ప్రజలు ‘సిద్ధం’గా ఉన్నారు! | Sakshi
Sakshi News home page

ప్రజలు ‘సిద్ధం’గా ఉన్నారు!

Published Mon, Apr 15 2024 5:22 AM

Sakshi Guest Column On CM YS Jagan And TDP Politics

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి మే నెల 13వ తేదిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు జరగబోతు న్నాయి. ఈ ఎన్నికలు అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి, ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీకి ప్రతిష్ఠాత్మ కంగా మారాయి. ముఖ్యంగా టీడీపీకి జీవన్మరణ సమస్యగా ఈ ఎన్నికలు తయారయ్యాయి. అందుకే ఆ పార్టీ శత విధాల ప్రయత్నించి బీజేపీ, జనసేనలతో పొత్తుపెట్టుకుని, పచ్చ మీడియా సాయంతో వైఎస్సార్‌సీపీని ఢీ కొంటోంది.

చంద్రబాబు నాయుడు, లోకేష్‌ వంటివారు కరోనా కరాళ నృత్యం చేసిన సమయంలో జాడలేకుండా పోయి ఎన్నికల సమయంలో ప్రజల ముందు వాలిపోయారు. ఇంగ్లీషు మీడియం స్కూల్స్‌ వద్దనీ, పేద ప్రజలకు అమరావతిలో పట్టాలివ్వకూడదనీ అన్న తెలుగు దేశం అధి నాయకుణ్ణి పేద ప్రజలు అసహ్యించు కొంటు న్నారు. ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలు వాళ్ళను సోమరిపోతులను చేస్తున్నాయన్న నారా బాబు మాటలు ఆయన ఎంతటి సంక్షేమ వ్యతిరేకో తెలుపుతున్నాయి.

చంద్రబాబు నాయుడు ‘పచ్చ మీడియా’తో కలిసి ప్రభుత్వంపైనా, వైఎస్సార్‌ సీపీ పైనా విషం చిమ్మడం దినచర్యగా పెట్టుకున్నారు. ఒంటరిగా అధికార పక్షాన్ని ఎదుర్కోలేని టీడీపీ... జనసే నతో పాటూ బీజేపీతోనూ పొత్తు పెట్టుకుని పోటీ చేస్తోంది. పోలవరం చంద్రబాబుకు పేటీఎం అయ్యిందని సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్న విషయం ప్రజల మెదళ్ళ నుండి తొలగించగలరా? అలాగే చంద్రబాబు నాయుడు నరేంద్ర మోదీని గత ఎన్నికల్లో తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు కదా... అయినా బీజేపీ – టీడీపీ ఎలా పొత్తు పెట్టుకొన్నాయి?

నిన్న మొన్నటివరకూ వలంటీర్ల వ్యవస్థనూ, ప్రజా సంక్షేమ పథకాలనూ దుయ్యబట్టిన చంద్ర బాబు... ఎన్నికలు రావడంతో  నాలుక మడతేసి, వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తాననీ, జగన్‌ కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు అందిస్తాననీ, తనను గెలిపిస్తే సంపద సృష్టించి అప్పుల ఆంధ్రాను స్వర్ణాంధ్రప్రదేశ్‌ చేస్తాననీ అంటున్నారు. ప్రజలు నమ్ముతారా? చంద్రబాబు మాటలకు విశ్వసనీయత ఉందా? ఎన్నికల ముందు కోటి వరాలిస్తారు; గెలిచిన తర్వాత నరాలు కోస్తారని ఆయన గత చరిత్రే చెబుతోంది. టీడీపీ గత మేనిఫెస్టోలో అలవిగాని హామీలిచ్చి, ప్రభుత్వం ఏర్పరచిన తర్వాత మేనిఫెస్టోను ఎవరికీ కనిపించకుండా చేసిన వైనాన్ని ప్రజలు మరచిపోలేదు. ఇలాంటి చంద్రబాబుకు ప్రజలు ఏ విధంగా ఓట్లు వేస్తారు? 

ఇకపోతే జనసేన పార్టీ విషయానికి వద్దాం. బోల్డన్ని పుస్తకాలు చదివానని చెప్పుకునే పవన్‌ కల్యాణ్‌కు ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌ లేదు. అన్న పెట్టిన ప్రజారాజ్యం పార్టీలో ‘యువరాజ్యం’ అధినేతగా ఉన్నప్పటికీ రాజకీయాల్లో ఇంకా ఓనమాలు కూడా నేర్చుకోలేదు. ప్రశ్నిస్తానని రాజకీయాల్లోకి వచ్చి, గత తెలుగుదేశం పార్టీ పాలనలో ఏమి ప్రశ్నించావని ప్రజలు అడుగుతున్నారు.

