moksha to soul
-
వైరాగ్యంతోనే ముక్తి
దుఃఖానికి మూలకారణం ఏది? అని ఆలోచిస్తే సాంసారిక విషయాలపై స్నేహభావం, ఆసక్తి, మోహం కలిగి ఉండడం అని అర్థమవుతుంది. జీవకోటి మొత్తం ఈ ఆసక్తిని, మోహ భావాన్ని ప్రదర్శించడం వలననే దుఃఖాన్ని పొందుతున్నది. కాల్చబడిన లోహపు ముద్దను ఒక కుండలోని చల్లని నీటిలో వేసినంతనే ఎలాగైతే ఆ చల్లని నీరు మొత్తం ఒక్కసారిగా వేడెక్కుతాయో అలా, మనస్సు దుఃఖంతో నిండి ఉన్నపుడు ఆ దుఃఖం ప్రభావం శరీరంపై కూడా పడి మనిషినిమొత్తంగా డీలా పడిపోయేలా చేస్తుంది.ధన పిపాసకు అంతం లేదు. ఆ కోరిక ఎన్నటికీ పూర్తిగా తీరేది కాదు. ఎల్లవేళలా సంతృప్తభావంతో సంతోషంగా ఉండ డాన్ని మించిన సుఖవంతమైనది మరొ కటి లేదు. ఆ కారణంగానే సంతోషాన్ని అన్నిటి కంటే ఉత్తమమైన గుణంగా విజ్ఞులు చెప్పారు.జలంతో అగ్నిని శాంతపరిచినట్లుగా జ్ఞానజలంతో మనిషి తన మానసిక దుఃఖాలను శమింపజేసి శాంతపర చాలి. మనస్సులో దుఃఖం ఎప్పుడైతే మాయమైపోతుందో, అప్పుడే మనిషికి శారీరక అస్వస్థత కూడా తగ్గడం ఆరంభమై, కొంతకాలానికి పూర్తి స్వస్థత చేకూరుతుంది. ఎలాగైతే తన లోనే నిక్షిప్తమై ఉండే అగ్ని రాజుకోవడం వలన పుట్టినమంటలో, కట్టె దహించుకుపోయి మండి బూడిదై మిగులు తుందో; ఆ విధంగానే, ఎవని ఆలోచనలు, మనసు అదు పులో ఉండవో ఆ వ్యక్తి తన శరీరం నుంచి ఉత్పన్నమయ్యే లోభత్వం, ఆకాంక్ష కారణంగా తన వినాశాన్ని తానే కొని తెచ్చుకుంటాడు.విప్రయోగే న తు త్యాగీ దోషదర్శీ సమాగమేవిరాగం భజతే జన్తుర్నిర్వైరో నిరవగ్రహః‘కోరుకున్న విషయ సుఖాలు దక్కని కారణంగా ఆ సుఖాలను త్యాగం చేసేవాడు విరాగి కాలేడు. విషయ సుఖాలు దొరుకుతున్నవాటిని కూడా త్యాగం చేసేవాడే నిజమైన త్యాగి అవుతాడు. అతడికి మాత్రమే వైరాగ్యభావం దక్కుతుంది. మనసులో ద్వేషభావం లేని కారణంగా బంధన ముక్తుడై ఎవరితోనూ వైరం లేనివాడు అవుతాడు’ అని వ్యాస మహర్షి విరచిత మహాభారతంలో ఉంది. శోకమగ్నుడై ఉన్న ధర్మరాజుకు శౌనకాది మహామునులకు మధ్య జరిగిన సంభా షణలోని పై శ్లోకం ఈ తత్త్వాన్ని బోధించింది.– భట్టు వెంకటరావు -
శాంతం–సంగీతం
వాగ్గేయకారులైన వారు రచించిన గీతాలు మహాకవులయిన ఇతరులు రచించిన పద్యాల సందర్భాల్లాగే ఉంటాయి. శివలింగం అంటే శివుడితో మాట్లాడుతున్నట్లే, ఇది విగ్రహం కాదు రాముడే, ఇది శిల కాదు.. అక్కడ ఉన్నది కామాక్షియే, అది మూర్తి కాదు సాక్షాత్ కృష్ణ పరమాత్ముడే.. అని పరవశాన్ని పొంది లోపలి భావాలను గీతాలుగా స్వరయుక్తంగా ప్రవహింపచేశారు. అవి అజరామరమై ఎన్ని శతాబ్దాలు గడిచినా రామాయణ, భారత, భాగవతాల్లాగే ఉండిపోతున్నాయి. వారికి అనేక శాస్త్రాల్లో నిష్ఠ ఉండేది. త్యాగరాజ స్వామివారి ‘‘మా జానకిచేతపట్టగ..’ కీర్తననే చూడండి.రామాయణాన్ని భవిష్యపురాణంతో కలిపారు. రామావతారంలోంచి శ్రీవేంకటేశ్వర అవతారం లోకి వెళ్ళింది. అంటే వారికి సమస్త పురాణేతిహాసాలు, వేదవేదాంగాలు సప్తధాతువుల్లో జీర్ణమయిపోయాయి. అన్ని సంగీత పరికరాల్లోకి అత్యంత ప్రధానమైన నాదోపాసనకు సాధనమైన వీణ మీద వీరు అధికారం పొందారు. ‘‘వీణావాదనతత్త్వజ్ఞః శృతిజాతి విశారదః తాళజ్ఞప్రయాసేన మోక్షమార్గం సగచ్ఛతి’’ ఎవరయితే ఆ వీణావాద తత్త్వాన్ని, నాదోపాసన చేయగలిగిన స్థితిని పొంది ఉన్నారో, సంగీతంలో ఉన్న అన్ని శబ్దాల గురించి పరిపూర ్ణజ్ఞానాన్ని పొంది ఉన్నారో, తాళం వినగానే తాళ లక్షణాల గురించి చెప్పగలరో వారు మోక్షమార్గంలో పోతున్నారనడం నిస్సందేహం. అంటే భారతీయ సంగీతం మోక్షానికి