
సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలన
పొన్నెకల్లు (తాడికొండ): తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకలకు సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొననున్న నేపథ్యంలో ఏర్పాట్లను సోమవారం జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ భార్గవ్ తేజ, ఆర్డీవో శ్రీనివాసరావు ఇతర అధికారులు పరిశీలించారు. పొన్నెకల్లు ఎస్సీ కాలనీ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం బైపాస్ రోడ్డులో బహిరంగ సభ ఏర్పాటు చేసేలా ఏర్పాట్లను పరిశీలించారు. తాడికొండలో అంబేద్కర్ కాంస్య విగ్రహం ఉన్న నేపథ్యంలో తాడికొండలో లేదా పొన్నెకల్లులో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే దిశగా అధికారులు సమాలోచనలు చేస్తున్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ మెహర్‌బాబు, సీఐ కె వాసు పలువురు మండల స్థాయి అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
రేపటి నుంచి ఐసెట్‌కు ఉచిత శిక్షణ
గుంటూరు ఎడ్యుకేషన్ :పట్టాభిపురంలోని టీజేపీఎస్ పీజీ కళాశాలలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించనున్న ఐ–సెట్‌కు ఈనెల 9వ తేదీ నుంచి ఉచిత శిక్షణ కల్పిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.అనితాదేవి సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు అనుభవజ్ఞులైన అధ్యాపకులచే ప్రతి రోజు ప్రాక్టీస్ టెస్టు, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, రీజనింగ్, ఎనలెటికల్, మాఽథమాటికల్, కమ్యూనికేషన్ ఎబిలిటీ, జనరల్ ఇంగ్లీష్ వంటి విషయాల్లో శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. ఇతర వివరాలకు ఎంబీఏ విభాగాధిపతి డాక్టర్ యు. (97011 72533), కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి ఎం.శివకొండయ్య (96766 74858)ను సంప్రదించాలని సూచించారు.
కాలువలోకి దూసుకెళ్లిన కారు
– ప్రాణాలతో బయటపడిన డ్రైవర్
మంగళగిరి: నగర పరిధిలోని యర్రబాలెం చెరువులోకి కారు దూసుకెళ్లిన ఘటన సోమవారం జరిగింది. మంగళగిరి నుంచి కృష్ణాయపాలెం వైపు వెళ్తున్న కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లింది. కారులో డ్రైవర్ ఒక్కరు మాత్రమే వుండగా వెంటనే కారు డోర్ తీసుకుని కారుపైకి ఎక్కి కాపాడాలని అరవడంతో అటుగా వెళ్తున్న స్థానికులు అతడిని రక్షించారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలన