Sunitha Krishnan: దయచేసి మారండి!

Sunitha Krishnan Prajwala Foundation Woman Empowerment Naa Bangaaru Talli - Sakshi

మహిళల అక్రమ రవాణా... ప్రభుత్వాలకు పెద్ద సవాల్‌. సమాజానికి తలవంపులు. బాధిత మహిళకు విషమ పరీక్ష. మహిళల రక్షణ ఆమె ఆకాంక్ష. తనకు తెలిసిన మార్గం పోరాటమే. పోరాటం... పోరాటం... పోరాటం. అసాంఘిక శక్తులతో పోరాటం. సామాజిక పరిస్థితులతో పోరాటం. మనసు మారితే సమాజం మారుతుంది. ఇప్పుడు ఆ మార్పు కోసం అభ్యర్థిస్తోంది. 

సునీతాకృష్ణన్‌ ‘నా బంగారు తల్లి’ సినిమా తీసి దాదాపుగా దశాబ్దమవుతోంది. మహిళలను మోసగించి అక్రమ రవాణాకు పాల్పడే దుర్మార్గాన్ని ఆ సినిమాలో కళ్లకు కట్టారు సునీతా కృష్ణన్, ఆమె భర్త రాజేశ్‌ టచ్‌రివర్‌. ప్రతి సన్నివేశమూ వాస్తవానికి అద్దం పట్టింది. సినిమా క్లైమాక్స్‌ దృశ్యాలు కన్నీటి పర్యంతం చేస్తాయి, మనసు ద్రవించిపోతుంది. సమాజంలో మహిళ ఎదుర్కొనే దాష్టీకాలకు మౌనంగా రోదిస్తూ బయటకు వస్తారు ప్రేక్షకులు. వాస్తవ సంఘటన ఆధారంగా తెరకెక్కిన చిత్రం అది.

ఆ సందర్భంగా నిర్మాత సునీతా కృష్ణన్‌ మాట్లాడుతూ ‘‘1996లో ప్రజ్వల ఫౌండేషన్‌ ప్రారంభించినప్పటి నుంచి పోరాడుతున్నాను. అంతకంటే ముందు ప్రజ్వల వంటి ఫౌండేషన్‌ అవసరం ఉందని గ్రహించే వరకు నేను గుర్తించిన సామాజికాంశాలన్నింటి మీదా పోరాడాను. ‘స్త్రీ అంగడి సరుకు కాదు, దేహం మీద దాడి చేస్తే ఆమె మనసు ఎంతగా రోదిస్తుందో ఆలోచించండి’ అని గొంతుచించుకుని చెప్తున్నాను. నా ఉద్యమం సమాజంలో ప్రతి ఒక్కరినీ చేరాలంటే, ఏకకాలంలో ఎక్కువమందిని సెన్సిటైజ్‌ చేయాలంటే ప్రభావవంతమైన మాధ్యమం అవసరం అనిపించింది. అందుకే సినిమా తీశాను. ఈ చిత్రాన్ని చూసిన తర్వాత ఎవరైనా కనీసం ఒక్క క్షణమైనా ఆలోచించకపోతారా, స్త్రీ దేహాన్ని మాత్రమే కాంక్షించే మగవాళ్లకు తమ ఇళ్లలో ఉండే ఆడబిడ్డలు కళ్ల ముందు మెదలకపోతారా’ అనేది మా ఆశ.

నేను యాక్టివిస్ట్‌ని, నా భర్త సినిమా దర్శకుడు కావడంతో మా ఆలోచన అనుకున్నది అనుకున్నట్లే కార్యరూపం దాల్చింది. ఎటువంటి సినిమాటిక్‌ లిబర్టీ తీసుకోకుండా, కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ లేకుండా చిత్రించాం’’ అని చెప్పారామె. ఆమె సామాజిక సేవను గుర్తించిన భారత ప్రభుత్వం 2016లో పద్మశ్రీతో సత్కరించింది. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వైఎస్సార్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు (మహిళాసాధికారత విభాగం)కు ఎంపిక చేసింది. ఈ సందర్భంగా ఆమె సాక్షితో పంచుకున్న అనుభవాలివి. 
 
