శ్రీనగర్‌ టూర్‌..! మంచుతోటలో చందమామ కథ | Top Attractions in Srinagar: Must Visit Places And Irctc Tour Packages | Sakshi
Sakshi News home page

శ్రీనగర్‌ టూర్‌..! మంచుతోటలో చందమామ కథ

Sep 8 2025 10:12 AM | Updated on Sep 8 2025 10:12 AM

Top Attractions in Srinagar: Must Visit Places And Irctc Tour Packages

ఆది శంకరుడు సౌందర్యలహరి రాసిన చోటు. రాజతరంగిణిలో కల్హణుడు చెప్పిన కథనాల నేల. సోన్‌మార్గ్‌ మంచు మీద వెండి వెన్నెల విహారం. గుల్‌మార్గ్‌ కేబుల్‌ కార్‌లో విహంగ వీక్షణం. పహల్‌గామ్‌ కుంకుమ పువ్వు తోటల ప్రయాణం. ఐదు వేల అడుగుల ఎత్తులోదాల్‌ లేక్‌ శికార్‌ రైడ్‌.
నీటి మీద నడిచే రాజమందిరం హౌస్‌బోట్‌ స్టే. షాలిమార్‌ గార్డెన్స్‌లో గిలిగింతల పర్యాటకం. ఆరు రోజుల్లో వీటన్నింటినీ చూపించే టూర్‌ ఇది.

1వ రోజు
హైదరాబాద్‌ నుంచి మధ్యాహ్నం 14.40 గంటలకు 6ఈ–6253 విమానంలో శ్రీనగర్‌కి ప్రయాణం. సాయంత్రం 17.40 గంటలకు విమానం శ్రీనగర్‌కు చేరుతుంది. శ్రీనగర్‌ ఎయిర్‌΄ోర్టులో టూర్‌ నిర్వహకులు రిసీవ్‌ చేసుకుంటారు. హోటల్‌లో చెక్‌ ఇన్‌ తర్వాత సాయంత్రం ఫ్రీ టైమ్‌. పర్యాటకులు ఎవరికి వారు సిటీలో నచ్చిన ప్రదేశంలో విహరించవచ్చు. రాత్రి బస శ్రీనగర్‌లో.

2వ రోజు
బ్రేక్‌ఫాస్ట్‌ తర్వాత శ్రీనగర్‌ నుంచి టూరిస్ట్‌ బస్సులో సోన్‌మార్గ్‌కు ప్రయాణం. సోన్‌మార్గ్‌ పర్యటన పూర్తి చేసుకుని సాయంత్రానికి తిరిగి శ్రీనగర్‌కు రావాలి. రాత్రి బస శ్రీనగర్‌లో. సోన్‌మార్గ్‌కు చేరిన తర్వాత టూరిస్ట్‌ బస్‌ ఒక పాయింట్‌లో ఆగుతుంది. పర్యాటకులు బస్సు దిగి స్థానికంగా ఉన్న పోనీ (చిన్న గుర్రం)లను సొంత ఖర్చుతో అద్దెకు తీసుకుని పర్యటించాలి.

వెండి వెన్నెల
సోనామార్గ్‌కు రోడ్డు మార్గంలో ప్రయాణం ఆద్యంతం కళ్లు మిరుమిట్లు గొలుపుతుంది. శ్రీనగర్‌ నుంచి 80 కిలోమీటర్ల దూరాన ఉంది సోనామార్గ్‌. ఈ ప్రదేశం తొమ్మిది వేల అడుగుల ఎత్తులో ఉంది. కొండల మీద తెల్లటి మంచు పొడి పొడిగా పై నుంచి బియ్యప్పిండి పోసినట్లు ఉంటుంది. మంచు మీద పడిన సూర్యుడి కిరణాలు సప్తవర్ణాలను ప్రతిఫలిస్తుంటాయి. మంచు మీద వెండి వెన్నెల విన్యాసాలు కనువిందు చేస్తాయి. 

ఈ పర్యటనకు మే నుంచి అక్టోబర్‌ వరకు వెళ్లగలం. శీతాకాలంలో మంచు కురుస్తుంటుంది. తజివాస్‌ గ్లేసియర్‌ శీతాకాలంలో గడ్డకట్టి వేసవి కాలంలో కరిగి ప్రవహిస్తుంది. సోనామార్గ్‌ నుంచి ఈ ప్రదేశానికి పోనీల మీద వెళ్లవచ్చు. ఇక్కడ ట్రెకింగ్‌ చేయవచ్చు. పోనీలు నడిపే వాళ్లను అడిగితే జల΄ాతాల దగ్గరకు కూడా తీసుకువెళ్తారు.

3వ రోజు
బ్రేక్‌ఫాస్ట్‌ తర్వాత శ్రీనగర్‌ నుంచి గుల్‌మార్గ్‌కు ప్రయాణం. గుల్‌మార్గ్‌లో గోండాలా కేబుల్‌ కార్‌ రైడ్‌ టికెట్‌లను పర్యాటకులు ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవాలి. ఆసక్కి ఉన్న వారు గుల్‌మార్గ్‌ నుంచి కిలాన్‌మార్గ్‌కు కి ట్రెక్కింగ్‌ చేయవచ్చు. సాయంత్రం టూరిస్ట్‌ బస్‌ గుల్‌మార్గ్‌ నుంచి శ్రీనగర్‌కు బయలుదేరుతుంది. రాత్రి బస శ్రీనగర్‌లో.

గుల్‌మార్గ్‌ మంచు తివాచీ
గుల్‌మార్గ్‌ పెద్ద స్కీయింగ్‌ స్పాట్‌. శ్రీనగర్‌ నుంచి 50 కిమీల దూరాన ఉంది. మంచు అంటే అలా ఇలా కాదు, అర అడుగు మందంలో తెల్లటి తివాచీ పరిచినట్లు ఉంటుంది. ఇక్కడ గోండాలా కేబుల్‌ కార్‌లో ప్రయాణిస్తూ విహంగ వీక్షణం చేయవచ్చు. కిందకు చూస్తే తెల్లగా పరుచుకున్న మందపాటి మంచు మిలమిల మెరుస్తూ ఉంటుంది. స్కీయింగ్‌లో నిష్ణాతులు కాకపోయినప్పటికీ హెల్పర్స్‌ సహాయంతో ప్రయత్నం చేయవచ్చు. ఇక్కడ మహారాణి టెంపుల్, సెయింట్‌ మేరీస్‌ చర్చ్‌ ఉన్నాయి. 

గుల్‌మార్గ్‌ ప్రాచీన నామం గౌరీమార్గ్‌. గౌరీదేవి మార్గంగా పిలిచేవారు. మొఘల్‌ పాలకుడు జహంగీర్‌ ఇక్కడ పూలతోటలను పెంచడంతో గుల్‌మార్గ్‌గా వాడుకలోకి వచ్చింది. ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్న గోల్ఫ్‌ కోర్స్, స్కీ జోన్‌ వంటి ఆధునిక సౌకర్యాలన్నీ బ్రిటిష్‌ పాలకులు ఏర్పాటు చేసినవే. వారు ఈ ప్రదేశాన్ని వేసవి విడిదిగా, విహార కేంద్రంగా ఆస్వాదించేవాళ్లు. గుల్‌మార్గ్‌ ఎనిమిది వేలకు పైగా అడుగుల ఎత్తులో ఉంది. 

అక్కడి నుంచి కేబుల్‌ కార్‌లో దాదాపు 14 వేల అడుగుల ఎత్తున్న మౌంట్‌ అఫర్వాత్‌ శిఖరానికి చేరడం ఓ గిలిగింత. ఇక్కడ పర్యటిస్తున్నప్పుడు చిన్నప్పుడెప్పుడో చూసిన హిందీ సినిమాలు గుర్తుకు వస్తే మీ జ్ఞాపకశక్తికి సలామ్‌ చేయాలి. ఎందుకంటే ఇక్కడ డింపుల్‌ కపాడియా, రిషీకపూర్‌ నటించిన సూపర్‌ డూపర్‌ హిట్‌ సినిమా ‘బాబీ’ చిత్రీకరణ ఇక్కడే జరిగింది. 

ఇంకా అనేక బాలీవుడ్‌ సినిమాలు ఈ లొకేషన్‌లో విజువల్‌ రిచ్‌నెస్‌ని ఉపయోగించుకున్నాయి. గుల్‌మార్గ్‌లో మరో వింత ఇగ్లూ కేఫ్‌. ఇగ్లూ అంటే మంచు ఖండంలో మంచుతో కట్టే ఇల్లు. ఇగ్లూ రెస్టారెంట్‌లో భోజనం చేసిన అనుభూతిని సొంతం చేసుకోవచ్చు. భోజన సమయం కాక΄ోతే ఇగ్లూ కేఫ్‌లో కాఫీ, టీ తాగడం మరిచి΄ోవద్దు.

4వ రోజు
బ్రేక్‌ఫాస్ట్‌ తర్వాత శ్రీనగర్‌ నుంచి పహల్‌గామ్‌కు ప్రయాణం. పహల్‌గామ్‌లో టూరిస్ట్‌ బస్‌ దిగిన తర్వాత సొంత ఖర్చులతో ప్రైవేట్‌ జీపులు, పోనీలతో పగలంతా పహల్‌గామ్‌ పర్యటన పూర్తి చేసుకోవాలి. సాయంత్రం బస్‌ హోటల్‌కు బయలుదేరుతుంది. హోటల్‌లో చెక్‌ ఇన్‌. రాత్రి బస పహల్‌గామ్‌లో.

స్విస్‌ కాదు ఇండియానే!
పహల్‌గామ్‌కు పర్యాటక ప్రాధాన్యం మాత్రమే కాదు, ప్రాచీన పౌరాణిక ప్రాధాన్యత కూడా ఉంది. శివుడు తన వాహనం నందిని ఇక్కడ వదిలాడని కథనం. ఇక్కడ ఉన్న లిద్దర్‌ వ్యాలీ, బైసరన్‌ వ్యాలీ, బేతాబ్‌ వ్యాలీ ఆరు వ్యాలీలు ఒకదానిని మించి మరొకటి ప్రకృతి సౌందర్యాన్ని వైవిధ్యతను ఇముడ్చుకున్నాయా అనిపిస్తుంది. స్విట్జర్లాండ్‌లో ఉన్నామా భారత్‌లో ఉన్నామా అనే సందేహం కలుగుతుంది కూడా. 

ఇంత అందమైన ప్రదేశాలు మనదేశంలో ఉండగా ఇక పాశ్చాత్యదేశాల విహారం ఎందుకు... అనిపిస్తుంది. కుంకుమ పువ్వు తోటల మధ్య ప్రయాణం సాగుతుంది. చెట్లు ఎత్తుగా ఆకాశాన్ని తాకడానికే ఎదుగుతున్నట్లుంటాయి. అతి శీతల వాతావరణం కావడంతో కొమ్మలు పక్కలకు విస్తరించవు. చెట్ల ఆకుల మీద ముగ్గు చల్లినట్లు మంచు రేణువులు వాలి ఉంటాయి. సూర్యకిరణాలకు ఆవిరవుతూ సాయంత్రం నుంచి మళ్లీ కొత్త మంచు చేరుతూ ఉంటుంది. 

పహల్‌గామ్‌లో పర్యటిస్తున్నప్పుడు ఇదేదో సినిమాలో చూసిన ప్రదేశంలా ఉందేంటబ్బా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ అనేక సినిమాల చిత్రీకరణ జరుగుతుంది. అరువ్యాలీ, బేతాబ్‌ వ్యాలీ, చందన్‌వారీ వ్యాలీలను చూడవచ్చు. లిద్దర్‌ వ్యాలీలో గోల్ఫ్‌ కోర్స్‌ ఉంది. ఆడే సమయం లేక΄ోయినా చూసి రావచ్చు. ఇదంతా చదివిన తర్వాత మీకు ఒక విషయం గుర్తుకు వచ్చి ఉండాలి. అదే... పహల్‌గామ్, బైసరన్‌ వ్యాలీ. 

ఈ రెండు పదాలకు కలిపి చదువుకుంటే ఏప్రిల్‌లో టీఆర్‌ఎఫ్‌ ఉగ్రదాడి గుర్తుకు వస్తుంది. 28 మంది అమాయక పర్యాటకులను పొట్టన పెట్టుకున్న సంఘటన కళ్ల ముందు మెదలుతుంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు పూర్తిగా చక్కబడ్డాయి. బందోబస్తు కూడా పటిష్టంగా ఉంది.

5వ రోజు
బ్రేక్‌ఫాస్ట్‌ తర్వాత పహల్‌గామ్‌ నుంచి శ్రీనగర్‌కు ప్రయాణం. శంకరాచార్య ఆలయ దర్శనం. సాయంత్రం దాల్‌ లేక్‌లో శికారా రైడ్, దాల్‌ లేక్‌ అలల మీద సూర్యాస్తమయాన్ని ఆస్వాదించడం, ఫ్లోటింగ్‌ గార్డెన్స్‌ మధ్య విహారం, సాయంత్రం హౌస్‌బోట్‌లో చెక్‌ ఇన్‌. రాత్రి భోజనం, బస హౌస్‌బోట్‌లో.

