మద్యపాన నియంత్రణకే కఠిన చర్యలు

Strict Measures For Alcohol Control In Andhra Pradesh - Sakshi

నేడు మద్యపానం ఒక సామాజిక దురలవాటుగా మారింది. దీనివలన వ్యక్తిగత, కుటుంబ పతనం జరిగి తదుపరి సమాజ పతనం కూడా జరుగుతున్నది. యువకులు, విద్యార్థులు కూడా ఈ మహమ్మారికి బానిసై తమ బంగారు భవిష్యత్తును మొగ్గలోనే తుంచి వేసుకుంటున్నారు. పైగా మద్యం వలన స్త్రీల మీద గృహహింస పెరిగిపోతున్నది. అఘాయిత్యాలు  జరుగుతున్నవి. మగాడు మద్యం సేవించిన తర్వాత మానసిక క్రూరత్వ పొరలు కమ్మి నేరం చేయుటకు ఇది ఒక ఉత్ప్రేరక శక్తిగా అవుతున్నది. దురదృష్టవశాత్తు గత ప్రభుత్వాలు మద్యపానాన్ని ప్రోత్సహించి, బంగారు గుడ్లు పెట్టే బాతుగా తయారు చేసుకున్నాయి.

కానీ మద్యాన్ని ఒక ఆదాయ వనరుగా చూడకుండా దశలవారీ మద్య నియంత్రణ వైపు అడుగులు వేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిస్సంశయంగా అభినందనీయులు. చంద్రబాబునాయుడు ప్రభుత్వం ప్రతి మద్యంషాపునకు అనుబంధంగా ఒక పర్మిట్‌ రూముకి లైసెన్స్‌ ఇచ్చింది. వాటిని దాటి వెళ్లడానికి మహిళలు ఇబ్బందిపడేవారు. కానీ జగన్‌మోహన్‌రెడ్డి వీటిని సంపూర్ణంగా తొలగించారు. ఈ నిర్ణయం వలన రాష్ట్రప్రభుత్వం సుమారుగా ఏటా 40 కోట్ల ఆదాయం కోల్పోయింది. 

అలాగే పాదయాత్ర సమయంలో మహిళలకు ఇచ్చిన మాట మేరకు ప్రమాణ స్వీకారం చేసిన రోజే రాష్ట్రంలోని బెల్టుషాపులన్నీ తొలగిస్తున్నట్టు ఆదేశిం చారు. ఒకే ఒక్క రోజులో టీడీపీ ప్రభుత్వంలో వెలసిన 43 వేల బెల్టుషాపులను తొలగించారు. అలాగే ప్రైవేట్‌ లిక్కర్‌ మాఫియా చేతిలో ఉన్న మద్యం షాపులను పూర్తిగా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. రాష్ట్రంలో 4,380 మద్యం షాపులు, పక్కనే 4,380 పర్మిట్‌ రూములు ఉండేవి. ప్రభుత్వం తీసుకున్నాక తొలుత 20 శాతం షాపులను తగ్గించారు. తాజాగా మరో 13 శాతం తగ్గించారు. అంటే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉన్న 12 వేలకు పైగా గ్రామాలకు కేవలం 2,934 మద్యం షాపులు మాత్రమే ఉన్నాయి.

మద్యం అమ్మకాల సమయం గతంలో ఉదయం 10 నుంచి, రాత్రి 10 వరకు ఉంటే ఇప్పుడు ఉదయం 11 నుంచి రాత్రి 8 వరకు కుదించారు. దీనివలన డ్రంక్‌ అండ్‌ డ్రైవింగ్‌ కేసులు గత సంవత్సరంతో పోలిస్తే 40 శాతం తగ్గాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే మద్యం వినియోగాన్ని భారీగా తగ్గించేందుకు ధరలను పెంచారు. చంద్రబాబు పాలనలో 2018 అక్టోబర్‌ నుంచి 2019 మార్చి వరకు 191.79 లక్షల కేసుల ఇండియన్‌ మేడ్‌ లిక్కర్‌ అమ్మకాలు జరిగాయి.

అదే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో 2019 అక్టోబర్‌ నుంచి 2020 మార్చి వరకు 140.79 లక్షల కేసుల అమ్మకాలు జరిగాయి. అంటే 23.46 శాతం తగ్గిందని స్పష్టమవుతోంది. అదే కాలానికి బీర్లు చంద్రబాబు పాలనలో 131.46 లక్షల కేసుల అమ్మకాలు జరిగితే, జగన్‌ గారి పాలనలో 51.85 లక్షల కేసుల అమ్మకాలు జరిగాయి. ధరలు పెంచడం వల్ల వినియోగం తగ్గుతుందని ప్రపంచ వ్యాప్తంగా అనేక అధ్యయనాలు రుజువు చేశాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2018లో సేఫర్‌ అనే ఓ రోడ్‌ మ్యాప్‌ విడుదల చేసింది. ఆరోగ్యం, సామాజిక సమస్యల పరిష్కారానికి మద్యం, సంబంధిత హానికరమైన పదార్థాల వాడకాన్ని తగ్గించుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలను అందులో సూచించింది. పన్నులు, ధరలను పెంచడం ప్రభావవంతమైన చర్యలలో ఒక మార్గం అని స్పష్టంగా పేర్కొంది.

మద్యపానాన్ని కఠినంగా నియంత్రించడంతో పాటు నాటుసారా, అక్రమ మద్యాన్ని అరికట్టేందుకు ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఎక్సైజ్‌ చట్టంలో సవరణలు తెచ్చింది ప్రభుత్వం. ఈ నేరాలను నాన్‌ బెయిలబుల్‌ గా మార్చి గరిష్టంగా ఎనిమిది సంవత్సరాల జైలుశిక్ష విధించే అవకాశం కల్పించింది. అక్రమ మద్యం అమ్మకాలను నియంత్రించేందుకు ప్రత్యేకంగా స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏర్పాటు చేసింది. ఇలా అన్ని విధాలుగా దశలవారీ మద్యపానం నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ఏడాదిలోనే చర్యలు తీసుకుంది.

నాటు సారా తయారీదారులను గుర్తించి ఒక నూతన ప్రభుత్వ పథకాన్ని తీసుకు రావాల్సిన అవసరం ఉంది. తద్వారా వారికి ప్రత్యామ్నాయ జీవనోపాధి లభించి నాటు సారా తయారీకి స్వస్తి  పలుకుతారు. సిగరెట్‌ స్మోకింగ్‌ ఈజ్‌ ఇంజూరియస్‌ టు హెల్త్‌  అని ముద్రించి సిగరెట్ల అమ్మకాలు చేస్తూనే ఉంటారు. వాటిని నియంత్రించడానికి ప్రయత్నాలు కూడా లేవు. కానీ జగన్‌మోహన్‌రెడ్డి మద్యం అమ్మకాలను నియంత్రించడానికి నూతన ఎక్సైజ్‌ పాలసీని తెచ్చి సఫలం చేశారు. అదే ఆయనకూ, ఇతరులకూ ఉన్న స్పష్టమైన తేడా!


వ్యాసకర్త కళత్తూర్‌ నారాయణస్వామి
ఉప ముఖ్యమంత్రి, ఆబ్కారీ, వాణిజ్య పన్నుల శాఖ,
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top