గా వయ్యి యాడ దొరుక్తది జెర జెప్పుండ్రి

Telidevara Bhanumurthy Write on Rahul Gandhi Marriage, BRS Khammam Meeting - Sakshi

అట్లుంటది

పొద్దుగాల ఛాయ్‌ దాక్కుంట గూసున్న. యాద్గిరి మామొచ్చిండు. 
‘‘ఊల్లె అందరు బాగుండ్రానె.’’

‘‘అందరెట్ల బాగుంటరురా? కొంత మందే బాగున్నరు. (మామ రాజకీయాలు మాట్లాడుడు షురువు జేసిండని మనసుల అనుకున్న.) మన ఊల్లె ఏంది. దేసంలనే పది మంది కోట్లు కమాయించి మజా జేస్తుంటె కడ్మ జెనం ఆకలితోని సస్తున్నరు’’ అని అన్నడు.

‘‘సంటర్‌ సర్కార్‌ బీదోల్లకు ఐదు కిలల వొంతున బియ్యం ఫిరీగ ఇస్తున్నది. ఇంకేం జెయ్యాలెనే?’’
‘‘బియ్యం ఫిరీగ ఇయ్యంగనే అయిపాయెనా? గ్యాసు బండ దర మూడింతలు బెర్గె. సంక్రాంతి పండ్గ దినాన వందే బారత్‌ రేల్‌ గాడిని షురువు జేసిండ్రు. లష్కర్‌ కెల్లి ఎన్మిదిన్నర గంటలల్ల విశాకపట్నం బోతది. గని గాడి ఛార్జిలే మొగులు మీదున్నయి. ఎగ్జిక్యూటివ్‌ కిలాస్‌ టికిట్‌ దర 3,170 రూపా యలు. గని గాలి మోటర్‌ టికిట్‌ దర 3,900. గాల్లు, గీల్లతో పండ్గ నాడు సీట్లు నిండినయి. ఆవలి దినం కెల్లి సగం కన్న ఎక్వ సీట్లు కాలిగున్నయి. ఒక్క దినం యేసానికి మూతి మీసం గొరిగిచ్చుకున్న తీర్గున్నది గీ రేల్‌ గాడి సంగతి.’’

‘‘మామా రాహుల్‌ గాంది పెండ్లెందుకు జేస్కోలేదే?’’
‘‘నెహ్రూ ప్రతాని అయినప్పుడు గాయిన పెండ్లాం లేదు. ఇందిరా గాంది ప్రతాని కుర్సి మీద గూసున్నప్పుడు గామె మొగడు లేడు. మొరార్జి దేశాయ్‌ ప్రతాని అయినప్పుడు గాయిన పెండ్లాం లేదు. గదే తీర్గ పీవీ నరసింహారావు ప్రతాని కుర్సి మీద గూసున్నప్పుడు గాయిన పెండ్లాం లేదు. వాజపేయి అయితే పెండ్లే జేస్కోలేదు. మోదీకి పెండ్లాం ఉన్నా లేనట్టే లెక్క. పెండ్లాం లేకుంటనే ప్రతాని అయ్యేటి మోక దొర్కుతదని రాహుల్‌ గాంది పెండ్లి జేస్కోలేదు. పెండ్లాం లేకుంటె ఎంత లాబమో ఒకపారి వాజపేయి జెప్పిండు.

రొండు దినాలల్ల పోక్రాన్‌ అను పరీచ్చ జేస్తరనంగ అబ్దుల్‌ కలాం అప్పటి ప్రతాని వాజపేయి దగ్గరకు బోయిండు. అనుపరీచ్చ జేస్తమన్న సంగతిని మనద్దరికి తప్పిడ్సి ఎవ్వల్కి ఎర్క గాకుంట సూడుండ్రి అన్నడు. మీకు పెండ్లాం లేదు, నాకు పెండ్లాం లేదు. గసు వంటప్పుడు గీ సంగతి మనిద్దరికి దప్పిడ్సి కడ్మోల్లకు ఎట్ల ఎర్కైతది వయా అని వాజపేయి అన్నడు.’’

‘‘కేసీఆర్‌ సంగతేంది మామా?’’
‘‘కమ్మంల కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ పుట్టుక సబ బెట్టిండు. నగరమంత గులాబి జెండలు ఎగిరేసిండ్రు. సబకొచ్చిన లీడర్ల కోసం అర్వై మూడు తీర్ల తెలంగాన వొంటకాలను జేపిచ్చిండ్రు. నాటుకోడి కూర, బొమ్మి డాయిల పుల్సు, కొర్రమీను కూర, రొయ్యల ఫ్రై, బిర్యాని అసుంటియి గూడ ఉన్నాయి. ఏడు తీర్ల స్వీట్లను గుడ్క జేపిచ్చిండ్రు. సబకు వొచ్చినోల్ల గురించి ఎన్మిది లచ్చల మంచినీల్ల సీసలు బెట్టిండ్రు. నూట నల్వయి ఫీట్ల పొడ్గు, అర్వై ఫీట్ల ఎడల్పుతోని పెద్ద స్టేజి గట్టిండ్రు. కేరల ముక్యమంత్రి విజయన్, డిల్లీ ముక్యమంత్రి కేజ్రీవాల్, పంజాబ్‌ ముక్యమంత్రి బగవంత్‌ మాన్, యుపి మాజీ సీఎం అకిలేశ్‌ యాదవ్, సీపీఐ జాతీయ ప్రతాన కార్యదర్శి డి. రాజా గీ సబకొచ్చిండ్రు. విజయన్, డి.రాజా అంగ్రేజీల స్పీచ్‌ గొడ్తె కడ్మోల్లు హిందిల మాట్లాడిండ్రు. గాల్ల మాటలు అర్తం గాక జెనం లొల్లి బెట్టిండ్రు. గిప్పుడు మనది జాతీయ పార్టీ, ఏ బాస ఎవ్వలు మాట్లాడినా లొల్లి బెట్టకుంట ఇనాలె అని కేసీఆర్‌ అన్నడు.’’

‘‘కేసీఆర్‌ ఏమని స్పీచ్‌ గొట్టిండే?’’
‘‘వొచ్చేటి లోక్‌సబ ఎలచ్చన్ల మోదీ ఇంటికి బోతడు. మనం డిల్లికి బోతం. దేసమంత రైతు బందు, దలిత బందు పద్కాలు బెడ్తం. 70 వేల టీఎంసీల నీల్లు దొర్కుతున్నా 20 వేల టీఎంసీల నీల్లు వాడుతున్నం. కాలేశ్వరం అసువంటి ప్రాజెక్టులు లేకపోయె బట్కె దేసంల 50 వేల టీఎంసీల నీల్లు ఫుజూల్గ బోతున్నది. బీఆర్‌ఎస్‌ సర్కారొస్తె దేసమంతట కాలేశ్వరం అసువంటి ప్రాజెక్టులు గట్టిపిస్తది అన్కుంట కేసీఆర్‌ స్పీచ్‌గొట్టిండు. చింతకాని మండలంల వందనం అనేటి ఊరున్నది. గా ఊరుకు బోరుతోని నీల్లు ఇస్తున్నరు. బోరు నడ్సెతందుకు వాడేటి కరెంటును బీఆర్‌ఎస్‌ పుట్టుక సబకు మల్పిండ్రు. దాంతోని తాగెతందుకు నీల్లు లేక వందనం ఊరోల్లు తిప్పలబడ్డరు. యాడాదిల ప్రతాని అవుడెట్ల అనేటి వయ్యి గురించి కేసీఆర్‌ ఒక్క తీర్గ లెంకుతున్నడు. వొస్తరా’’ అన్కుంట మా యాద్గిరి మామ బోయిండు. (క్లిక్ చేయండి: రాజకీయ సంక్రాంతి.. యథా లీడర్‌ తథా క్యాడర్‌)

- తెలిదేవర భానుమూర్తి 
సీనియర్‌ జర్నలిస్ట్‌

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top