కల్హణుడు చెప్పాడు 
ఇది శంకరాచార్య టెంపుల్‌గా వ్యవహారంలోకి వచ్చింది, కానీ ఇక్కడ పూజలందుకునే దేవుడు శివుడు. ఆది శంకరాచార్యుడు భారతదేశ పర్యటనలో భాగంగా ఇక్కడికి వచ్చాడని చెబుతారు. అంతే కాదు సౌందర్యలహరిని ఇక్కడే రాశాడని కూడా చెబుతారు. రాజతరంగిణి గ్రంథంలో కల్హణుడు ఈ ఆలయం గురించి అనేక విషయాలను పొందుపరిచాడు. శ్రీనగర్‌ అంతటినీ ఓ పది నిమిషాల్లో చూడాలంటే ఆది శంకరాచార్య ఆలయమే రైట్‌ పాయింట్‌. ఇక్కడి నుంచి చూస్తే దాల్‌ లేక్, జీలం నది, హరిపర్బత్‌ వంటి ముఖ్యమైన ప్రదేశాలన్నీ కనిపిస్తాయి.

ఐదు వేల అడుగుల ఎత్తులో శికారా రైడ్‌
శికారా అంటే పై కప్పు ఉన్న చెక్కతో చేసిన పడవ. ఈ సరస్సు ఐదు వేల అడుగుల ఎత్తులో ఉంది. దాల్‌ లేక్‌లో శికారా రైడ్‌ ఒక మధురానుభూతి. శీతాకాలంలో నీరు గడ్డకడుతుంది. దాల్‌లేక్‌ నీరు మరీ ఎక్కువగా గడ్డకట్టినప్పుడు ఆ మంచు మీద వాహనాలను నడపడం, క్రికెట్‌ ఆడడం వంటి సరదాలు చేస్తుంటారు. అయితే ఏటా ఈ స్థాయిలో నీరు గడ్డకట్టదు. శికారాతోపాటు హౌస్‌బోట్‌ విహారం, బస కూడా ఎక్స్‌పీరియెన్స్‌ చేసి తీరాలి. 

విదేశీ పర్యాటకులను ఆకట్టుకోవడం కోసం హౌస్‌బోట్‌లకు హాలీవుడ్, యంగ్‌ హాలీవుడ్, క్వీన్స్‌ లాప్‌ వంటి పేర్లు పెడతారు. ఈ హౌస్‌బోట్‌లు ఏదో రాత్రి బస కోసం చేసిన చిన్న ఏర్పాటులా ఉండదు. రాజమందిరంలాగ ఉంటుంది.  నీటి మీద తేలుతున్న రాజభవనంలో బస చేసినట్లు ఉంటుంది. దాల్‌ లేక్‌లో ఫ్లోటింగ్‌ గార్డెన్స్‌ మాత్రమే కాదు ఫ్లోటింగ్‌ ఏటీఎమ్‌ కూడా ఉంది. ఫ్యాబ్రికేటెడ్‌ వాల్స్‌తో చేసిన గదిలో ఎస్‌బీఐ ఏటీఎమ్‌ సెంటర్‌ నిర్వహిస్తోంది. 

ఇక్కడ పర్యటిస్తుంటే ఆమ్‌స్టర్‌డామ్‌లోని ఫ్లోటింగ్‌ ఫ్లవర్‌ మార్కెట్‌లో విహరిస్తున్నట్లు ఉంటుంది. కశ్మీర్‌ను ప్యారడైజ్‌ ఆన్‌ ఎర్త్‌ అని ఎందుకంటారో ఇక్కడ విహరిస్తే అవగతమవుతుంది. కేరళలో బోట్‌హౌస్‌లో బస, విహారం చేసిన వాళ్లు శ్రీనగర్‌ హౌస్‌బోట్‌ కూడా అలాగే ఉంటుందని లైట్‌ తీసుకోవద్దు. దేనికదే ప్రత్యేకమైన అనుభూతి.

6వరోజు
ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ తర్వాత హౌస్‌బోట్‌ చెక్‌ అవుట్‌ చేయాలి. మొఘల్‌ గార్డెన్స్, బొటానికల్‌ గార్డెన్స్, షాలిమార్‌ గార్డెన్స్‌ సందర్శనం తర్వాత శ్రీనగర్‌ ఎయిర్‌΄ోర్టుకు చేర్చి, టూర్‌ నిర్వహకులు వీడ్కోలు పలుకుతారు. సాయంత్రం 18.20 గంటలకు 6ఈ– 6255 విమానంలో శ్రీనగర్‌ నుంచి ప్రయాణం, ఈ విమానం రాత్రి 21.20 గంటలకు హైదరాబాద్‌కు చేరుతుంది.