కారణం. త్యాగయ్య, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి, రామదాసు, అన్నమాచార్యులూ ఆ స్థితినే పొందారు. కేవలం మనోరంజకత్వం కాదు, భగవంతునిలో ఐక్యమయిపోవడానికి దివ్యసాధనంగా మనకు ఆ సంగీతాన్ని çపవిత్రమైన వస్తువుగా, గంగాజల భాండంగా, ఆవుపాల కుండగా అందించారు. వారి సంగీతం ఎంత గొప్పగా ఉంటుందో, సాహిత్యం కూడా అంత గంభీరంగా ఉంటుంది. వీరిలో మరో విశేషం కనపడుతుంది. అది సర్వకాల సర్వావస్థల్లో పరమ ప్రశాంతంగా ఉండగలిగిన స్థితి. మనం ఎంత సాధన చేసినా, ఏ యజ్ఞయాగాదులు, జపాలు, పూజలు చేసినా ఎక్కడో ఒకచోట శాంతం తప్పుతాం. అందుకే త్యాగరాజస్వామి అంటారు...‘శాంతములేక సౌఖ్యము లేదు...’ అని. శాంతం అంటే రాగద్వేషాలు లేకుండా ఉండడం. నాకిది కావాలని కానీ, నాకు వారంటే కోపం అని కానీ, వీరంటే చికాకని కానీ ఉండదు. ఎవరిమీదా ప్రేమా ఉండదు, ద్వేషం ఉండదు. రాగద్వేషా లు లేకుండా ఎలా ..? అమ్మ ఈ రెండే పట్టుకుని ఉంటుంది.‘‘రాగ స్వరూపపాశాధ్య క్రోధాంకారేంమేశోజ్వలా..’’ నన్ను ఉపాసన చేయగా చేయగా నీకున్న రాగం అన్న పాశం తీసి భక్తి అన్న పాశం వేసి నా దగ్గరకు లాక్కుంటాను... అంటుంది. అంకుశం పెట్టి పొడిస్తే ఏనుగు ఎంత బాధ పడుతుందో తన కోపం తన శత్రువయి అంత బాధపెడుతుంది. అందువల్ల రాగద్వేషాలు లేని ప్రశాంత స్థితిని పొందాలి. సాధన చేస్తున్నప్పుడు ఈ స్థితిని కొంతవరకే పొందగలం. కానీ ఎప్పుడూ అలా ఉండడం అంత సులభం కాదు. దానిని సాధ్యం చేసేది ఒక్క సంగీతం మాత్రమే. అలా సాధ్యం చేసి చూపారు మనకు వాగ్గేయకారులు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
జయలలితకు మళ్లీ అంత్యక్రియలు!
-
జయలలితకు మళ్లీ అంత్యక్రియలు!
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు ఆమె బంధువులు పవిత్ర నగరం శ్రీరంగపట్నంలో కావేరీ నదీ ఒడ్డున పశ్చిమవాహినిలో మళ్లీ అంత్యక్రియలు నిర్వహించారు. హిందూ ఆచారాల ప్రకారం ఆమెను దహనం చేయకుండా ఖననం చేసినందున ఆమె ఆత్మకు మోక్షం లభించదని, అలా జరగకూడదనే తాము మళ్లీ ఈ అంత్యక్రియలు చేస్తున్నామని తెలిపారు. ప్రధాన పూజారి రంగనాథ్ అయ్యంగార్ జయలలిత రూపానికి ప్రతిరూపంగా ఉండేలా ఒక బొమ్మను చేయించి, దానికి అంత్యక్రియలు చేయించారు. రాబోయే ఐదు రోజుల పాటు ఆమె ఆత్మశాంతి కోసం మరికొన్ని కార్యక్రమాలు చేయించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. జయలలితకు సోదరుడి వరసయ్యే వరదరాజు ఈ అంత్యక్రియలను దగ్గరుండి చేయించారు. ఆమె నమ్మకాలను పార్టీ సభ్యులు గౌరవించి ఉండాల్సిందని ఆయన భావించారు. తన సోదరి నాస్తికురాలు అయి ఉంటే ఆమె ఆలయాలకు వెళ్లేది కాదని, హిందూ ఉత్సవాల్లో పాల్గొనేది కాదని, అలాగే హిందూ సంప్రదాయాలను పాటించేది కాదని చెప్పారు. అసలు ఆమెను ఖననం చేయాలన్న నిర్ణయాన్ని పార్టీ ఎలా తీసుకుంటుందని వరదరాజు ప్రశ్నించారు. తామందరినీ అంత్యక్రియల నుంచి ఎందుకు దూరంగా పెట్టారని నిలదీశారు. జయలలిత డిసెంబర్ ఐదోతేదీ రాత్రి మరణించగా, ఆరోతేదీన ఆమెను ఖననం చేయగానే.. ఆమె అంత్యక్రియలను హిందూ మతాచారాల ప్రకారం చేయలేదన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. జయలలిత హిందూ ఆచారాలను గట్టిగా పాటిస్తారని, అందువల్ల అయ్యంగార్ ఆచారాల ప్రకారం అంత్యక్రియలు చేసి ఉండాల్సిందని కొంతమంది బంధువులు అన్నారు. ఆమెను ఖననం చేసిన తీరుపై మైసూరు, మేలుకోటె నగరాల్లో ఉండే జయ మేనల్లుళ్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. వాళ్లు కూడా తాజాగా నిర్వహించిన అంత్యక్రియల్లో పాల్గొన్నారు.