
పాలమూరు జిల్లాలోని శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానానికి 600 ఏళ్ల చరిత్ర
అళహరి వంశీయులచే దేవస్థానం స్థాపన
హనుమద్దాసుల ప్రచారంతో ఖ్యాతి గడించిన దేవస్థానం
శేషసాయి పడగనీడలో కొలువుదీరిన స్వామివారు
మహబూబ్‌నగర్ రూరల్: ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పేరెన్నికగన్న శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం కలియుగ వైకుంఠంగా బాసిల్లుతోంది. తెలంగాణ తిరుపతిగా ఖ్యాతికెక్కింది. కొలిచిన వారికి కొంగు బంగారమై విరాజిల్లుతోంది. మహబూబ్‌నగర్ నుంచి 17 కిలోమీటర్ల దూరంలో రాయచూర్ అంతర్రాష్ట్ర రహదారి పక్కన ఎత్తైన గుట్టలపై మన్యంకొండ దేవస్థానం కొలువుదీరింది. స్టేజీ నుంచి మూడు కిలోమీటర్ల మేర ఘాట్‌రోడ్డు గుండా వెళ్తే స్వామివారి దేవస్థానం ఉంటుంది. దాదాపు 600 సంవత్సరాల చరిత్ర గల స్వామి దేవస్థానం దినదినాభివృద్ధి చెందుతూ భక్తుల పాలిట ఇలవేల్పు దైవంగా మారింది.
తవ్వని కోనేరు, చెక్కని పాదాలు, ఉలి ముట్టని స్వామి ఇక్కడి ప్రత్యేకత. ఇంత విశిష్టత గల స్వామివారి దేవస్థానానికి ప్రతి ఏడాది వేలాది మంది భక్తులు వచ్చి దర్శించుకుంటారు. ప్రతి సంవత్సరం స్వామివారి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. కేవలం ఒక్క ఉత్సవాల్లోనే దాదాపు లక్షకు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకొని తరిస్తారు. ఏటా స్వామివారికి భక్తుల నుంచి దాదాపు రూ.1.50 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది.
దేవస్థానం చరిత్ర..
600 సంవత్సరాల క్రితం తమిళనాడులోని శ్రీరంగం సమీపంలోని అళహరి గ్రామ నివాసి అళహరి కేశవయ్య కలలో శ్రీనివాసుడు కనిపించి కృష్ణానది తీరప్రాంతంలో గల మన్యంకొండపై నేను వెలిసి ఉన్నానని సెలవిచ్చారు. దీంతో ఆయన తన తండ్రి అనంతయ్యతో పాటు కుటుంబసభ్యులతో కలిసి మన్యంకొండ సమీపంలో గల కోటకదిరలో నివాసం ఏర్పరుచుకొని గుట్టపైకి వెళ్లి స్వామివారికి సేవ చేయడం ప్రారంభించారు. కేశవయ్య దక్షిణాదిగల అన్ని దివ్యక్షేత్రాలు సందర్శించడం ప్రారంభించారు. ఓ రోజు కృష్ణానదిలో స్నానం చేసి సూర్యభగవానుడికి నమస్కరించి ఆయన దోసిలితో ఆర్ఘ్యం వదులుతున్న సమయంలో చెక్కని శిలారూపంలో గల వేంకటేశ్వరస్వామి ప్రతిమ నదిలో అలల ద్వారా వచ్చి కేశవయ్య దోసిలిలో నిలిచింది. దీంతో నదిలో నుంచి వచ్చి దోసిలిలో నిలిచిన విగ్రహాన్ని పరిశీలించగా.. ఆ విగ్రహం శ్రీనివాసుడిగా గుర్తించారు.

ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి మన్యంకొండపై శేషషాయి రూపంలో గల గుహలో ప్రతిష్టించి నిత్య ధూప దీప నైవేద్యంతో స్వామిని ఆరాధించడం ప్రారంభించారు. అంతేకాకుండా దేవస్థానం మండపంలో ఆంజనేయస్వామి, గరుడ్వాలర్ విగ్రహాన్ని కూడా ప్రతిష్టించారు. ఈ దేవస్థానం సమీపంలో మునులు తపస్సు చేయడంతో ఈ దేవస్థానం మన్యంకొండగా వినతికెక్కింది. దేవస్థానం ఎదురుగా ఉన్న గుట్టపై అప్పట్లో మునులు తపస్సు చేసిన గుహ ఇప్పటికీ ఉంది. కొన్నేళ్ల పాటు మన్యంకొండపై నిరంతరం పూజలు జరిగిన తర్వాత పూజలు ఆగిపోయాయి.
హనుమద్దాసుల కీర్తనలతో ఖ్యాతి..
అళహరి వంశానికి చెందిన హనుమద్దాసుల వారి కీర్తనలతో మన్యంకొండ ఖ్యాతి గడించింది. దీంతో ఆగిపోయిన స్వామి పూజలు మళ్లీ ప్రారంభమయ్యాయి. హనుమద్దాసుల వారు మళ్లీ పూజలు ప్రారంభించి స్వామివారికి సంబంధించి దాదాపు 300 కీర్తనలు రచించారు. ఈ కీర్తనలు అందరినీ ఎంతో ఆకట్టుకున్నాయి. దేవస్థానం చరిత్రను చాటి చెప్పాయి. హనుమద్దాసుల కృషిని తెలుసుకున్న గద్వాల, వనపర్తి సంస్థానాధీశులు మన్యంకొండకు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే స్వామివారి ఉత్సవాలకు తమవంతు ధర్మంగా అన్ని ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల్లో తమ సైనికులతో కలిసి ప్రతి ఏడాది మన్యం కొండకు వచ్చి స్వయంగా ఏర్పాట్లు చేసేవారు. ఏనుగులతో స్వామివారికి సేవా కార్యక్రమాలు నిర్వహించేవారు.

