Tirumala: శ్రీ వేంకటేశ్వర స్వామివారి మేల్కొలుపు ఇలా...

Tirumala: Suprabhatam Seva, Melukolupu, Vishwaroopa Seva, Bangaru Vakili - Sakshi

తిరుమలలో సుప్రభాత సేవ సమయంలో భక్తుల్ని బంగారు వాకిలి ముందు నిలబెట్టి ఆ వాకిలికి తెరవేసి వుంచుతారు. ఆ సమయంలో తెర వెనుక గర్భాలయంలో ఏమి జరుగుతూ వుంటుంది, అర్చకులు ఏమి చేస్తారు..? అన్న ఉత్కంఠ భక్తులలో నెలకొంటుంది. ఇంతకీ అక్కడ ఏమి జరుగుతుందంటే..?


సుప్రభాత సేవను విశ్వరూప సేవ అని కూడా అంటారు. తెల్లవారు జామున సుప్రభాత సేవ జరగడానికి ముందు గొల్ల మిరాశిదారుడు వెళ్ళి అర్చకులను, జీయంగార్లను దివిటీల వెలుగులో ఆలయం వద్దకు తీసుకురావడం సంప్రదాయం. అదే సమయంలో ఆలయ అధికారులు కూడా వస్తారు. ఆలయ అధికారులు, భద్రతా సిబ్బంది వారి స్థానాలలో చేరిన తరువాత భక్తులను ఆలయంలోకి అనుమతిస్తారు. అదే సమయంలో వేదపండితులు, అర్చకులు, జీయంగార్లు, అన్నమయ్య వారసులు బంగారు వాకిలి వద్దకు చేరుకుంటారు. 


అందరి సమక్షంలో గొల్ల మిరాశిదారుడు రాత్రి వేసిన సీళ్లను తొలగించి, తాళాలతో ఆలయం తలుపులు తీసి అర్చకులు, జీయంగార్లను తీసుకుని ఆలయం లోపలికి వెళ్తారు. పూర్వకాలంలో భక్తులను కూడా లోపలకి అనుమతించేవారట. అన్నమయ్య వంశస్థులు పాటలు పాడుతూ వుంటే భక్తులు నృత్యం చేసేవారు. రుత్విజులు వేదం చదువుతూ వుంటే స్వామివారికి మేల్కొలుపు జరిపేవారట. అటు తరువాత ఈ సంప్రదాయంలో మార్పు వచ్చింది. బంగారు వాకిలి తలుపులు తీసి గొల్ల మిరాశిదారుడు అర్చకులు, జీయంగార్లను లోపలికి తీసుకువెళ్లాక తలుపులు వేసేస్తారు. బంగారు వాకిలి ముందు నుంచే వేదపండితులు సుప్రభాతం పఠిస్తే, అన్నమయ్య వంశీకులు గానం చేస్తారు. 


ఇదే సమయంలో లోపల అర్చకులు, జీయంగార్లు గర్భాలయంలో దీపాలు సరిచేసి, కొత్తగా దీపాలు వెలిగించి స్వామివారి దోమతెరను తొలగించి ఉయ్యాలపై పవళించిన స్వామివారిని మేల్కొలిపి భోగ శ్రీనివాసమూర్తిని స్నపన మండపం నుంచి గర్భగృహంలోకి జీవస్థానానికి చేరుస్తారు. స్వామివారు పవళించిన పరుపు, మంచాలను గొల్ల బయటకు తీసుకువచ్చి సబేరా గదికి తరలిస్తారు. స్వామివారికి ఆవు పాలు, వెన్న నైవేద్యంగా సమర్పించి కర్పూర హారతిని ఇవ్వడంతో బంగారు వాకిలి తలుపులు తెరుస్తారు. అప్పటికి సుప్రభాత పఠనం పూర్తవుతుంది. ఆ సమయంలో జరిగేవి రెండు సేవలు. ఒకటి మేలుకొలుపు సేవ అయితే, రెండవది భక్తులకు స్వామివారి విశ్వరూప దర్శనం. (క్లిక్ చేయండి: ఆనంద నిలయ విమాన విశిష్టత)

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top