గీతాంజలి కేసు దర్యాప్తు వేగవంతం | Sakshi
Sakshi News home page

గీతాంజలి కేసు దర్యాప్తు వేగవంతం

Published Sat, Mar 16 2024 2:05 AM

- - Sakshi

 ప్రతి హ్యాండిల్‌ క్షుణ్ణంగా పరిశీలన

మరోవైపు ప్రత్యేక బృందాల గాలింపు

 నిష్పక్షపాతంగా సాగుతున్న దర్యాప్తు 

తెనాలి: గీతాంజలి ఆత్మహత్య కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరిని మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరిచిన విషయం తెలిసిందే. నిందితుల గుర్తింపునకు, అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయి. ఒక పక్క సోషల్‌ మీడియా అకౌంట్లను జల్లెడ పడుతున్నారు. మరోవైపు నిందితుల కోసం గాలిస్తున్నారు. నిష్పక్షపాతంగా, ఎలాంటి రాజకీయ విమర్శలకు తావు లేకండా అన్ని ఆధారాలతో సహా నిందితులను చట్టం ముందు నిలబెట్టాలనే భావనతో జిల్లా ఎస్పీ తుషార్‌ డూడీ ఆదేశాల ప్రకారం పోలీసు అధికారులు వ్యవహరిస్తున్నారు.

తెనాలికి చెందిన గొల్తి గీతాంజలి స్థానిక ఎమ్మెల్యే చేతులమీదుగా ఇంటి స్థలం రిజిస్ట్రేషన్‌ పత్రాలను అందుకుని పట్టరాని సంతోషాన్ని యూట్యూబ్‌ ఛానల్‌తో పంచుకోవటమే ఆమెకు శాపమైంది. ఐటీడీపీ, జనసేన సోషల్‌ మీడియా ట్రోలింగ్‌తో చెలరేగిపోయింది. అసభ్యకరమైన పదజాలాన్ని వాడారు. సభ్యసమాజంలో ఏ ఒక్కరూ అటువంటి ట్రోలింగ్‌ను విన్నా కూడా తట్టుకోలేనంత జుగుప్సాకరంగా ఉన్నాయా పోస్టింగ్‌లు. సాధారణ గృహిణి, ఏ అండా లేని బీసీ మహిళ, ఇద్దరు ఆడపిల్లల తల్లి గీతాంజలిని ఆ ట్రోలింగ్‌ ఎంతగా మానసిక వ్యధకు గురిచేశాయో? రేపో మాపో ప్రైవేటు స్కూల్లో చేరాల్చిన టీచర్‌ పోస్టును, ఇద్దరు ఆడపిల్లల భవిష్యత్‌ను కూడా మర్చిపోయేంత విరక్తిని కల్పించాయి. రైలుపట్టాలపై వస్తున్న రైలుకు ఎదురుగా నడుచుకుంటూ వెళ్లి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. దీన్ని కూడా సోషల్‌ మీడియా మూకల ట్రోలింగ్‌ను సమాజంలో ప్రతిఒక్కరూ అసహ్యించుకుంటున్నా, బాధ్యులైనవారు వక్రీకరించటానికి చేయని కుటిలత్వం అంటూ లేదు.

గీతాంజలికి జరిగిన దారుణంపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియో అందించింది. మరణానికి కారకులైన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. రైల్వే పోలీసుల పరిధిలోని కేసును స్థానిక వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. సోషల్‌మీడియా ట్రోలింగ్‌ వలనే గీతాంజలి ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులో సెక్షన్లు మార్చి, ఐటీ సెక్షనూ చేర్చారు. గుంటూరు జిల్లా ఎస్పీ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. అంతే దూకుడుగా విజయవాడ, ఉండికి చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకుని మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరిచారు.

వెయ్యికి పైగా కామెంట్లు
అసభ్యకర పదజాలాన్ని వాడుతూ ట్రోలింగ్‌ చేసిన సోషల్‌ మీడియా హ్యాండిల్స్‌ను క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నారు. ఈ కేసులో వెయ్యికి పైగా కామెంట్లు ఉన్నాయని అధికారులు ఇప్పటికే వెల్లడించారు. వాటన్నిటినీ నిశితంగా పరిశీలిస్తున్నారు. వీరిలో చాలామంది సొంత పేర్లతో కాకుండా ఫేక్‌ అకౌంట్లతో పోస్టులు పెడుతున్నారు. అలాంటి ఫేక్‌ అకౌంట్ల వెనుకున్న అసలు కూపీదారులను బయటకు లాగే పనిలో అధికారులు తలమునకలై ఉన్నారు. మరోవైపు ఇప్పటికే గుర్తించిన నిందితుల కోసం ఏర్పాటైన ప్రత్యేక బృందం నేతృత్వంలో ఐదు పోలీసు బృందాలు నిందితుల కోసం అన్వేషణ సాగిస్తున్నాయి. వివిధ ప్రాంతాల్లో వీరు డేగ కళ్లతో గాలిస్తున్నారు. విషయం తెలిసి ఇప్పటికే కొందరు సోషల్‌ మీడియా కార్యకర్తలు పరారీలో ఉన్నట్లు సమాచారం.

Advertisement
Advertisement