
పెళ్లి అంటే పూజలు, వేదమంత్రాలు, తాళి, మేళతాళాలు ఉంటాయి. కానీ ఎటువంటి దేవుడి ఫొటోలు లేకుండా సంఘ సంస్కర్తలు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, జ్యోతిరావు పూలే, పెరియర్ రామస్వామి, సావిత్రి బాయి పూలే, గౌతమ బుద్ధుని ఫొటోలు పెట్టుకుని ఒకేసారి ఇద్దరు అన్నదమ్ముల వివాహాలు జరిగాయి. పెళ్లి కుమారులు, పెళ్లి కుమార్తె ల అభిప్రాయాల మేరకు బౌద్ధ ఆచార ప్రకారం వివాహం జరిపించారు. శనివారం జరిగిన ఈ కార్యక్రమాలకు కొరవంగి గ్రామం వేదిక అయింది.

గ్రామానికి చెందిన అన్నదమ్ములైన సలభంగి చిన్నారావు ఇదే మండలం బొండాపల్లి గ్రామానికి చెందిన శ్యామంతి, సలభంగి సునీల్‌కుమార్ పోయిపల్లి గ్రామానికి చెందిన ఝాన్సీకుమారి వివాహాలను దమ్మ దీక్ష విశాఖపట్నం జిల్లా ప్రతినిధులు బి. గౌతమ్‌బాబు, ఎస్. సింహాద్రి జరిపించారు. అలాగే పాడేరు మాజీ ఎమ్మెల్యే లకే రాజారావు, బాంసెఫ్ గౌరవ అధ్యక్షుడు ఎం.చిట్టిదొర ధర్మ సందేశం వినిపించారు. అనంతరం వధూవరులు పెద్దల ఆశీస్సులు తీసుకున్నారు. పెళ్లికి వచ్చిన బంధుమిత్రులకు విందు ఏర్పాటు చేశారు.
తాము చదువుకున్నప్పటి నుంచి బౌద్ధ ఆచార ప్రకారం పెళ్లి చేసుకోవాలని అనుకున్నామని, ఇదే విధంగా జరిగినందుకు ఎంతో సంతోషంగా ఉందని అన్నదమ్ములైన పెళ్లికొడుకులు తెలిపారు. ఇందుకు బంధువులు కూడా సమ్మతించడం గొప్ప విషయమన్నారు. ఈ వివాహాలు వీవీ దుర్గారావు, కె, సత్యనారాయణ, ఎస్. కోటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగాయి. బాంసెఫ్ ప్రతినిధులు చెండా భీమసుందర్, టీచర్లు కె. సత్యనారాయణ, ఎస్. మత్స్యలింగం పాల్గొన్నారు.
(చదవండి: ఏఐ దేవత..! కష్టసుఖాలు వింటుంది, బదులిస్తుంది కూడా..)