అక్షరాలా ఆమె కోసం... | Womens Prize for Fiction 2026 shortlist has been announced | Sakshi
Sakshi News home page

అక్షరాలా ఆమె కోసం...

Apr 23 2026 4:02 AM | Updated on Apr 23 2026 4:02 AM

Womens Prize for Fiction 2026 shortlist has been announced

నేడు ప్రపంచ పుస్తక దినోత్సవం

పుస్తకాల రూపంలోని మహిళల క్రియేటివిటీని సెలబ్రేట్‌ చేసే పండగ, ప్రతిష్ఠాత్మకమైన... విమెన్స్‌ ప్రైజ్‌ ఫర్‌ ఫిక్షన్‌. సాహిత్య ప్రపంచంలో లింగ వివక్షకు అడ్డుకట్ట వేసి, రచయిత్రులకు తగిన ప్రాతినిధ్యం కల్పించి, ప్రపంచానికి పరిచయం చేయడానికి ఏర్పాటైన అపురూపమైన బహుమతి... విమెన్స్‌ ప్రైజ్‌ ఫర్‌ ఫిక్షన్‌. ఈ సంవత్సరం విమెన్స్‌ ప్రైజ్‌ ఫర్‌ ఫిక్షన్‌ లాంగ్‌లిస్ట్‌కు ఎంపికైన పదహారు పుస్తకాలలో కొన్ని పుస్తకాల పరిచయం...

గోడలు కూలుతున్నాయి...జీవితాలు మారుతున్నాయి
షీనా కలయిల్‌ రాసిన హృదయాన్ని కదిలించే నవల... ది అదర్స్‌. అది 1989 సంవత్సరం. తూర్పు జర్మనీలోని డాయిష్‌ డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌లో విభిన్న నేపథ్యాలు ఉన్న ముగ్గురు యువతీ యువకులు స్నేహితులవుతారు. మొజాంబిక్‌కు చెందిన ఆర్మాండో ఫ్యాక్టరీ కార్మికుడు. లోలిత భారతదేశానికి చెందిన వైద్యవిద్యార్థిని. థియో తూర్పు బెర్లిన్‌కు చెందిన యువకుడు. రచయిత కావాలని కలలు కంటుంటాడు. తూర్పు ఐరోపా అంతటా నిశ్శబ్ద విప్లవం వ్యాపిస్తుండగా ఈ ముగ్గురి జీవితాల్లో చోటు చేసుకున్న కీలక పరిణామాలే... ది అదర్స్‌.

కాసింత ప్రేమ కోసం...
పందొమ్మిదేళ్ల గ్లోరియా కాలేజీకి వెళ్లదు. మరి ఏం చేస్తుంది? పార్కుల చుట్టూ తిరుగుతుంది. స్నేహితుల కోసం వెదుకుతుంది. రోజూ జాక్‌ ఇంటికి వెళుతుంటుంది. ఈ జాక్‌ ఉన్నట్టుండి అనూహ్యంగా ప్రవర్తిస్తాడు. లోకం మీద కోపంతో రగిలిపోతుంటాడు. ఒక హింసాత్మక సంఘటన తరువాత గ్లోరియా, జాక్‌ల స్నేహం ముగిసిపోతుంది. గ్లోరియా ఒంటరిదైపోతుంది. ఈ హింసాత్మక ప్రపంచంలో అనుబంధాలు, కాసింత ప్రేమ కోసం ఆరాటపడే ఒక మహిళ అంతరంగాన్ని లోతుగా చిత్రించే నవల... గ్లోరియా డోంట్‌స్పీక్‌. ‘లూసీ యాప్స్‌ రాసిన గ్లోరియా డోంట్‌ స్పీక్‌ ఒక అద్భుతమైన పుస్తకం. హింస, దోపిడి, స్వీయనిర్ణయాధికారం... మొదలైన అంశాలతో రాసిన శక్తిమంతమైన పుస్తకం’ అన్నారు విమర్శకులు.

చరిత్రపై ఫ్లాష్‌లైట్‌
యుద్దం తరువాత జపాన్‌ పరిస్థితి, అమెరికాలోని శివారు ప్రాంతాలు, ఉత్తర కొరియా పాలన... ఇలా 20వ శతాబ్దపు పరిణామాలకు సాక్షిగా నిలిచిన ఒక కుటుంబంపై రాసిన పుస్తకం... ఫ్లాష్‌లైట్‌. కొరియా నుండి అమెరికాకు వలస వచ్చి అమెరికన్‌ విశ్వవిద్యాలయంలో పనిచేసే సెర్క్, అతడి పదేళ్ల కూతురు లూయిసా, సెర్క్‌ భార్య ఈ పుస్తకంలోని ప్రధాన పాత్రలు. లూయిసా తండ్రి అదృశ్యం కావడం ఆ చిన్న కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేస్తుంది. సుసాన్‌ చోయ్‌ రాసిన ‘ఫ్లాష్‌లైట్‌’ ఒక కుటుంబం చుట్టూ తిరిగే చారిత్రక పుస్తకం. అడుగడుగునా ఆశ్చర్యపరుస్తూ ఆసక్తిని రేకెత్తించే పుస్తకం.

