
300 మంది దివ్యాంగులకు కృత్రిమ చేతుల పంపిణీ
మంగళగిరి: దేశంలోనే తొలిసారిగా 300 మంది దివ్యాంగులకు కృత్రిమ చేతులు పంపిణీ చేయడం అభినందనీయమని పలువురు కొనియాడారు. పట్టణంలోని వీజేటీఎం ఐవీటీఆర్ డిగ్రీ కళాశాలలో సోమవారం రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యంలో రూ.1.35 కోట్లతో జర్మనీకి చెందిన ద హ్యాండ్స్ ప్రాజక్టు సహకారంతో కృత్రిమ చేతులను (జెమ్ ఎంకే 1 హ్యాండ్స్) పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ పీడీజీ డాక్టర్ రవి వడ్లమాని, డిస్ట్రిక్ట్ గవర్నర్ కె.శరత్ చౌదరి, డాక్టర్ ఎస్‌వీ రామ్‌ప్రసాద్, పీడీజీ అన్నే రత్న ప్రభాకర్, ఐపీడీజీ తాళ్ళ రాజశేఖర్‌రెడ్డి, పీడీ ఆర్.ఆర్. వేణుగోపాల్ యలమంచిలి, విజేటీఎం ఐవీటీఆర్ డిగ్రీ కళాశాల గౌరవ అధ్యక్షుడు డాక్టర్ గోలి రామ్మోహన్‌రావు, ప్రాజెక్ట్ చైర్మన్ ఇసునూరి అనిల్ చక్రవర్తి కృత్రిమ చేతులు పంపిణీ చేసి ప్రసంగించారు. వారంపాటు కృత్రిమ చేతులు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. జర్మనీ, న్యూజిల్యాండ్, ఆఫ్రికా దేశాల నుంచి టెక్నీషియన్లు వచ్చి బాధితులకు కృత్రిమ చేతుల వాడకంపై అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి గాజుల శ్రీనివాసరావు, పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.