Tripuranthakam భూలోక కైలాస క్షేత్రం : త్రిపురాంతకేశ్వరాలయం | Tripuranthakam Temple Unknown and Interesting Facts | Sakshi
Sakshi News home page

Tripuranthakam భూలోక కైలాస క్షేత్రం త్రిపురాంతకేశ్వరాలయం

May 29 2025 10:32 AM | Updated on May 29 2025 11:45 AM

Tripuranthakam Temple Unknown and Interesting Facts

శ్రీశైల(Srisailam) పుణ్యక్షేత్రం కంటే అతి పురాతనమైందిగా ప్రసిద్ధి చెందిన మహా శైవధామమే త్రిపురాంతకం (Tripuranthakam). త్రిపురాంతకేశ్వరస్వామి, బాలా త్రిపుర సుందరి అమ్మవార్లు కొలువు దీరిన ఈ క్షేత్రం ప్రశాంతతకు పుట్టినిల్లుగా, ప్రకృతి అందాలకు నెలవుగా విరాజిల్లుతోంది. అలాంటి ఈ క్షేత్రం ప్రకాశం, కర్నూలు జిల్లాల సరిహద్దుల్లో ఉంది. 

ఓ అద్వితీయమైన ఆధ్యాత్మికానుభూతిని సొంతం చేసే త్రిపురాంతకంలో ప్రధాన ఆలయం త్రిపురాంత కేశ్వరస్వామి వారి ఆలయం. శ్రీశైల ద్వారాలలో ప్రథమం, ప్రధానమైనదిగా ఉన్న ఈ క్షేత్రం శ్రీశైల క్షేత్రానికి తూర్పుద్వారంగా విరాజిల్లుతోంది. శ్రీశైల భ్రమరాంబిక అమ్మవారికి అధిష్ఠాన దేవత అయిన బాలాత్రిపురసుందరి కూడా ఈ క్షేత్రంలోనే కొలువుదీరి ఉంది.

కుమారగిరి పర్వతంపై ఉన్న ఈ ఆలయం ప్రకృతి అందాలకు, ప్రశాంతతకు నెలవు. ఈ ఆలయాన్ని చేరుకోవడానికి మెట్లతోపాటు ఘాట్‌రోడ్డు సదుపాయం ఉంది. ఆలయానికి వెళ్లే మార్గంలో వందలకొద్దీ శివలింగాలు దర్శనమిచ్చి ఇది భూలోక కైలాసమా అనే అనుభూతిని భక్తులకు కలిగిస్తాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ ఆలయం శ్రీచక్రంపై నిర్మితమైంది. మది పులకించే సుందర మండపాలు, శిల్పాలు, మందిరాలతో ఈ ఆలయం అలరారుతుంది.

పురాణగాథ: విఘ్నేశ్వరునికి విఘ్నాధిపత్యం ఇచ్చిన తర్వాత కుమారస్వామి మనసు కలతచెంది కైలాసం వీడాడని, అలా కైలాసం వీడిన కుమారస్వామి త్రిపురాంతకానికి సమీపం లో గల కొండపై తపస్సు చేశాడట. అతని తపస్సుకు మెచ్చిన పార్వతీపరమేశ్వరులు ఆనాటినుంచి అక్కడ కొలువై ఉంటామని వరమిచ్చారని ఇక్కడ స్థలపురాణ కథనం. దీనివల్లే ఈ క్షేత్రానికి కుమారగిరి అని పేరు వచ్చినట్టు తెలుస్తుంది.

త్రిపురాసుర సంహారం జరిగిన క్షేత్రం
త్రిపురాసుర సంహారం ఈ క్షేత్రంలోనే జరగడంవల్ల దీనికి త్రిపురాంతకమనే పేరు వచ్చింది.  త్రిపురాంతకం సిద్ధ క్షేత్రం. అనేక యోగులు, సిద్ధులు తాంత్రికులకు ఆవాస భూమిగా ఉన్నది ఈ క్షేత్రం. అలాంటి మహిమగల ఈ దేవాలయ ధ్వజస్తంభాన్ని చూసినా పాపాలు పటాపంచలౌతాయని, త్రిపురాంతక నామ స్మరణం ముక్తిదాయకం అనిపార్వతీదేవికి స్వయంగా ఆ పరమ శివుడే చెప్పాడని అంటారు. ఇక్కడ కొలువుదీరిన మహాదేవుడు త్రిపురాంతకేశ్వరస్వామిగా నీరాజనాలను అందుకుంటున్నాడు. అణువణువు శివ నామస్మరణంతో మారుమోగే ఈ ఆలయ గర్భాలయంలో త్రిపురాంతకేశ్వరస్వామి లింగరూపంలో దర్శనమిస్తాడు.