స్వామివారు నిజంగా ఉన్నారని నిరూపించడానికి హనుమద్దాసుల వారు ఎన్నో పనులు చేసి చూపించారు. అప్పట్లో ఆయన దేవస్థానం వద్ద కోనేరును తవ్వించడంతో పాటు పెద్దగుడి గంటను కూడా ఏర్పాటు చేశారు. ఆ గంట ఇప్పటికీ చైర్మన్ గది పక్కన కనిపిస్తుంది. హనుమద్దాసుల తర్వాత ఆయన వంశానికి చెందిన అళహరి రామయ్య దేవస్థానం బాధ్యతలు తీసుకున్నారు. వంశపారంపర్య ధర్మకర్తగా ఉండటంతో పాటు దేవస్థానం అభివృద్ధికి ఎంతో కృషి చేశారు.

స్వామివారి సేవ చేసిన అళహరి వంశీయులు వీరే..
మన్యంకొండ (Manyamkonda) స్వామివారి సేవలో అళహరి వంశీయులు చేసిన కృషి ఎంతో ఉంది. వారిలో అళహరి అనంతయ్య, కేశవయ్య, రంగయ్య, వెంకయ్య, పాపయ్య, హనుమద్దాసు, మేఘయ్య, అనంతయ్య, రామయ్య, వెంకటస్వామి, నారాయణస్వామి ఉన్నారు. ప్రస్తుతం అదే వంశానికి చెందిన అళహరి మధుసూదన్‌కుమార్ వంశపారంపర్య ధర్మకర్తగా కొనసాగుతున్నారు. దేవస్థానం స్థాపనకు కృషి చేసిన అళహరి వంశీయుల వంశవృక్షానికి తెలియజెప్పే చిత్రపటం దేవస్థానంలో ఏర్పాటు చేశారు. కొంతమంది ఫొటోలను కూడా ఏర్పాటు చేశారు.

తెలంగాణ తిరుపతి మన్యంకొండ
తిరుపతికి మన్యంకొండకు చాలా దగ్గరి పోలికలు ఉండటంతో తెలంగాణ తిరుపతిగా మన్యకొండను పిలుస్తారు. ఆర్థిక స్తోమత లేని భక్తులు మన్యంకొండకు వచ్చి స్వామివారిని దర్శించుకుంటే తిరుపతికి వెళ్లినంత పుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. తిరుపతిలో ఏడుకొండలు ఎక్కి స్వామివారిని దర్శించుకుంటారు. అలాగే మన్యంకొండలో కూడా దేవస్థానం చుట్టూ ఏడు కొండలు ఉన్నాయి. అంతేకాకుండా ఇలాంటి పోలికలు చాలా ఉన్నాయి. మన్యంకొండ దేవస్థానానికి చాలా మంది భక్తులు తమ సహకారం అందిస్తుండటంతో దేవస్థానం దినదినాభివృద్ధి చెందుతోంది.
చదవండి: 65 అడుగుల ఎత్తులో అద్భుత కట్టడం
ఒక్కొక్కరు ఒకరిగా.. ముందుకు
అళహరి మధుసూదన్‌కుమార్, చైర్మన్, మన్యంకొండ దేవస్థానం మన్యంకొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం కలియుగ వైకుంఠంగా బాసిల్లుతోంది. తవ్వని కోనేరు, చెక్కని పాదాలు, ఉలి ముట్టని స్వామివారు ఇక్కడ ప్రత్యేకం. ఇంత విశిష్టత గల స్వామివారిని వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. స్వామివారి సేవలో అళహరి వంశీయుల కృషి ఎంతో ఉంది. వంశీయుల్లో ఒక్కొక్కరు ఒకరిగా ముందుకు నడుస్తున్నాం. ప్రస్తుతం స్వామివారి సేవలో తాను పదవ తరం వంశీయుడిగా కొనసాగుతున్నా. ప్రతి సంవత్సరం స్వామివారి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తాం. రాష్ట్రంలోనే ఆదర్శ దేవస్థానంగా తీర్చిదిద్దడానికి తమవంతు కృషి చేస్తున్నాం.