సానబెట్టే సామర్థ్యం, సమరోత్సాహం | Success Mantra: Key points to get Success, check here | Sakshi
Sakshi News home page

Success Mantra : సానబెట్టే సామర్థ్యం, సమరోత్సాహం

Jul 25 2025 10:06 AM | Updated on Jul 25 2025 10:46 AM

Success Mantra: Key points to get Success, check here

రామాయణ, మహాభారత కాలాల నుంచి నేటి దాకా చూస్తున్నాం, తలపెట్టిన పని విజయవంతం కావాలంటే, అర్థ బలం, అంగ బలం, బుద్ధి బలం, సామర్థ్యం మాత్రమే సరిపోవు. వాటికి తోడుగా ఉత్సాహం కావాలి. ఆత్మవిశ్వాసం, సకారాత్మకత, పట్టుదల, బలమైన విజయకాంక్ష– వీటిని కలబోస్తే అది ఉత్సాహం రూపంలో ప్రకటితమౌతుంది.

రామరావణ యుద్ధానికి రామరావణ యుద్ధమే సాటి అన్నట్టు సమరం సాగింది. ప్రత్యర్థులిద్దరూ అన్ని విధాలా సమరంలో సమవుజ్జీలే. ఇద్దరివీ లోకోత్తరమైన బల పరాక్రమాలు. అందుకే యుద్ధం సుదీర్ఘంగా సాగినా, ఎంతకీ ఎటూ తెగలేదు. ప్రత్యర్థులిద్దరూ అలసిపోయారు. చింతాక్రాంతులు కూడా అయ్యారు. ఆ దశలో, యుద్ధం చూసేందుకు దేవతలతో కలిసి వచ్చిన అగస్త్య మహర్షి, యుద్ధ పరిశ్రాంతుడై కూర్చొన్న దాశరథి దగ్గరకు వచ్చాడు. సకల కార్య సిద్ధిప్రదమూ, సర్వశత్రు వినాశకమూ అయిన ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ఉపదేశించాడు. 

అవని జనులకు ప్రత్యక్ష దైవమయిన ఆదిత్యుడిని ఈ స్తోత్రంతో ముమ్మారు స్తుతించి, అందరు దేవతల అనుగ్రహాన్ని పొంది, దైవబలం సమకూర్చుకొమ్మన్నాడు. జయావహమైన ఈ మంత్రం జపించి, స్థైర్య సాహసాలను సంతరించుకొమ్మన్నాడు. ‘ఇప్పుడిక నువ్వు రావణుడిని వధించటం తథ్యం!’ అని తన ఆశీర్వాద బలం కూడా జోడించి, శ్రీరాముడిని ఉత్సాహపరిచి వెళ్ళాడు. ఈ ఘటన యుద్ధాన్ని కీలకమైన మలుపు తిప్పింది. ఇనుమడించిన ఉత్సాహంతో ఈసారి రణరంగంలో ప్రవేశించిన దాశరథి ధాటిని దశకంఠుడు తట్టుకోలేకపోయాడు. వీగిపోయి, విగత జీవుడయ్యాడు. వైదేహీ వల్లభుడినే విజయలక్ష్మి కూడా వరించింది. 

నిరుత్సాహం సమర్థతను నీరు గారుస్తుంది. ఉత్సాహ శక్తి సామర్థ్యాన్ని సాన బట్టి, పదును పెంచుతుంది. అగ్నికి వాయువులా తోడై, ప్రజ్వలింపజేస్తుంది. దైవబలమూ, మహా పురుషుల ఆశీర్వాద బలమూ, శంకలను శమింపజేయటం వల్ల కలిగే మనోబలమూ, ధర్మ పక్షానికి సర్వదా కవచంగా నిలిచే ధర్మబలమూ, ఉత్సాహాన్ని వృద్ధి చేసే ఉత్ప్రేరకాలు.
– ఎం. మారుతిశాస్త్రి

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement