టై అండ్‌ డైలో ఇది ‘ఆంధ్రా పోచంపల్లి’

Punna Krishnamurthy Write on Pochampally Tie and Dye, Kothur Weavers - Sakshi

‘పోచంపల్లి’ అని గూగుల్‌లో సెర్చ్‌ చేస్తే... టై అండ్‌ డై శారీస్, డ్రెస్‌ మెటీరియల్‌ అమ్మకానికి సంబంధించి ముప్పై లక్షలకు పైగా రిజల్ట్స్‌ వస్తాయి! తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లాలో అయిదు వేలలోపు జనాభా గల పోచంపల్లి నేడు టై అండ్‌ డై (ఇక్కత్‌) చేనేత, పట్టు వస్త్రాలకు ప్రపంచ రాజధాని. పోచంపల్లి టై అండ్‌ డైకి దాదాపు నూరేళ్ళ చరిత్ర ఉన్నప్పటికీ, 2005 నుంచి ప్రపంచ ప్రఖ్యాతి చెందింది. ఇందుకు ముఖ్య కారణం అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి చొరవతో పోచంపల్లికి జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌ (జీఐ) లభించడం. ఈ గుర్తింపు ద్వారా ఈ వస్త్రాల తయారీ ప్రత్యేకతలకు మేధాపర మైన – చట్టబద్ధమైన హక్కులు లభించాయి. ఈ క్రమంలో పోచంపల్లిని యునైటెడ్‌ నేషన్స్‌ సంస్థ యూఎన్‌డబ్ల్యూటీఓ ‘పర్యాటకులు దర్శించదగిన గ్రామం’గా గుర్తించింది. కానీ ‘కొత్తూరు’ అని సెర్చ్‌ చేస్తే దాదాపు రిజల్ట్స్‌ నిల్‌! నిజానికి పోచంపల్లి వృక్షమైతే, కొత్తూరు అదే వృక్షపు బీజం! 

పల్నాడు జిల్లా, మాచర్ల రూరల్‌ మండలం, కొత్తూరు గ్రామం కేంద్రంగా టై అండ్‌ డై శారీస్, డ్రెస్‌ మెటీరియల్‌ వస్త్రాలను నేస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్‌లో టై అండ్‌ డై వస్త్రాలు రూపొందుతున్నది కొత్తూరులోనే!! సాధారణ చేనేత వస్త్రాలు, మిల్లు వస్త్రాలు తయారైన తదుపరి... వస్త్రాలపై రంగులు అద్దుతారు. అవి పై పై రంగులు. టై అండ్‌ డై విధానంలో వస్త్రం తయారీ పూర్వదశలోనే నూలు దారాలు వర్ణమయమవుతాయి. ముందుగా రూపొందించిన డిజైన్లకు అనుగుణంగా రంగులు అవసరం లేని చోట్ల రబ్బరుతో కట్టి(టై), అవసరమైన చోట్ల రంగులో ముంచుతారు (డై). రంగులలో రసాయనాల శాతం తక్కువ.

నూలు దారాల దశలోనే ఈ వస్త్రానికి సహజత్వం, మృదుత్వం, మన్నిక చేకూరుతాయి. మిల్లు యంత్రాలు టై అండ్‌ డైతో పోటీ పడలేవు. డిజైన్లను వినియోగదారుల అభిరుచిని బట్టి రూపొందిస్తారు. కనీస ధర పదివేల రూపాయలు. లక్ష రూపాయలు పలికే హుందాగా ఉండే టై అండ్‌ డై చీరలు ధరించడం వీఐపీలకు ఒక స్టేటస్‌ సింబల్‌. మైక్రోసాఫ్ట్, ఎయిర్‌ ఇండియా తదితర సంస్థలు తమ ఉద్యోగులకు ఈ వస్త్రాలను అధికారికంగా వాడుతూ ప్రోత్సహిస్తున్నాయి. జపాన్, యూఏఈ తదితర దేశాలు డ్రెస్‌ మెటీరియల్, కర్టెన్లు, బెడ్‌షీట్లు దిగుమతి చేసుకుంటున్నాయి. నూటికి నూరు శాతం డిమాండ్‌ ఉన్న పోచంపల్లి టై అండ్‌ డై విదేశీ మారక ద్రవ్యం, జీఎస్టీ సమకూర్చడంలో అగ్రగామిగా ఉంది.  

పోచంపల్లి వాస్తవానికి ఒక బ్రాండ్‌ ఇమేజ్‌. పోచంపల్లి బ్రాండ్‌ పేరుతో ఏటా దాదాపు రెండు వేల కోట్ల రూపాయలకు అమ్ముడవుతున్న టై అండ్‌ డై వస్త్రాలలో... పోచంపల్లి గ్రామంలో తయారయ్యే వస్త్రాలు అయిదు శాతం మాత్రమే! పుట్టపాక, గట్టుప్పల్, చండూరు, సిరిపురం, వెల్లంకి, కొయ్యలగూడెం తదితర పాత నల్గొండ, మహబూబ్‌నగర్‌  జిల్లాలకు చెందిన గ్రామాలలో 75 శాతం తయారవుతాయి. మిగిలిన ఇరవై శాతం ‘ది నాగార్జున వీవర్స్‌ కో–ఆపరేటివ్‌ సొసైటీ  కొత్తూరు’ ఆధ్వర్యంలో తయారవుతాయి.

