ఒమర్‌ అబ్దుల్లా (జమ్మూకశ్మీర్‌ సీఎం) రాయని డైరీ | Rayani Diary of Jammu and Kashmir CM Omar Abdullah | Sakshi
Sakshi News home page

ఒమర్‌ అబ్దుల్లా (జమ్మూకశ్మీర్‌ సీఎం) రాయని డైరీ

Jun 1 2025 1:31 AM | Updated on Jun 1 2025 1:31 AM

Rayani Diary of Jammu and Kashmir CM Omar Abdullah

మాధవ్‌ శింగరాజు

జ్ఞాపకాల స్తూపాలను నిర్మించుకోగలం. పోగొట్టుకున్న నమ్మకాల సౌధాలను పునర్ని ర్మించుకోగలమా?! కశ్మీర్‌ ఖాళీ అయిపోయింది! కశ్మీర్‌ గుండె వట్టి గ్రీష్మాన్ని ఊపిరి తీసి వదులుతోంది. ఒక్క వాన చుక్క... ధైర్యం చేసి జారి పడే ఒక్క వాన చుక్క కోసం... మోరెత్తి లోయలోకి చూస్తోంది. లోయే కశ్మీర్‌ ఆకాశం. టూరిస్టులే వాన జల్లులు, మురిసి కురిసిపోయే కరి మబ్బులు.

కశ్మీర్‌ నన్ను అడుగుతోంది, ‘‘ఏమయ్యా ఒమర్‌ అబ్దుల్లా... ఈ దాల్‌ సరస్సుని, మొఘల్‌ సొగసుని, గుల్మార్గ్‌ పూతల్ని, సలీం అలీ పార్క్‌ పిట్టల్ని, శంకరాచార్యుల వారిని, వైష్ణోదేవిని ఎవరికి సాక్షాత్కరింప చేసుకోమంటావ్‌?!
కొండా కోనలున్నా చూసే కన్నే లేకుంటే ఏం చేసుకోను ఈ వరాలన్నీ?!’’ అని అడుగుతోంది.

కశ్మీర్‌ కంట్లో వాన చుక్క! ఇప్పుడంతా ప్రశాంతంగా ఉందని చెప్పటానికి పెహల్గాంలో నేను సైకిల్‌ మీద తిరుగుతున్నప్పుడు ఓ గడప దగ్గర కశ్మీర్‌ నన్ను ఆపింది. ‘‘నీ కోసమే చూస్తున్నా ఒమర్‌!’’ అంది. 
‘‘చెప్పండి అమ్మీజాన్‌...’’ అన్నాను, సైకిల్‌ దిగి స్టాండ్‌ వేసి అమ్మీ పాదాలకు నమస్కరిస్తూ. 

‘‘నీకు తెలుసు కదా ఒమర్‌! తెర్లుతున్న తేయాకు నీటిలో యాలకులు, దాల్చిన చెక్క దంచి వేసి, కుంకుమ పువ్వుతో ‘కావా’ టీని నేను ఎంత చక్కగా కాస్తానో! నాక్కాస్త నమ్మకం ఇవ్వు ఒమర్‌. నా ఇంటికి మళ్లీ అతిథులు వస్తారని, నా చేతి టీని ప్రియంగా సేవిస్తారని...’’ అంటోంది అమ్మీజాన్‌.

‘‘అందుకోసమే పెహల్గాం వచ్చాను అమ్మీజాన్‌. మంత్రులందర్నీ రప్పించి ఇక్కడే మీటింగ్‌ కూడా పెడుతున్నాను...’’ అన్నాను.
‘‘మీటింగ్‌ పెడితే మంత్రులు వస్తారు కానీ, నా ఇంటికి అతిథులు వస్తారంటావా ఒమర్‌?! అంది అమ్మీజాన్‌ నిస్పృహగా. ‘‘వస్తారు, నన్ను నమ్మండి...’’ అని చెప్పాను. 

పెహల్గాంలో కేబినెట్‌ మీటింగ్‌కి వెళుతున్నప్పుడు కూడా బయట కొందరు నా దగ్గరకు పరుగున వచ్చి, ‘‘ఒమర్‌జీ! మాక్కాస్త నమ్మకం ఇవ్వగలరా..?’’ అని అడిగారు... నా చేతిని స్పృశించే ప్రయత్నం చేస్తూ! మనిషి స్పర్శకు మనిషెంతగా అలమటించి ఉన్నాడు!!
వారి చేతిని మృదువుగా అందుకున్నాను. 

‘‘ఒమర్‌జీ! మేము కశ్మీర్‌కు వచ్చిన టూరిస్టులం. ధైర్యం చేసి వచ్చేశాం. ధైర్యం మేము చేస్తాం. నమ్మకం మీరు ఇవ్వండి చాలు. ఇస్తారా ప్లీజ్‌...’’ అన్నారు. 
అతిథులు వస్తారని కశ్మీర్‌కు, కశ్మీర్‌ ఎదురు చూస్తోందని అతిథులకు నమ్మకం ఇవ్వాలి. ఒకవైపు నమ్మకమే సరిపోదు. 
‘‘కశ్మీర్‌ మీ అతిథి గృహం. మీ అతిథి గృహానికి నేను కాపలాదారుడిని...’’ అని వారితో చెప్పాను.  

రెండో రోజు గుల్‌మార్గ్‌లో నాకు మరికొందరు ఎదురుపడ్డారు. అయితే వాళ్లు, ‘‘మాక్కాస్త నమ్మకం ఇవ్వండి’’ అని అడగటానికి వచ్చినవాళ్లు కాదు. ‘‘మీ మీద నమ్మకం లేదు’’ అని చెప్పటానికి వచ్చినవాళ్లు! ‘‘కశ్మీర్‌ను బహిష్కరించండి’’ అని నినాదాలు చేస్తున్నారు. వాళ్లంతా యువకులు. ఉడుకు రక్తాన్ని పిడికిలి పట్టి ఉన్న వారు. 

‘‘ఉగ్రవాదులు కూడా ఇదే కోరుకుంటు న్నారు మిత్రులారా..! ‘కశ్మీర్‌ను బహిష్కరించండి’ అన్నదే వారి పిలుపు కూడా. వాళ్లు దేశానికి శత్రువులు. మీరు, వాళ్లూ ఒకటి కాదనే అనుకుంటున్నాను...’’ అన్నాను. 
వాళ్లేమీ మాట్లాడలేదు. నన్ను దాటుకుని ముందుకు వెళ్లిపోయారు. వాళ్ల నినాదం వాళ్లను అనుసరిస్తూ వెళ్లిపోయింది. 

ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళిగా పెహల్గామ్‌లో ఒక స్మారక స్తూపం నిర్మించా లని కేబినెట్‌ మీటింగ్‌లో అనుకున్నాం. మరి కోల్పోయిన నమ్మకానికి తిరిగి ఎలా ప్రాణ ప్రతిష్ఠ చేసుకోవటం?
ఉర్దూ కవి ఫైజ్‌ అహ్మద్‌ ఫైజ్‌ నా లోపల అంటున్నారు.. ‘‘హృదయం నిస్సహాయంగా ఏం లేదు. ప్రస్తుతానికి ఓడిపోయిందంతే! దుఃఖపు సాయంత్రం సుదీర్ఘంగా ఉంది. కావచ్చు కానీ, ఇది ఒక సాయంత్రం మాత్రమే’’!  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement