గొన్నారు.