పూనకం వచ్చిన వాడిలాగా ఊగిపోతూ ప్రగల్భాలు పలకడం, ముఖ్యమంత్రిని సైతం దారుణమైన భాషతో తిట్టడం... ఇవి తప్ప ఆయనకు ఏమీ తెలి యదని ఆయన ఎన్నికల ప్రసంగాలు విన్న ప్రజలు అంటున్నారు. ఏ కులాన్నయితే పవన్‌ కల్యాణ్‌ నమ్ముకున్నారో, ఆ కులం వాళ్లు... జన సేన విడిగా పోటీ చేస్తే ఓట్లేయ్యటానికి సిద్ధంగా ఉన్నారు కాని తెలుగుదేశంపార్టీకి బోయీలుగా మారటానికి వాళ్ళు సిద్ధంగా లేరని కొందరంటున్నారు.

ఇక భారతీయ జనతాపార్టీ వ్యవహారం చూద్దాం. 2014 ఎన్నికల్లో తిరుపతి వెంకన్న సాక్షిగా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి, సంఘటన ప్రజలకు చిరకాలం గుర్తుండి పోయేదే. అంతేకాక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రయివేట్‌ పరంచేయటానికి పూనుకోవటం ప్రజల మనస్సులను తీవ్రంగా కలచివేసింది. టీడీపీతో అనైతిక పొత్తు కూడా ప్రజలు ఆ పార్టీని వ్యతిరేకించడానికి ఒక కారణంగా నిలుస్తోంది. 

ఇక కాంగ్రెస్‌ కూటమి సంగతి కొద్దాం. సీపీఐ, సీపీఎంలతో ఈ పార్టీ పొత్తుపెట్టుకుని ఇక్కడ ఎన్ని కల బరిలో దిగింది. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభ జించి, అనంతరం ఏమాత్రం న్యాయం చెయ్యక పోవటం కాంగ్రెస్‌ పార్టీ చేసిన పెద్ద తప్పిదం.

అందుకే ఆ పార్టీ ఏపీలో నామరూపాల్లేకుండా పోయింది. ఇప్పట్లో తలెత్తే పరిస్థితీ లేదు. ఇంతకంటే ఆ పార్టీ గురించి చెప్పడానికి ఏమీ లేదు.చివరగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితిని గమనిద్దాం. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ముఖ్య మంత్రీ చేపట్టని సంక్షేమ పథకాలను అవినీతి, బంధు ప్రీతి లేకుండా నేరుగా ప్రజల ముంగి టలోకి వలంటీర్‌ వ్యవస్థ ద్వారా తెచ్చిన ఘనత వైఎస్సార్‌ సీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్‌దే అనడం అతిశయోక్తి కాదు.

పేద ప్రజలకు విద్య, వైద్య సేవలను అందించడంలో జగన్‌ చేసిన కృషి చరిత్రలో చిరస్థాయిగా నిలచిపోతుంది. ‘నాడు–నేడు’ ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చి, ఇంగ్లీషు మీడియంను ప్రవేశపెట్టి ఎందరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా మొక్కవోని ధైర్యంతో ముందుకే వెళ్లారు జగన్‌. ‘ఆరోగ్యశ్రీ’ కార్డు పరిమితిని రూ. 25 లక్షల వరకు పెంచిన ఘనత ఆయనదే. ‘విలేజ్‌ క్లినిక్‌’ల ద్వారా ప్రజ లకు వైద్యం అందించడం జగన్‌ ప్రభుత్వానికే సాధ్యమయ్యింది.

‘నవరత్నాలు’ పొందుపరచిన మ్యానిఫెస్టోను ఒక బైబిల్‌లాగా, ఒక ఖురాన్‌ లాగా, ఒక భగవద్గీతలాగా భావించటం జగన్‌ దార్శనికతకు నిదర్శనం. ‘అమ్మ ఒడి, వైఎస్సార్‌ చేయూత, జగన్‌ గోరుముద్ద, కాపునేస్తం,లానేస్తం, అవ్వ తాతలకు పెన్షన్, విద్యాదీవెన, వసతి దీవెన’ లాంటి మరెన్నో పథకాలకు రూపశిల్పి జగనే కదా! ‘నా ప్రభుత్వం వలన మీకు, మీ కుటుంబానికి లబ్ధి జరిగితేనే మీ బిడ్డను ఆశీర్వదించి, చల్లని దీవెనలిచ్చి, గెలిపించండి’ అని అన్నారంటే జగన్‌కు తాను ప్రజలకు చేసిన మేలుపై ఎంత నమ్మకం ఉండి ఉండాలి?  

ఇంతటి బాహుబలిని ఢీ కొట్టడం ఎవ్వరికీ సాధ్యపడదు. మే 13న బాక్సులు బద్దలవ్వటం ఖాయం. విజయం ఎవరి పరమని వేరే చెప్పాలా? జూన్‌లో నూతన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా మరోసారి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, మహిళల వంటి అణగారిన, పీడిత వర్గాలవారి అండతో గెలిచి పెత్తందార్లపై పేదలు సాధించే విజయం ఎలా ఉంటుందో చూపించబోతున్నారు.

– గుత్తికొండ విశ్వేశ్వరరావు
రాజకీయ విశ్లేషకులు ‘ 90522 20464 

Advertisement
 
Advertisement