ఉద్యావనాల కశ్మీరం
కశ్మీర్‌లోని మొఘల్‌ గార్డెన్స్‌ ఆరు చోట్ల ఉన్నాయి. ఇవన్నీ నిజానికి మొఘలులు మనదేశంలోకి రావడానికి రెండు వందల ఏళ్ల ముందు నుంచే ఉన్నాయి. పర్షియా నుంచి కశ్మీర్‌కు వచ్చిన పాలకులు, పర్షియన్‌ ప్రభావం ఉన్న పరిసర ప్రదేశాల పాలకులు ఇక్కడ చక్కటి ఉద్యానవనాలను ఏర్పాటు చేశారు. నిషాద్‌ బాగ్, షాలిమార్‌ బాగ్, అచల్బాల్‌ బాగ్, చష్మా షాహీ,  పరి మహల్, వెరినాగ్‌ అలా ఏర్పడినవే. 

మొఘలులు మనదేశానికి వచ్చిన తర్వాత అక్బర్, జహంగీర్, షాజహాన్‌లు ప్రత్యేక దృష్టి పెట్టి వాటిని అభివృద్ధి చేశారు. అందమైన పూలతోటల మధ్య రాజవంశస్తుల విడిది భవనాలుంటాయి. ఈ గార్డెన్స్‌లో పర్యటన అక్టోబర్‌ నుంచి  పూలు విచ్చుకోవడం మొదలవుతుంది. మార్చి వరకు పూలు సువాసనలు విరజిమ్ముతుంటాయి. నెహ్రూ మెమోరియల్‌ బొటానికల్‌ గార్డెన్‌ను కూడా చక్కగా మెయింటెయిన్‌ చేస్తుంటారు. శీతల పవనాల మధ్య చక్కగా విరిసిన పూలు, మెత్తగా రాలిపడుతున్న పూల రెక్కల మధ్య విహారం లైఫ్‌ టైమ్‌ ఎక్స్‌పీరియెన్స్‌ అనే చె΄్పాలి.

శ్రీనగర్‌ టూర్‌ ప్యాకేజ్‌

  • ప్యాకేజ్‌ పేరు ‘మిస్టికల్‌ కశ్మీర్‌ ఎక్స్‌ హైదరాబాద్‌’. ప్యాకేజ్‌ కోడ్‌ ఎస్‌హెచ్‌ఏ11. ఇది ఆరు రోజుల టూర్‌. హైదరాబాద్‌ నుంచి మొదలై హైదరాబాద్‌కు చేరడంతో పూర్తయ్యే ఈ టూర్‌లో కశ్మీర్‌లోని శ్రీనగర్, గుల్‌మార్గ్, సోన్‌మార్గ్, పహల్గామ్‌ కవర్‌ అవుతాయి.

  • ఈ పర్యటనలు అక్టోబర్‌ ఆరవ తేదీన మరియు నవంబర్‌ 13వ తేదీన మొదలవుతాయి. ఎవరికి సాధ్యమైన ట్రిప్‌లో వారు బుక్‌ చేసుకోవచ్చు. 

  • ప్యాకేజ్‌ ధరలిలాగ ఉన్నాయి. సింగిల్‌ ఆక్యుపెన్సీలో 45,100 రూపాయలు, డబుల్‌ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి 34,950, ట్రిపుల్‌ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి 33,510 రూపాయలు. 

  • ప్యాకేజ్‌లో... విమానం టికెట్‌లు, నాలుగు రోజులు హోటల్‌ బస, ఒక రోజు హౌస్‌బోట్‌లో బస, బ్రేక్‌ఫాస్ట్‌లు, రాత్రి భోజనాలు, ఐటెనరీలో సూచించిన ప్రదేశాలకు రవాణా, టూర్‌ ఎస్కార్ట్‌ సౌకర్యం, ట్రావెల్‌ ఇన్సూరెన్స్, టోల్‌ ఫీజులు, పార్కింగ్‌ ఫీజు, పన్నులు వర్తిస్తాయి. 

  • పర్యాటక ప్రదేశాల ఎంట్రీ ఫీజులు, మధ్యాహ్న భోజనాలు, ఇంటి నుంచి ఎయిర్‌పోర్టుకు రవాణా, విమానంలో కొనుక్కునే ఆహారపదార్థాలు– డ్రింకులు, పర్యాటక ప్రదేశాల్లో లోకల్‌ రవాణా, రైడ్‌ల ఖర్చులు ప్యాకేజ్‌లో వర్తించవు. పర్యాటకులు విడిగా భరించాలి.

  • గోండాలా కేబుల్‌ కార్‌ బుక్‌ చేసుకోవడానికి లింక్‌:https://www.jammukashmircablecar.com

వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి 

(చదవండి: యోగాతో ఇంత మార్పు..! ఏడాదికే ఏకంగా 83 కిలోల బరువు మాయం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement