సత్యం ఉన్నది ఉన్నట్లుగానే

Truth means the actual state of a matter, an adherence to reality - Sakshi

ఉన్నది ఉన్నట్టుగా తెలియకపోతే ఉన్న మనకు లేనిపోని నష్టం జరుగుతుంది. మనకు కష్టం కలుగుతుంది. సత్యం లేదా నిజం తెలియకపోవడం వల్లా, లేకపోవడం వల్లా, మనకు ఎంతో హాని జరుగుతుంది, జరుగుతోంది, జరుగుతూ ఉంటుంది... ప్రతి ఒక్కరికీ సత్యం అవసరం ఉంది. ప్రతి ఒక్కరికీ సత్యమే అవసరం అవుతుంది.

ఏదో అనుకోవడం, ఏదో అభిప్రాయపడడం ఈ రెండిటినీ వీలైనంత తొందరగా మనం వదిలేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో, కొన్ని విషయాల్లో మన ఇష్ట, అయిష్టాల్లో సత్యం లేకపోవచ్చు; మనకు నచ్చిన, నచ్చని వాటిల్లో సత్యం లేకపోవచ్చు. కాబట్టి మనం మనల్ని దాటుకుని లేదా మనల్ని మనం మార్చుకుని సత్యంలోకి వెళ్లవలసి ఉంటుంది. ఆ పని ఎంత తొందరగా జరిగితే మనకు అంత మేలు జరుగుతుంది. క్షేత్ర వాస్తవాన్ని తెలుసుకోగలగడం, ఆపై సత్యాన్ని అవగతం చేసుకోగలగడం మనిషి జీవితంలో తప్పకుండా నేర్చుకోవలసినవి.

మనకు ముందు వచ్చిన వాళ్లు చెప్పారు కాబట్టి, మనకు ముందే కొందరు నమ్మారు కాబట్టి, కొందరు చెబుతున్నారు కాబట్టి, కొందరు అనుకుంటున్నారు కాబట్టి, ప్రచారంలో ఉన్నాయి కాబట్టి, వాడుకలో ఉన్నాయి కాబట్టి ఉన్నవి సరైనవే అని స్వీకరించే ధోరణి వాంఛనీయం కాదు. అది నాసిరకం పోకడ. అది ఆదర్శనీయమైనది కాదు.

ఏదో అనుకోవడం, దేన్నో ఊహించుకోవడం సరైనవి కాకపోవడమే కాదు, అత్యంత హానికరమైనవి కూడా. ఒక రోగి తనకు రోగం ఉంది అన్న వాస్తవాన్ని తెలుసుకుంటే దానికి తగిన వైద్యం చేసుకుని లాభపడడం జరుగుతుంది. ఏ విషయంలో అయినా ఎంత తెలుసుకుంటే అంత లాభం ఉంటుంది. తెలివిడిలోకి వెళ్లేందుకు అభిప్రాయాలవల్ల ఏర్పడ్డ నమ్మకం అడ్డంకిగా ఉంటూనే ఉంటుంది. మనం ఆ అడ్డంకిని వీలైనంత వేగంగా తొలగించుకోవాలి.

చలామణిలో ఉన్నవాటిని నమ్మడం మనిషి బలహీనతల్లో బలమైంది. ఆ బలమైన బలహీనత మనిషిని ఎప్పటికప్పుడు పెద్ద పెద్ద దెబ్బలు కొడుతూనే ఉంటుంది. మనిషి ఆ దెబ్బల నొప్పిని అనుభవిస్తూనే ఉన్నాడు. ‘నమ్మడంపై నాకు నమ్మకం లేదు, తెలుసుకోవడమే నా విధానం’ అని ఓషో ఒక సందర్భం లో అన్నారు. తెలుసుకునే విధానానికి మనం అలవాటుపడాలి.‘ఏది సత్యం?’ ఈ ప్రశ్నకు ‘దేని ప్రభావం మంచి చేస్తుందో అది సత్యం’ అని మనుస్మృతిలోని మాటల్ని ఉటంకిస్తూ బుద్ధుడు తెలియజెప్పాడు. అమెరికా దేశపు తత్త్వవేత్త విలియమ్‌ జేమ్స్‌ కూడా ఈ మాటల్ని చెప్పారు. ఒక ప్రయత్నానికి వచ్చిన ప్రభావంవల్ల జరిగిన మంచి సత్యం. మనకు మంచి కావాలి కనుక మనకు సత్యం కావాలి.

నమ్మడం, అభిప్రాయపడడం ఇవి అర్థంలేనివి. ఆపై అనర్థదాయకమైనవి. అధ్యయనం చేస్తే కానీ అవగాహన రాదు. ఏది ఉందో, ఏది లేదో, ఏది అవునో, ఏది కాదో మనం తెలుసుకోవాలి. ఇకనైనా, ఇపుడైనా నిజానిజాలను తేల్చుకుందాం. కళ్లు తెరిస్తే కానీ దృశ్యం కనిపించదు. నిద్రలేస్తే కానీ నడక మొదలవదు. మనం నిద్రలేచి నడక మొదలుపెడదాం. ‘నా భావన’, ‘నేనేం అంటానంటే’ అన్న మధ్యతరగతి మాంద్యాన్ని వదిలించుకుందాం; ఉన్న మిథ్యలను విదిలించుకుని ముందుకెళదాం. ప్రయత్నించి సత్యాన్ని సాధిద్దాం; సత్యంతో మనుగడను సాగిద్దాం.

‘సత్యాన్ని అమృతంలా సేవించు’ అని అష్టావక్రగీత చెబుతోంది. సత్యాన్ని సేవించడానికి అలవాటు పడదాం. సత్యం రుచిగా ఉంటుంది. ఆ రుచిని తెలుసుకుందాం. ఆ తరువాత సత్యం రుచికి మాలిమి అయిపోయి జీవితాన్ని మనం రుచికరం చేసుకుందాం. సత్యం జ్ఞానాన్ని ఇస్తుంది. ‘జ్ఞానం స్వేచ్ఛకు ఆధారం’ అని తెలియజెప్పారు ఆదిశంకరాచార్య. సత్యం ద్వారా జ్ఞానాన్ని, జ్ఞానం ద్వారా స్వేచ్ఛను పొంది మనం సరిగ్గా, ఉన్నతంగా జీవిద్దాం; జీవితాన్ని విలువైందిగా చేసుకుందాం.

అభిప్రాయాలు, అనుకోవడాలు, నమ్మకాలు వీటిని మనలో పేర్చుకుని మనల్ని మనం మోసుకోవడం జీవనం కాదు; వాటివల్ల మనలో మనం కూరుకు పోవడం జీవితం కాకూడదు.
ఎరుకను అనుసరిద్దాం; ఎదుగుతూ ఉందాం.

– రోచిష్మాన్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top