ఉత్తరాలమ్మ
‘ఉత్తరాలు రాయడానికే జన్మించిందా!’ అన్నట్లుగా ఉంటుంది సిబిల్‌ వాన్‌. ప్రతి ఉదయం ఉత్తరాలు రాయడానికి కూర్చుంటుంది. తన సోదరుడికి, ప్రాణస్నేహితురాలికి, విశ్వవిద్యాలయ అ«ధ్యక్షుడికి, తన అభిమాన రచయితల తాజా పుస్తకాలపై అభి్రపాయాన్ని తెలియజేయడానికి ఉత్తరాలు రాస్తుంటుంది. డెబ్బై మూడు సంవత్సరాల సిబిల్‌ చమత్కారమైన, వివేకవంతమైన ఉత్తర ప్రత్యుత్తరాలతో ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. వర్జీనియా ఇవాన్స్‌ రాసిన ‘ది కరస్పాండెంట్‌’ ఒక వృద్ధ మహిళ దృష్టి కోణం నుంచి ఉత్తరాల రూపంలో వినూత్నంగా, భావోద్వేగ తీవ్రతతో రాసిన నవల. ‘సిబిల్‌ ఉత్తరాలు అసాధారణమైనవి కాకపోవచ్చు. అయితే మీకు బాగా గుర్తుండిపోయే పాత్రలలో ఆమె ఒకరు కావచ్చు’ అన్నారు విమర్శకులు.

దొంగా... సంరక్షకులు!
ఒక వారం వ్యవధిలో సాగే  పరిణామాలతో ‘ఎ గార్డియన్‌ అండ్‌ ఎ థీఫ్‌’ రెండు కథలను చెబుతుంది. మా, బూంబా అనే రెండు పాత్రల కేంద్రంగా నడిచే పుస్తకం ఇది. ఈ రెండు పాత్రలు తమ కుటుంబం కోసం ఒకే సమయంలో సంరక్షకుడిగా, దొంగగా ప్రవర్తిస్తాయి. తన కుటుంబాన్ని పోషించాలనే ఆరాటం బూంబాను దొంగగా మారుస్తుంది. వరుస నేరాలకు పాల్పడేలా చేస్తుంది. ప్రగాఢమైన తల్లిదండ్రుల ప్రేమ, మెరుగైన జీవితం కోసం ఆరాటం, లోపిస్తున్న నైతిక విలువల చుట్టూ తిరిగే నవల ఇది. తమ ప్రియమైన వారిని రక్షించుకునే నేపథ్యంలో నిస్సహాయ పరిస్థితులు ప్రజలను విలన్‌ లేదా హీరోగా ఎలా మారుస్తాయో ఈ నవల కళ్లకు కడుతుంది. ‘మేఘా మజుందార్‌ రాసిన ఎ గార్డియన్‌ అండ్‌ ఎ థీఫ్‌ మానవజాతి నైతిక సందిగ్ధతల గురించి పాఠకులను నిరంతరం సవాలు చేసేలా రాసిన అద్భుతం పుస్తకం’ అన్నారు విమర్శకులు.

లింగ వివక్ష ను నివారించడానికి...
మహిళల రచనలను ఉన్నతస్థాయికి తీసుకువెళ్లాలి, కొత్త గొంతులను ప్రపంచానికి పరిచయం చేయాలి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాఠకులను ఒకే వేదిక మీదికి తీసుకురావాలనే లక్ష్యంతో ‘విమెన్స్‌ ప్రైజ్‌ ఫర్‌ ఫిక్షన్‌’ ప్రారంభమైంది. సాహిత్య ప్రపంచంలో లింగ వివక్షను నివారించడానికి, రచయిత్రులకు తగిన ప్రాతినిధ్యం కల్పించడానికి యూకేలో 1996లో ఈ పురస్కారానికి శ్రీకారం చుట్టారు. విజేతకు నగదు బహుమతితోపాటు కళాకారిణి గ్రిజెల్‌ నివెన్‌ తయారు చేసిన ‘బెస్సీ’ అనే కాంస్య విగ్రహాన్ని ప్రదానం చేస్తారు. బాగా పుస్తకాలు చదివే, వివిధ రంగాలలో అగ్రస్థానంలో ఉన్న అయిదుగురు మహిళలతో కూడిన ప్యానెల్‌ ‘విమెన్స్‌ ప్రైజ్‌ ఫర్‌ ఫిక్షన్‌’ విజేతను ఎంపిక చేస్తుంది. లాంగ్‌లిస్ట్‌కు ఎంపికైన పుస్తకాలలో కొన్ని షార్ట్‌ లిస్ట్‌కు ఎంపిక అవుతాయి. షార్ట్‌ లిస్ట్‌ నుంచి విజేతను ఎంపిక చేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement