
ముక్తికి మార్గం
అప్పుడప్పుడే మొలకెత్తుతున్న ఒక చిన్న విత్తనం, భూమి పైపొరలను పెళ్ళగించుకుంటూ పైకి పొడుచు కొచ్చే దృశ్యంలో ‘చిదిమేస్తే చితికిపోయేంత మెత్తని హరిత పదార్థానికి అంత మహత్తరమైన శక్తి ఎలా వచ్చింది?’ ఆలోచిస్తే, ప్రతి విత్తనంలో ప్రకృతి నిక్షిప్తం చేసి ఉంచే శక్తి అంత బలమైనది కాబోలు! కంటితో చూడటానికి, చేతితో తాకడానికి వీలు కానటువంటి ఆ ప్రాణశక్తి, అత్యంత ప్రాథమిక రూపంలో బలం లేనిదిగా, బహు శక్తిహీనమైనదిగా కనబడటంలోనే ప్రకృతి రహస్యం దాగి ఉందనిపిస్తుంది. పదార్థంలో అలా కంటికి కనిపించక నిక్షిప్తమై ఉండే జీవశక్తిని ఏదైతే మేలుకొలిపి చైతన్యవంతం చేస్తుందో దానిని ‘సంకల్పం’ అని ఆధ్యాత్మికవేత్తలు పిలిచారు.
‘ఎవరిది ఈ సంకల్పం?’ అనే ప్రశ్నకు ‘ప్రకృతిలోని ప్రతి వస్తువులోనూ నిండి ఉండే భగవంతుడిది!’ అని సమాధానంగా చెప్పారు. ‘బీజం బంకురం బయినట్లు, సంకల్పంబు ప్రపంచంబగు, నీ సంకల్పంబు తాన జనియించి, తాన వర్ధిల్లి, తాన యణంగుచుండు’ అనే మాటలలో మడికి సింగన ‘వాసిష్ఠ రామాయణము’ తృతీయాశ్వాసంలోని ఒక వచన భాగంలో ఈ సంగతినే చెప్పాడు. ఒక విత్తనం లోంచి మొక్క పుట్టినట్లుగా, పరమాత్ముడి సంకల్పం నుండి పుట్టిన ఈ ప్రపంచం తానే పుట్టి, తానుగా వర్ధిల్లి, తానే అదృశ్యమైపోతుంది అని ఆ మాటల భావం. భగవంతుడి సంకల్ప ఫలితం అలా ఉండగా, మానవుడికి సంకల్ప ఫలం బంధానికి దారి తీస్తుందని అదే వచన భాగంలో ఇలా చెప్పాడు మడికి సింగన.
ఇదీ చదవండి: జలపాతం వద్ద రీల్స్ చేస్తూ కొట్టుకుపోయిన యంగ్ యూట్యూబర్
‘దీన సుఖంబు లేదు. దుఃఖం బాపాదించుచుండు, నట్లు గావున సంకల్ప భావన లుడిగి శుభంబు నొందుము.’ బంధంలో మనిషికి సుఖం దక్కదు. పైపెచ్చు దుఃఖాన్ని మిగుల్చుతుంది. అందువలన ఆ దుఃఖం నుండి తప్పుకోవాలంటే మనస్సులో అంకురించే ‘సంకల్ప భావనలకు’ స్వస్తి పలకడం తప్పనిసరి. అలా సుఖవంతులు కావడమే శ్రేయస్కరం – అని పై మాటల తాత్పర్యం. భగవంతుడి, భగవంతుడి సృష్టియైన మానవుడి సంకల్ప ఫలాలలో గల ఈ భేదాన్ని గుర్తించి వర్తించడం ముక్తిని కలిగిస్తుంది.
-భట్టు వెంకటరావు