ఎక్కడ ఉన్నా పోరాటమే! 
‘‘నేను బెంగళూరులో పుట్టిన మలయాళీని. నేను పుట్టిన నెలరోజులకే మా నాన్నకు హైదరాబాద్‌కు బదిలీ అయింది. నా బాల్యం మూడేళ్లు ఇక్కడే గడిచింది. నేను మహిళల కోసం పని చేయడానికి హైదరాబాద్‌ను ఎంచుకోవడం అనుకోకుండా జరిగింది. బెంగళూరులో స్టూడెంట్‌గా నేను ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనేదాన్ని. స్త్రీ దేహం కాస్మటిక్‌ కంపెనీల నిబంధనల చట్రంలో ఇమడాలనే భావనను వ్యతిరేకించాను. స్త్రీ దేహం ఫలానా కొలతల్లో ఉంటేనే అందం అని ఒకరు నిర్ణయించడమేంటి, ఆ మాయలో చిక్కుకుని అమ్మాయిలు తమ దేహాన్ని నియంత్రించుకోవడానికి తంటాలు పడడం ఏమిటి? అని... స్త్రీ దేహాన్ని మార్కెట్‌ వస్తువుగా పరిగణించే ధోరణిని నిరసిస్తూ అందాల పోటీల నిర్వహణను అడ్డుకుని రెండు నెలలు జైల్లో ఉన్నాను. అప్పుడు నాకు ఇరవై రెండేళ్లు.

నేను ఉద్యమించి జైలుకెళ్లడాన్ని మా ఇంట్లో సమ్మతించలేకపోయారు. అలా ఇల్లు వదిలి వచ్చేశాను. ఎక్కడికెళ్లాలో తెలియదు. రైల్వే స్టేషన్‌కెళ్లి కౌంటర్‌లో ఎటువెళ్లే రైళ్లున్నాయని అడిగాను. వాళ్లు చెప్పిన పేర్లలో ‘హైదరాబాద్‌’ వినిపించగానే ‘టికెట్‌ ఇవ్వండి’ అనేశాను. అలా హైదరాబాద్, చాదర్‌ఘాట్‌లో నివసిస్తున్న ఓ మిత్రురాలింటికి వచ్చాను. ఇక్కడ కూడా ఉద్యమించాల్సిన అవసరం వచ్చింది. అప్పుడు మూసీ నది తీరాన్ని ‘నందనవనం’గా మార్చాలని ప్రభుత్వం అక్కడి ఇళ్లను ఖాళీ చేయించాలని  నిర్ణయం తీసుకుంది. ‘పునరావాసం కల్పించిన తర్వాత మాత్రమే మా ఇళ్లను కూలగొట్టండి’ అంటూ రోడ్డెక్కాను.

ఆ తర్వాత హైదరాబాద్‌లో ‘మెహబూబ్‌ కీ మెహందీ’లో నివసిస్తున్న వారిని తొలగించే ప్రయత్నం జరిగింది. ఆ మహిళల కోసం ఏదైనా చేయాలని పూర్తిస్థాయిలో రంగంలోకి దిగాను. లైంగికహింస, అక్రమ రవాణాలకు గురయ్యి జైళ్లు, హోమ్‌లలో ఉన్న మహిళలను కలిశాను. వాళ్లలో చాలామంది తమ పిల్లలకు భవిష్యత్తు ఇవ్వమని కోరారు. అలా ఐదుగురు పిల్లలతో స్కూలు ప్రారంభించాను. ఆ తర్వాత పదిమంది పిల్లలతో షెల్టర్‌ హోమ్‌ పెట్టాను. అలా మొదలైన చిన్న ప్రయత్నం ఇప్పుడు పదిహేడు ట్రాన్సిషన్‌ సెంటర్‌లలో ఏడు వందల మంది పిల్లలు చదువుకునేంతగా పరిణమించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు పన్నెండు వేల మంది చదువుకుని గౌరవప్రదమైన జీవితాల్లో స్థిరపడ్డారు.  

ఈ ఫౌండేషన్‌ అవసరం ఉండకూడదు! 
ఆడపిల్లల అక్రమ రవాణాదారులు ఒక అమ్మాయిని తీసుకువచ్చినట్లు సమాచారం అందగానే దూకుడుగా వెళ్లిపోయేదాన్ని. అడ్డువచ్చిన వాళ్లతో బాహాబాహీకి దిగి మరీ ఆడపిల్లలను బయటకు తీసుకువచ్చేదాన్ని. అలా లెక్కలేనన్నిసార్లు నా మీద దాడులు జరిగాయి. చెవి మీద తగిలిన దెబ్బ కారణంగా వినికిడి కూడా తగ్గింది. ఆ దాడులను పట్టించుకోలేదు. కానీ నా అనుచరుడిని హత్య చేశారు. అప్పుడు నా పంథా మార్చుకుని పోలీస్, మహిళా సంక్షేమశాఖల వంటి ప్రభుత్వ వ్యవస్థలతో కలిసి పని చేయడం మొదలుపెట్టాను. ఇప్పటికి 96 వేల మంది బాలికలు, యువతులు, మహిళలను రక్షించగలిగాను. ఆ నంబరు ఇంత పెద్దదిగా ఉన్నందుకు గర్వపడడం కాదు మనం సిగ్గుపడాలి. స్త్రీల రక్షణ కోసం ప్రజ్వల ఫౌండేషన్‌ ప్రారంభించాను. సమాజంలో స్త్రీల అక్రమ రవాణా పూర్తిగా అంతరించిపోవాలి. నేను బతికి ఉండగానే ఈ ఫౌండేషన్‌ను మూసివేయాలనేది నా ఆకాంక్ష. సమాజంలో సున్నితత్వం పెరిగి, మంచి మార్పు రావాలని అందరం ఆశిద్దాం. 
– సునీతాకృష్ణన్, సామాజిక ఉద్యమకారిణి 

మగవాళ్లకు చెప్పాలి! 
నా బంగారు తల్లి సినిమాతో సమాజాన్ని ఆలోచింపచేయగలిగాను. ఆ సినిమాకి మూడు నేషనల్‌ అవార్డులు వచ్చాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీ నాలుగు నంది అవార్డులు ప్రకటించింది. ఇప్పుడు మగవారి మీద దృష్టి పెట్టాను. ఆడవాళ్ల మీద జరిగే దాడులను, మోసాలను అరికట్టడానికి భుజబలం ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనం కంటే మగవాళ్లను చైతన్యవంతం చేయడం వల్ల మంచి ఫలితాలు సాధించవచ్చనిపించింది. అందుకే ఇప్పుడు ‘మ్యాన్‌ అగెనెస్ట్‌ డిమాండ్‌ (మ్యాడ్‌)’ నినాదంతో ముందుకు వెళ్తున్నాను.

‘మీ లైంగిక అవసరాలకు ఇతర స్త్రీలను కోరుకోవడం మానేయండి, మీలో ఈ మార్పు వస్తే స్త్రీల అక్రమ రవాణా మాఫియా దానంతట అదే అంతరించిపోతుంది’ అని అభ్యర్థిస్తున్నాను. మనిషిలో సహజంగానే సున్నితత్వం ఉంటుంది. ఆ సున్నితత్వాన్ని పురుషాహంకారంతో అణచివేయకుండా ఉంటే చాలు. మార్పు వచ్చి తీరుతుంది’’ అని తన ఆకాంక్షను వ్యక్తం చేశారు సునీతా కృష్ణన్‌. ఇరవై ఆరేళ్ల తన పోరాటంలో తిరస్కారాలు తప్ప పురస్కారాలు అందలేదని, తన సొంతరాష్ట్రం కేరళలో ప్రభుత్వ పురస్కారం తర్వాత తెలుగు రాష్ట్రాల్లో దక్కిన తొలి గౌరవం ‘వైఎస్సార్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు’ అని సంతోషం వ్యక్తం చేశారామె. 

– వాకా మంజులారెడ్డి 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top