సాధారణ చేనేత వస్త్రకారుని నెలసరి రమారమి ఆదాయం అయిదు వేల రూపాయల కంటే తక్కువ. తెలంగాణలో పోచంపల్లి బ్రాండ్‌ వస్త్రకారుల ఆదాయం నెలకు రూ. 30 వేలు. అదే వస్త్రాన్ని కొత్తూరు కేంద్రంగా నేస్తున్న వస్త్రకారునికి నెలకు వచ్చే ఆదాయం పదివేల రూపాయలు మాత్రమే! దీనికి కారణం కొత్తూరు వస్త్రాలకు బ్రాండ్‌ ఇమేజ్‌ లేకపోవడమే!

కొత్తూరు సొసైటీ పరిధిలోని గ్రామాల టై అండ్‌ డై నేతకారులు పోచంపల్లి, పుట్టపాక తదితర గ్రామాలకు వెళ్లి ముడి నూలును, సిల్క్‌ను కొనాలి. లేదా అక్కడ నుంచి ముడి నూలు తెచ్చిన వారి కోసం ఇక్కడ టై అండ్‌ డై చేసి, నేసి, అక్కడికి వెళ్లి ఇవ్వాలి. హైదరాబాద్‌కు దగ్గరగా ఉన్న పోచంపల్లి సహకార సంస్థల వారు, విడిగా వ్యాపార సంస్థలకు చెందిన వారు బెంగళూరు నుంచి డైరెక్టుగా సిల్క్‌ ముడి సరుకు తెప్పించుకుంటారు. పరిసర గ్రామాలకు నూలు ఇచ్చి తయారైన వస్త్రాన్ని వారే తీసుకెళ్లి దేశ విదేశాల్లో మార్కెటింగ్‌ చేసుకుంటారు. పోచంపల్లి వ్యవస్థీకృతం అయింది.

ఇటీవలి కాలంలో కొత్తూరు చేనేత వస్త్రకారులతో రెంటచింతల, దాచేపల్లి, మాచవరం తదితర గ్రామాల చేనేత వస్త్రకారులకు రాష్ట్ర హ్యాండ్లూమ్‌ అండ్‌ టెక్స్‌టైల్‌ విభాగం అధికారులు టై అండ్‌ డై శిక్షణ కార్యక్రమాలు నిర్వహి స్తున్నారు. కానీ వసతుల లేమి వల్ల ఎక్కువ మందికి శిక్షణ ఇవ్వలేకపోతున్నారు. 

ఈ పరిస్థితులను అధిగమించడానికి ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టాలని ఇక్కడి నేతకార్మికులు కోరుకుంటున్నారు. కొత్తూరు శ్రీ నాగార్జున చేనేత సహకార సంఘం కాలనీకి విశాలమైన స్థలం ఉంది. ఇక్కడ అన్ని వాతావరణాలను తట్టుకునే రీతిలో, శాశ్వత భవనం ఏర్పాటు చేయాలి. ఏడాది పొడవునా, పగలూ రాత్రీ  టై అండ్‌ డై  నేర్పే రీతిలో కనీసం 20 మగ్గాలతో ట్రైనింగ్‌ హాల్‌ నిర్మించాలి. తదనుగుణంగా నివాస వసతులు, రంగులు వేసుకునే గదులు నిర్మించాలి. నూలును బెంగళూరు నుంచి ఖరీదు చేసి నిల్వ ఉంచాలి. ముడిపదార్థాలు తెచ్చేందుకు, సమీప గ్రామాల్లో వస్త్రకారులకు అందజేసేందుకు, తయారైన వస్త్రాలను గుంటూరు – విజయవాడ, గన్నవరం విమానాశ్రయం, తదితర మార్కెటింగ్‌కు  అనువైన ప్రాంతాలకు సరఫరా చేసేందుకు తగిన వాహన సౌకర్యం కల్పించాలి. 

ముఖ్యంగా సృజనాత్మకత కలిగిన ఆకట్టుకునే డిజైన్లు రూపొందించే చేనేత సామాజిక వర్గానికి చెందిన టై అండ్‌ డై గురించి అవగాహన కలిగిన ఆధునిక యువతకు అవకాశాలు కల్పించాలి. హ్యాండ్లూమ్‌ వీవర్స్‌ కోసం ముద్ర లోన్స్‌ను, ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారా సబ్సిడీతో ఇప్పించేందుకు అధికా రులు వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలి.

దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో పోచంపల్లి జీఐ సాధించింది. ప్రస్తుతం వారి తనయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ‘నేనున్నాను’ అనే వారి మాట కోసం కొత్తూరు ఎదురు చూస్తోంది! (క్లిక్: గట్లు తెగకపోవడానికి ఆయనే కారణం)


- పున్నా కృష్ణమూర్తి 
ఇండిపెండెంట్‌ జర్నలిస్ట్‌ 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top