నాలుగు వైపులా నాలుగు ప్రధాన ద్వారాలు
ఈ ఆలయానికి నాలుగు వైపులా నాలుగు ప్రధాన ద్వారాలున్నాయి. నాలుగు వైపులా కొండ పైకి మెట్ల మార్గాలున్నాయి. ప్రధానాలయం శ్రీ చక్రాకారంలో నిర్మించబడింది. శివాలయం ఈ ఆకారంలో నిర్మించటం చాలా అరుదు. అలాంటి అరుదైన దేవాలయం ఇది. శ్రీ చక్రం శివ యోర్వపుః’’అంటే శివపార్వతుల శరీరమే శ్రీ చక్రం. స్వామి ఉగ్రరూపం కనుక తూర్పుగ్రామాలు తగలబడి పోయాయట. అందుకే ఆ ద్వారాన్ని మూసేశారు. పక్కగా ఉన్న దారిగుండా వెళ్లి దర్శనం చేసుకోవాలి. అమ్మవారు పార్వతీమాత. ఆలయ ప్రాంగణంలో అపరాధీశ్వర స్వామి, లక్ష్మీ చెన్నకేశవస్వామి, చంద్రమౌళీశ్వరస్వామి, కుమారస్వామి, నగరేశ్వర స్వామి మందిరాలు దర్శనమిస్తాయి. 

ఆలయంలో ఒకపక్క అగస్త్య మహాముని నిర్మించాడని చెప్పబడుతున్న బిల్వ మార్గమొకటి ఉంది. దీనిని చీకటిగుహగా పిలుస్తారు. శ్రీశైల క్షేత్రానికి ఈ మార్గంగుండానే వెళ్లేవారని ప్రతీతి. ఇక్కడే ఉన్న మండపంలో అలనాటి శాసనాలు దర్శనమిస్తాయి. ఇక్కడే మరోపక్క గణపతి మండపం ఉంది. దీనికి సమీపంలోనే నవగ్రహాలయం ఉంది. ఇంకా ఈ ఆలయంలో విఘ్నేశ్వరుడు, కుమారస్వామి, శృంగి, భృంగి, నందీశ్వరుడితోపాటు అనేక శివలింగాలు దర్శనమిస్తాయి.

బాలా త్రిపుర సుందరీ ఆలయం
త్రిపురాంతకేశ్వరస్వామి వారి ఆలయానికి కింద చెరువులో బాలాత్రిపురసుందరి మాత ఆలయం ఉంది. బాల త్రిపుర సుందరి అమ్మవారి ఆలయానికి వెళ్లే మార్గంలో వృశ్చికేశ్వరాలయం, ΄ాపనాశనం దర్శనమిస్తాయి. ఇవి దాదాపు శిథిలావస్థకు చేరుకున్నాయి. వీటికి కొంచెం ముందుకు వెళితే కదంబ వనం ఉంది. ఉజ్జయిని, కోల్‌కతా, కాశీలలో తప్ప మరెక్కడా ఈ కదంబ వృక్షాలు కనిపించవని చెబుతారు. అమ్మవారు కదంబ వనవాసిని కావడంవల్లనే ఇక్కడిలా కదంబవనం ఉందని భక్తులు చెబుతారు.త్రిపురాసుర సంహారంలో త్రిలోచనునికి వింటికి (విల్లు) త్రిపురసుందరి ధనువై రాక్షస సంహారం చేసింది. అక్కడే ఆదిపరాశక్తి అనుగ్రహం కొరకు చేసిన చిదగ్ని హోమగుండంలో, బాలత్రిపుర సుందరి అంతర్లీనం కావడం జరిగింది.

శివతేజోమయం త్రిపురాంతక క్షేత్రం
ఈ క్షేత్రాన్ని సందర్శించి అమ్మవారిని, స్వామివారిని పూజిస్తే సకలైశ్వర్యాలు సిద్ధించడమే కాకుండా శివ కైవల్య  ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. భూలోక కైలాసంగా పేరుగాంచిన ఈ క్షేత్రంలో కోటికి పైగా శివలింగాలు, నూటికి పైగా జలాశయాలున్నాయని చెబుతారు. ప్రతి సోమ, శుక్రవారాలలో విశేష ఉత్సవాలు మహా శివరాత్రి నాడు కల్యాణోత్సవం వసంత నవరాత్రులు, శరన్నవరాత్రులు శ్రావణ మాసంలోప్రత్యేక ఉత్సవాలు కార్తీకంలో అభిషేకాలు సంతర్పణలు జరుగుతాయి.

ఎక్కడ ఉంది: ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు నుండి మార్కాపురం మీదుగా అలాగే గుంటూరు నుండి శ్రీశైలం వెళ్లు మార్గంలో ఈ త్రిపురాంతకం వెళ్లవచ్చును. 
– డి.వి.ఆర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement